అక్రమ చర్చిలపై చర్యల విషయంలో ముందుకెళ్లి, హఠాత్తుగా వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం

అక్రమంగా నడుస్తున్న చర్చిలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వమే అనూహ్యంగా ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. సరైన అనుమతులు లేకుండా పంచాయతీ పరిధిల్లో నడిపిస్తున్న చర్చిలను గుర్తించి, వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఫిబ్రవరిన జీవో నెంబర్ 2712164/CPR&RD/D8/2024 జారీ చేసింది. తాజాగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకుంటూ మరో జీవో జారీ చేయడం సంచలనానికి దారి తీసింది.

రాష్ట్రంలో వున్న 26 జిల్లాల్లోనూ అక్రమంగా నడుస్తున్న చర్చిలపై చర్యలు తీసుకోవాలని జీవో నెంబర్ లో ప్రభుత్వం పేర్కొంది. పశ్చిమ గోదావరి పాలకొల్లు నివాసి ప్రసన్నకుమార్ పెద్దిరెడ్డి వేసిన పిటిషన్ కి సమాధానంగా అప్పట్లో ప్రభుత్వం చర్చిలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అయితే మార్చి 5 వ తేదీన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటూ కొత్త జీవో జారీ చేశారు.

పంచాయతీ కమిషనర్ నుంచి ఆదేశాలు అందగానే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, జిల్లా పంచాయతీ అధికారి, రెవిన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలిచ్చేశారు.నియమ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్టు కూడా అడిగారు.అయితే… ఇంతలోనే మార్చి 5 న ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంతో అప్పటి ఉత్తర్వులను రద్దు చేస్తూ… కొత్త జీవోను జారీ చేశారు. ఈ జీవోపై పంచాయతీ శాఖ OSD ఆనంద్ సంతకం కూడా వుంది. పాత సర్క్యులర్ ను వెంటనే విస్మరించి, విచారణను ఆపేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

ఈ ఆకస్మిక యూటర్న్ పై ఏపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సామాజిక కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు. దీనిపై ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇంతటి కీలకమైన ఆదేశాలపై ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని, దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ చర్చిలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వాటిపై మౌనం వహిస్తోందని, ఈ మౌనమే అక్రమ చర్చిల వ్యాప్తికి కారణమవుతోందని దుయ్యబట్టారు. దీంతో మతపరమైన జనాభా సంఖ్యలో తీవ్రమైన మార్పులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

మరో వైపు ఇదే నిర్ణయంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు ఏఎస్. సంతోష్ కూడా స్పందించారు. ఇంతటి తీవ్రమైన విషయాలపై నిర్ణయం తీసుకోకుండా రాజకీయ ఒత్తిళ్లకు లొంగం సరైంది కాదని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే అవుతుందన్నారు. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల ఒత్తిళ్లకు లొంగిపోకుండా చట్టపరమైన పాలనను కొనసాగించాలని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం మౌనంగా వుండటం సరికాదన్నారు.

రెండు దశాబ్దాలకు పైగా ఏపీలో అనధికార చర్చిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో. దీంతో జనాభాలో అసమతౌల్యత, సాంస్కృతిక క్షీణత, సామాజిక అంశాతి కూడా రేకెత్తుతోంది. వైఎస్. జగన్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో హౌజ్ చర్చిల సంఖ్య విపరీతంగా పెరిగింది. క్రైస్తవ పాస్టర్లు పరిపాలన వ్యవహారాల్లో కూడా చొచ్చుకొచ్చి, తమ ప్రభావం చూపారు. ఇప్పుడు అందరి దృష్టి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై పడుతోంది. అక్రమ చర్చిలపై సరైన నిర్ణయం తీసుకుంటారని అందరూ ఎదురు చూస్తున్నారు. వీటిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *