అంతటా వారే.. అందరికీ బంధువులే !

సేవాభారతి

కష్టకాలంలో పేదల బాధలు ఎలా ఉంటాయో సేవాభారతి కార్యకర్తలు దగ్గరగా వెళ్లి చూశారు. పేదరికం దుర్భరం. దీనికి లాక్‌డౌన్‌ ‌తోడైంది. ఇది తెచ్చిన ఇక్కట్లు కార్యకర్తల అనుభవంలోకి వచ్చాయి. ఏ కొద్ది సాంత్వన అయినా దొరుకుతుందేమోనని ఎదురుచూస్తున్నవారే వారంతా. వికలాంగులు కొందరు. ఇంటి యజమానిని కోల్పోయినవారు ఇంకొందరు. అన్నీ ఉన్నా ఏమీ లేనివారిగా మిగిలిన వృద్ధులు. ఇప్పటికీ గూడు లేని వారు. ఏదో ఒక ఆధారం కోసం అలమటించే చిన్నారులు. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉండిపోయి, బయటకు వెళ్లలేక మెతుకుకు నోచుకోలేకపోతున్నవారు ఎందరో ! ఏ మూల, ఏ వీధిలో చూసినా కనిపిస్తున్నారు. ఈ స్థితిలో ఆపన్నులను ఆదుకోవడానికి సమాయత్తమైంది సేవాభారతి. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు సేవాభారతి కార్యకర్తలు తీసుకువెళ్లి అందించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తాము చేస్తున్న సేవ ప్రాణాల మీదకు తెచ్చేదేనని వారికి తెలియక కాదు. అయినా కదిలారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూనే తెలంగాణలో చాలా గ్రామాలలో, పట్టణాలలో ఇల్లిల్లూ తిరుగుతూ బాధితులను పలకరించారు. వారి ఇక్కట్లు తీర్చేందుకు శ్రమించారు. ఇందుకు సాధారణ పౌరులు, పోలీసులు కూడా సాయం అందించారు. కార్యకర్తల సేవానిరతిని అధికారులు మెచ్చుకున్నారు. కోటీశ్వరులైన ధర్మాత్ములతో పాటు ఉడతాభక్తిగా కొందరు దినసరి కూలీలు సైతం దాతృత్వ గుణం చూపగలగడం కార్యకర్తలకు తటస్థించిన అద్భుత అనుభవం. లాక్‌డౌన్‌ ‌ప్రకటించిన నాటి నుంచి ఈ వ్యాసం అందే వరకు సేవాభారతి నిర్వహించిన సేవా కార్యక్రమాల మీద విహంగ వీక్షణం- ఇక్కడ.

బర్కత్‌పురా

బర్కత్‌పురాలోని బతుకమ్మ కుంట, 6 నెంబర్‌, ‌శివమ్‌ ‌రోడ్‌, ‌హబ్సిగూడా గాంధీ గిరిజన బస్తి, టీవీ స్టూడియో, హోమియోపతి హాస్పిటల్‌ ‌కోరంటైన్‌ ‌సెంటర్‌, ‌లక్ష్మీ నారాయణ కాలనీ, దేవేందర్‌ ‌నగర్‌ ‌కాలనీ, బాలకృష్ణ నగర్‌, ఇలా అనేక సేవా బస్తీలలో ప్రతి రోజు అల్పాహారం పంపిణీ పంపిణీ చేశారు. ఫిబ్రవరి, మార్చిలో హోమియోపతి మెడిసిన్‌ ‌కరోనా ప్రేవెంటివ్‌ 2 ‌లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు. బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, ‌కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, నుండి వలస వచ్చిన కూలీలకు రేషన్‌ ‌కార్డ్ ‌లేనివారికి, నిత్యావసర సరుకులు అందచేశారు. వివిధ కుల వృత్తుల నుండి పేద వారిని గుర్తించి వారికి కూడా నిత్యావసర సరుకుల కిట్లు అందించారు. భారత ప్రభుత్వం నిర్దేశం మేరకు ప్రతిరోజు సేవా బస్తిలలో ఏడువేల కుటుంబా లకు కషాయం పంపిణీ చేశారు.

గడిచిన రెండు నెలల నుండి నిత్య సేవ కార్యక్రమాలకి నేరుగా పాల్గొన లేని వారు ఆర్థికంగా సహాయం చేసారు. వైద్యులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, బర్కత్‌పురా జిల్లా స్వయంసేవకులు తమ దాతృత్వాన్ని చాటుకొన్నారు. బర్కత్‌పురా సంఘజిల్లాలో 2500 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు అందించారు.

దిల్‌సుఖ్‌నగర్‌ ‌భాగ్‌

‌దిల్‌సుఖ్‌నగర్‌•లో 3714 కుటుంబాలకు నిత్యావసర సరుకులు (బియ్యం, పిండి, పప్పు, చింతపండు, ఉల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు, నూనె) 5,140 కుటుంబాలకు కూరగాయలను, 11,290 భోజన పాకిట్స్, 2250 ‌మాస్క్‌లు, 300 శానిటైజర్స్, 1350 ‌బిస్కట్‌ ‌ప్యాకెట్స్, 2000 ‌మందికి మజ్జిగ పంపిణి చేశారు. ఇవే కాకుండా నాగోలు నుంచి ఎల్‌.‌బి.నగర్‌ ‌క్రాస్‌రోడ్‌ ‌నుండి దిల్‌సుఖ్‌నగర్‌ ‌రాజీవ్‌ ‌చౌక్‌వరకు రహదారిలో ఉన్న పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, విద్యుత్‌ ‌విభాగంలో పనిచేసే కార్మికులకు రోడ్డుపైన ఉన్నటువంటి పేదలకు ప్రతి నిత్యం తేనీరు, అల్పహారం 23 రోజులపాటు వితరణ చేశారు. కాడ కషాయం ఇళ్లలో తయారుచేసి 13 వేల 120 మందికి అందించారు. ఈ కార్యక్రమాల్లో 298 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.

పాలమూర్‌

‌పాలమూరులో మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 21 ‌వరకు 23 రోజుల పాటు నిత్య అన్నదానం నిరాటంకంగా సాగింది. దామరగిద్ద మండల కేంద్రంలో హిందూ బంధువులు తను, మన, ధన రూపకంగా అందించిన విశేష సహకా రంతో కార్యక్రమం విజయవంతమైంది. ఇందులో భాగంగా గ్రామంలోని 52 మంది లబ్ధిదారులకు రోజూ రెండు పూటలా భోజనం వితరణ చేశారు. 25 మంది నిరుపేదలను గుర్తించి 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున సరుకులు కూడా అందజేశారు.

ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌లోని భైంసా తదితర ప్రాంతాల్లో సేవాభారతి కార్యకర్తలు నాందేడ్‌ ‌రోడ్డులో నడుస్తూవెళ్తున్న కూలీలకు, విద్యార్థులక•, లారి డ్రైవర్‌లకు అన్నం, మజ్జిగ బిస్కెట్లు, నిమ్మకాయ లతో పాటు కాళ్లకు పాదరక్షలు అందచేశారు. మధుమేహం, రక్తపోటు, గుండె పోటు, థైరాయిడ్‌, అస్తమా వంటి దీర్ఘకాల వ్యాధిగ్రస్తు లకు నిరంతరం మందులు కావాలి. అలాంటి వారి కోసం స్థానికంగా మందులు దుకాణాలు లేని గ్రామీణ ప్రాంతవాసులు వాటి కోసం భైంసా పట్టణానికి వచ్చిపోయేందుకు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను గుర్తించిన సేవాభారతి కార్యకర్తలు మందులను తీసుకెళ్లి అందిస్తున్నారు. రోగులు చరవాణి ద్వారా సేవాభారతి ధన్వంతరి కార్యకర్తలకు వైద్యుడు రాసిన మందుల చీటీని వాట్సప్‌ ‌ద్వారా పంపించగానే కార్యకర్తలు వెంటనే స్పందించి పట్టణానికి సుమారు 10-12 కి.మీ. దూరంలోని గ్రామాలకు వాటిని తీసుకెళ్లి అందిస్తున్నారు. ఇప్పటివరకు ఇలేగాం, లింబా, మాటేగాం, కుంబి, చుచుంద్‌, ‌బోసి, సుంక్లి గ్రామాల రోగులకు మందులను అందజేశారు.

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్లలో కరోనా సహాయక చర్యల్లో భాగంగా 60 మంది స్వయంసేవకులు రంగంలోకి దిగారు. పారిశుధ్య కార్మికులకి కృతజ్ఞతగా రోడ్లు శుభ్రం చేశారు. నగర కమిషనర్‌ ‌సూచించిన విధంగా సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రధాన రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు. రెండు రోజులపాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో ప్రతి రోజు ఉదయం 5 గంటలకే ప్రారంభించి 8 వరకు శ్రమ సేవ చేశారు. అదేవిధంగా 125 నిరుపేద, కూలీ కుటుంబాలని గుర్తించి నిత్యావసర వస్తువులు అంద జేశారు. 3 బస్తీల్లో 500 మందికి పైగా కషాయం పంపిణీ చేశారు. దయానంద మెమోరియల్‌ ‌ట్రస్ట్ ‌సహకారంతో 20 రోజులపాటు నిత్యం 200 మంది కొరకు రాగి జావని స్వయంసేవకులు అందజేశారు.

వరంగల్‌

‌వరంగల్‌ ‌జిల్లాలో మార్చి 23 నుండి దాతల సహకారంతో వరంగల్‌ అర్బన్‌, ‌వరంగల్‌ ‌రూరల్‌, ‌జనగామ, ములుగు, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలో 18 రకాలైన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

టెలీమెడిసిన్‌ ‌ద్వారా ఉచితవైద్యసేవలు

లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో సాధారణ వైద్యసేవల కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సేవాభారతి, వరంగల్‌ ‌శాఖ సేవాదృక్పథంతో విధులు నిర్వహించే అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద వైద్యుల ద్వారా వైద్యసేవలు ప్రారంభించింది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ సమయంలో ఫోన్‌, ‌వాట్స్‌ప్‌ ‌విడియో కాల్స్ ‌ద్వారా డాక్టర్లకు విషయం తెలియజేస్తే తగిన మందులను సూచిస్తూ సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. లాక్‌డౌన్‌ ‌వల్ల అడుగు బయట పెట్టని పరిస్థితి ఉండటంతో ఈ అవకాశాన్ని వరంగల్‌•లో పలువురు రోగులు ఈ సేవలు ఉపయోగించుకొన్నారు.

రోగుల బంధువుల ఆకలి తీర్చిన వ్యాపారవేత్త

ఉత్తర తెలంగాణ జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో లాక్‌డౌన్‌ ‌సందర్భంగా రోగుల సహాయకులకు భోజనం లభించక అవస్థలు పడుతుంటే అక్కడే పనిచేస్తున్న వైద్యుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వరంగల్‌ ‌మహానగర సహ సంఘచాలక్‌ ‌డా. మోహన్‌రావు గమనించారు. వెంటనే నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముందాడ వేణుగోపాల్‌ ‌దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. ఆయనతో మాట్లాడి ప్రతిరోజు పదిహేను వందలమంది రోగుల సహాయకు లకు ఆహార పొట్లాలను తయారు చేయించి సేవాభారతి కార్యకర్తల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు.

మౌజాం, పాస్టర్లుకు నిత్యావసరసరుకులు పంపిణీ

వరంగల్‌ ‌నగరంలోని కాజీపేట పట్టణంలో భవానినగర్‌లో ఒక చిన్న చర్చి నిర్వహిస్తున్న పాస్టర్‌ ‌లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్వయంసేవకులు తెలుసుకొన్నారు. ఆ కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఇదే ప్రాంతంలోని మసీదులో మౌజం నమాజ్‌ ‌కూడా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని ఆ కుటుంబానికి కూడా సేవాభారతి , కాజీపేట కార్యకర్తలు నిత్యావసరసరుకులు, కూర గాయలు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటు కున్నారు.

కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడానికి శానిటైజర్లు, మాస్కుల తయారీ, పంపిణీ

వరంగల్‌లో కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడానికి సేవాభారతి వందల సంఖ్యలో శానిటైజర్లను, 50 వేల మాస్కులను యుద్ధ ప్రాతిపదికన తయారు చేయించి గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వ్యవసాయకూలీలకు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారికి, ఆటోడ్రైవర్లు, ట్రాక్టర్ట్ ‌డ్రైవర్లకు యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేశారు.

సోషల్‌ ‌డిస్టెన్స్ ‌ప్రజలకు అవగాహన

కరోనా నేపథ్యంలో రేషన్‌ ‌కార్డు దుకాణాల వద్ద, బ్యాంకులవద్ద, ఏటీఎం కేంద్రాలవద్ద, దుకాణాలవద్ద, ఎరువుల దుకాణాలువద్ద, పోస్ట్ఆఫీసుల వద్ద వందలాదిమంది గుమికూడి ఉండటాన్ని గమనించిన సేవాభారతి కార్యకర్తలు ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో సున్నంతో సర్కిల్స్ ‌చేసి వాటిమధ్య ఫిజికల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించేలా నిలబెడుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.

కరోనా వైరస్‌ ‌మహమ్మారి ప్రమాద తీవ్రతపై సేవాభారతిచాటింపు

 కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌విధించడంతో గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో ఉన్న సేవాభారతి కార్యకర్తలు డప్పు చాటింపు ద్వారా, ఆటోలకు మైకులు అమర్చుకొని వీధి వీధిన తిరుగుతూ కరోనా వైరస్‌ ‌సోకకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలు, లాక్‌డౌన్‌ ‌సందర్భంగా ప్రజలు అనుసరించాల్సిన పద్ధతుల గురించి చాటింపు వేశారు. అంతేకాకుండా శ్రమదానం చేసి వీధులను శుభ్రం చేయడంతోపాటు, హైపోక్లోరైడ్‌ ‌ద్రావణాన్ని స్వయంగా పిచికారి చేశారు. జిల్లా కేంద్రం వైద్య సిబ్బంది 60 మందికి మజ్జిగ, ఆయుర్వేద బిస్కెట్స్ ‌ప్యాకెట్లు సరఫరా చేశారు.

నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

కరోనా నేపథ్యంలో ఇల్లుదాటి బయటకురాని పరిస్థితి ఏర్పడడంతో, కూలి-నాలీ చేసుకోలేక, చేతిలో చిల్లిగవ్వ కరువై పస్తులు పడుకుంటున్న వరంగల్‌ ‌నగరంలోని 1500 వందల మంది నిరుపేద కుటుంబాలకు సేవాభారతి, వరంగల్‌ ఆధ్వర్యంలో ఈనెల 6 నుండి ఇప్పటివరకు భోజనంతో పాటు నిత్యావసరవస్తువులు పంపిణీ చేస్తున్నారు.

వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవకులు ఏడు నగరాలుగా విభజించారు. అక్కడ ఉన్న స్వయంసేవకులను ఒక జట్టుగా ఏర్పాటు చేశారు. నగరంలో ఎంతమంది పేద ప్రజలు నిత్యావసరసరుకులు లేక ఇబ్బందులు పడుతున్నారో సర్వే చేయించి ఆ పేద కుటుంబాలకు సరుకులు అందచేశారు.

మే 10న వెంకటాపురం మండలంలోని పెంకవాగు గ్రామంలో 36 కుటుంబాలకు, కలిపాక గ్రామంలో 32 కుటుంబాలకు వంట సామాగ్రి నిత్యావసరవస్తువులు కూరగాయలు, మాస్కులు 230 అందజేశారు.

జనగామ రఘునాథపల్లి ఖండలో కాంచనపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమంలో 60 మంది వృద్ధులకు ప్రతిరోజు ఆహారం, కిషన్‌ ‌గ్రామంలోని నిరుపేదలకు ఐదు కేజీల బియ్యం, నిత్యావసర కూరగాయలు స్వయంసేవకులు అందించారు.

 లక్నో (ఉత్తరప్రదేశ్‌) ‌కు చెందిన గృహ నిర్మాణ వలస కార్మికులు పనులు కోల్పోయి ఇబ్బంది పడుతున్న వలసకూలీలు 14 మందికి (భవానినగర్‌) ‌సేవాభారతి ఆధ్వర్యంలో గోధుమ పిండి నూనె, కందిపప్పు, మిర్చిపౌడర్‌, ‌పసుపు పౌడర్‌, ఉప్పు, ఉల్లిగడ్డ ఆలుగడ్డ, సబ్బులు మొదలగు తొమ్మిది రకాల సుమారు 6 వేల రూపాయల విలువ గల వస్తువులను గోకుల్‌ ‌నగర్‌ / ‌భవానినగర్‌ ‌స్వయంసేవకులు సహాయం చేశారు.

వడ్డేపల్లిలోని బృందావనం అపార్ట్‌మెంట్‌లో సుమారు 15 క్వింటాళ్లు బియ్యం, నిత్యవసర వస్తువులు సేకరించి దగ్గర్లో ఉన్న పేదవారికి పంపిణీ చేశారు. దీనిద్వారా 250 కుటుంబా లకు 15 రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు పంపిణీ జరిగింది.

లక్ష్మీదేవిపేటలో ప్రతిరోజూ ఉదయం 8గం నుండి 1గం.ల వరకు యువత స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా సామాజిక దూరంకోసం సున్నపు డబ్బాలను సేవాభారతి కార్యకర్తలు వేశారు. దీని కారణంగా పెన్షన్‌ ‌దారులు క్రమపద్ధతిలో పెన్షన్స్ ‌తీసుకోవడానికి వీలైంది. తమ పని ఆటంకాలు లేకుండా జరగడంతో ప్రభుత్వ అధికారులు, పెన్షన్‌ ‌కార్యాలయ సిబ్బంది కార్యకర్తలను ఎంతగానో మెచ్చుకొన్నారు.

కామారెడ్డి

లాక్‌డౌన్‌ ‌కారణంగా అనేక మంది వలస కార్మికులక• ఆంక్షలు సడలించిన నేపథ్యంలో వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. కొందరు రవాణ వాహనాలలో (లారీలలో) బయలుదేరగా, ఎక్కువ మంది కాలినడకన, సైకిల్‌లపైన బైక్‌లపై ప్రయాణామయ్యారు. ఆకలిదప్పులతో తమ బతుకు ప్రయాణాన్ని ప్రారంభంచిన ఈ వలస కార్మికులకు సేవాభారతి కామారెడ్డి అండగా నిలిచింది. ఏప్రిల్‌ 20 ఉదయం నుంచి నేటి వరకు జిల్లాలో, ఎన్‌హెచ్‌-44 ‌జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌, ‌కామారెడ్డి వద్ద టేక్రియాల్‌ ‌చౌరస్తాలో అల్పాహారం, భోజన ప్యాకెట్లు, మంచినీరు వితరణ నిరంతరంగా చేస్తున్నారు. మండుటెండలో పాదరక్షలు లేకుండా నడుస్తూ వెళ్తున్న వారికి పాదరక్షలు పంపిణీ చేశారు. ఇతర సేవా సంస్థలతో నిత్యం సమన్వయం చేసుకుంటూ వలస కార్మికుల ఆకలి దప్పులను తీర్చడమే ధ్యేయంగా 200 మంది స్వయం సేవకులు దాతల సహాయంతో కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.

కబురు అందడమే ఆలస్యం.

ఏప్రిల్‌ 29 ‌రాత్రి 10.00 గం.ల సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 800 మంది మత్స్య కార్మికులు గుజరాత్‌ ‌నుండి స్వస్థలాలకు బయలుదేరారు. వారికి రాత్రి భోజనం ఏర్పాటు చేయాలని ఒక గంట ముందు సమాచారం అందగానే సేవాభారతి, కిసాన్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తలు, ఔత్సాహికుల సహాయంతో టేక్రియల్‌ ‌చౌరస్తా వద్ద వారందరికీ సరిపడా ఆహార పొట్లాలు అందజేశారు. కేవలం గంట వ్యవధిలోనే సమాచారం అందుకుని అనేకమంది మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.

వనరులు సమకూర్చిన కిసాన్‌ ‌సంఘ్‌ ‌రైతులు

నిత్యం పంట పొలాల్లో ఆరుగాలం కష్టపడే రైతులు సైతం సేవాభారతి ద్వారా నిర్వహిస్తున్న ఈ సహాయ కార్యక్రమాల్లో పాలుపంచు కొన్నారు. అటుకుల ప్యాకెట్లు, మంచి నీటి బాటిల్‌లు, చపాతీలు అందిస్తూ కావలసిన అన్ని రకాల వనరులను సమకూర్చడమే కాకుండా ప్రతినిత్యం వితరణలో ప్రత్యక్షంగా సేవలందిస్తున్నారు. పంట పొలాల్లో విరామం లేకుండా గడిపే రైతులను ఇక్కడ ఎలా సమయం దొరికింది అని ప్రశ్నించగా.. అన్నార్తుల ఆకలి తీర్చడంలో దొరికిన సంతృప్తి మరి ఎక్కడ దొరుకుతుంది అని బదులు ఇవ్వడం విశేషం.

మెదక్‌ ‌జిల్లా

మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ ‌ఖంఢ కేంద్రంగా సేవాభారతి ఆధ్వర్యంలో సుమారు 200 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల (కిట్‌) ‌లను అందచేశారు. పరికిబండ, గౌతోజి గూడెం, తుపాకుల పల్లె గ్రామాలలో తమ బ్యాంకు ఖాతాలలో డబ్బు ఉండి చేతికి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారి ఎటిమ్‌ను పెటియం మిషన్‌ ‌ద్వారా స్వైప్‌ ‌చేసి ఎలాంటి చార్జీలు తీసుకోకుండా 30 మందికి సేవాభారతి కార్యకర్తలు డబ్బులు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *