అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదు : జైశంకర్
అమెరికా నుంచి భారతీయులను స్వదేశానికి పంపడంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదని, అయితే.. తరలింపు సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. అమెరికాలో ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొనసాగుతూనే వుందని, ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదన్నారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోందని, తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా వుంటే వారిని స్వస్థలాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యత అని జైశంకర్ వివరించారు.
ఇక… తరలింపులో వారికి గొలుసులు కట్టారన్న దానిపై కూడా జైశంకర్ వివరణ ఇచ్చారు. వలసదారులను ఎయిర్ క్రాఫ్టులో తరలించే విధానాన్ని 2012 నుంచి అమలు చేస్తుండగా… నిబంధనల ప్రకారం వారిని నిర్బంధిస్తారన్నారు. అత్యవసరం, దేహ బాధలు వ్చిన సమయంలో అవసరమైతే వాటిని తొలగిస్తారన్నారు. సైనిక ఎయిర్ క్రాఫ్ట్, చార్టర్డ్ విమానాల్లోనూ ఇది వుంటుందన్నారు. అయితే చిన్నారులను, మహిళలను నిర్బంధించలేదన్న సమాచారం తమకు ఇచ్చారని జైశంకర్ వెల్లడించారు.