అఖండ భారత్ కల్పన కాదు, సంకల్పం
కొద్దిరోజుల క్రితం ముంబైలో ‘కరాచీ స్వీట్ మార్ట్’ అనే దుకాణం పేరు మార్చమంటూ ఒక శివసేన కార్యకర్త దుకాణాదారుడిని హెచ్చరించాడు. కరాచీ పాకిస్తాన్లో నగరం కనుక, పాకిస్తాన్ ఎప్పుడు భారత్‌లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికే ప్రయత్నిస్తోంది కనుక ఆ పేరు మార్చాలన్నది ఆ కార్యకర్త వాదన. దుకారణాదారుడు కూడా గత్యంతరంలేక ‘కరాచీ’ అనే పదంపై ఒక తెల్లకాగితం అంటించాడు. అక్కడితో వివాదం సమసిపోయింది. కానీ ఈ సంఘటనతో తమకు ఏ సంబంధం లేదని శివసేన ప్రకటన జారీచేసినట్లు పత్రికల్లో వచ్చింది.
అయితే అసలు పాకిస్తాన్‌లోని కరాచితోపాటు వివిధ ప్రాంతాలనుంచి వేలాదిమంది భారత్‌కు తరలివచ్చిన వైనం, వాళ్ళు అలా వలసరావడానికి గల కారణాలు, ఆ చరిత్ర శివసేన కార్యకర్తకు తెలుసా? వారికి అక్కడ భద్రత లేక తమ దేశంలోనే శరణర్ధులుగా మరొక చోటకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. అలా వచ్చిన వారు కష్టపడి పనిచేస్తు ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చేసి పలువురికి ఉపాధి కూడా కల్పించారు. ముఖ్యంగా సింద్ ప్రాంతం నుంచి వచ్చినవారు ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, సంపదను సృష్టించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అనేక విద్యా సంస్థలు స్థాపించారు. వీటివల్ల సమాజానికి ఎంతో మేలు జరిగింది. ఏ ప్రాంతం నుంచి తరలి వచ్చామో ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవడం అప్పటివారికేకాదు, ఈ తరం వారికి కూడా అవసరమే. ఎందుకంటే ఎప్పటికైనా మళ్ళీ తమ స్వస్థలానికి వెళ్లాలనే ఆలోచన దాని వల్ల కలుగుతుంది.
మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 14న ‘అఖండ భారత్ దిన్’ జరుపుతూ ఉంటారు. అందులో పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటూ ఉంటారు. దేశ విభజన విషాద గాధ గురించి చెప్పి, అఖండ భారతాన్ని తిరిగి సాధించాలన్న సంకల్పాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ విషయం ఆ శివసేన కార్యకర్తకు తెలియక పోవచ్చును. దేశ విభజన కృత్రిమమైనదని యోగి అరవిందులు అప్పుడే చెప్పారు. కాబట్టి కృత్రిమమైనది శాశ్వతంగా నిలబడే అవకాశం లేదు, ఉండదు. ఏదో ఒక రోజు భారత్ తిరిగి అఖండ దేశంగా విరాజిల్లుతుంది. కరాచీ నుంచి తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాము, తిరిగి ఎప్పటికైనా కరాచీకి వెళ్ళాలి అనుకోవడం తప్పేమీ కాదు. ఇదే విషయం రాబోయే తరాలవారికి కూడా తెలిసేట్లుగా ‘కరాచీ’ అనే పేరు ఉపయోగించడం కూడా దోషమేమి కాదు.
అఖండ భారత్ ప్రస్తావన రాగానే కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇది సామ్రాజ్య విస్తరణ కోసం చెప్పే మాట కాదని గుర్తించాలి. ఆంగ్లేయ పాలన ప్రారంభం కాకముందు ఒకే రాజు పాలనలో లేకపోయినా ఈ దేశం ఒక్కటిగానే ఉంది. సాంస్కృతిక ఏకత్వం ఈ దేశాన్ని ఒకటిగా నిలిపి ఉంచిందన్న విషయం గ్రహించాలి. ఆధ్యాత్మికత ఆధారంగా ఏర్పడిన ఏకాత్మ దృష్టి ఈ దేశపు ప్రత్యేకత. నిజానికి హిందూత్వం అంటే ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వమనే విషయం గుర్తుపెట్టుకుంటే రాజకీయ వివాదాలు, విమర్శలు రావు. భారతీయుల తీర్థ, పవిత్ర స్థలాలు ఈ ప్రాంతం మొత్తంలో ఉన్నాయి. హింగలాజ్ దేవి మందిరం, నాన్ కానా సాహిబ్ గురుద్వారా నేడు పాకిస్తాన్లో ఉన్నాయి. ఢాకేశ్వరి దేవి మందిరం బంగ్లాదేశ్ లో ఉంది. పశుపతినాధ్ దేవాలయం, సీతాదేవి జన్మస్థలమైన జనక్ పురి నేపాల్‌లో ఉన్నాయి. రామాయణంలో మనకు కనిపించే చాలామటుకు ప్రదేశాలు నేడు శ్రీలంకలో ఉన్నాయి. బ్రహ్మదేశం, శ్రీలంక, టిబెట్, భూటాన్‌ల లోని బౌద్ధుల పవిత్ర స్థానాలు భారత్‌లో ఉన్నాయి. కైలాస మానససరోవర్ యాత్రను భారతీయులు వేల సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు.
ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వాన్ని సూచించే విధంగా ఇక్కడివారు తమ పిల్లలకు వేరే ప్రాంతాల లోని స్థలాలు, నదుల పేర్లు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు కర్ణాటకు చెందిన ఒక కుటుంబం గుజరాత్లో ఉండేది. ఆ కుటుంబంలో ఇద్దరు అమ్మాయిల పేర్లు సింధు, సరయూ. సరయూ నది కర్నాటకలో లేదు. అలాగే సింధు నది అయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది కాబట్టి, సింధూ నది ఆ దేశంలో ఉంది కాబట్టి ‘మీ అమ్మాయి పేరు మార్చండి’ అంటూ హెచ్చరిస్తే పరిస్తితి ఏమిటి? కర్ణావతిలోని ఇస్రోలో పనిచేసే ఉత్తర్ ప్రదేశ్ శాస్త్రవేత్త కుమార్తె పేరు కావేరీ. గుజరాత్ భావనగర్‌కు చెందిన ఒక అమ్మాయి పేరు ఝెలమ్. విదర్భలో పుట్టిన మరో అమ్మాయి పేరు రావి. ఇలా వేరే ప్రాంతాలకు చెందిన పేర్లు ఎలాంటి సంకోచం లేకుండా పెట్టుకోవడానికి కారణం ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వమే.
వేరువేరు రాజకీయ అస్తిత్వాలను(దేశాలను) అలాగే ఉంచి భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వ భావనను పటిష్టపరిస్తే ఇది పూర్వకాలంలో మాదిరిగా ప్రబల ఆర్ధిక శక్తిగా వెలుగొందుతుంది. భారతీయులు ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజల్ని కలుపుకుని అభివృద్ధిని సాధించడానికే ప్రయత్నించారుకాని ఆ దేశాలను ఆక్రమించుకునే కుటిల యత్నాలు చేయలేదు. ఈ విషయాన్ని ఇప్పటికీ ఆయా దేశాల ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అందుకనే ‘ఒక్క సైనికుడిని పంపకుండా భారత్ 2 వేల సంవత్సరాల పాటు చైనాలో సాంస్కృతిక సామ్రాజ్యాన్ని నెలకొల్పింది’ అని అంటారు అమెరికాలో చైనా రాయబారి హు షీ .
మరి భారత భూఖండపు భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వం వేలాది సంవత్సరాల పురాతనమైనది. అలాగే ఇక్కడ సంపద, సమృద్ధికి కూడా చాలా పురాతన చరిత్రే ఉంది. ఈ దేశం ప్రపంచానికి జీవించడం ఎలాగో నేర్పింది. విశ్వగురువుగా విలసిల్లింది. బృహత్ భారతానికి ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న స్థానాన్ని తిరిగి సాధించాలంటే ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వాన్ని మరచి పోకూడదు. ఆయా ప్రదేశాలు, స్థానాల పేర్లు అలాగే ఉంచుకోవాలి. సంకుచితమైన ధోరణి, చరిత్రపట్ల అవగాహన లేకపోవడం, స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఏకత్వాన్ని మరుగునపరచే ప్రయత్నం చేయకూడదు. అలాంటి ప్రయత్నాలను సహించకూడదు. ఈ ఏకత్వం పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ ఆ ఏకత్వాన్ని తిరిగి సాధించాలనే సంకల్పాన్ని పదేపదే గుర్తుచేసుకోవాలి. 18వందల ఏళ్లపాటు గుర్తుపెట్టుకుని, ప్రయత్నించడం ద్వారా యూదులు అసాధ్యమనుకున్న ఇజ్రాయెల్ ఏర్పాటును సుసాధ్యం చేసుకున్నారు. ఈ విషయాన్ని మనమంతా బాగా గుర్తుపెట్టు కోవాలి.
– డా. మన్మోహన్ వైద్య, ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ