అన్నదాతా సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకూ 20 వేలు
అన్నదాతల విషయంలో ఏపీలోని ఎన్డీయే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతా సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకూ 20 వేలు సాయం చేస్తామని ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయ పంపు సెట్లూ కూడా అందిస్తామని కీలక ప్రకటన చేశారు.
ఇప్పటికే, రైతన్నలకు పెట్టుబడి సాయంంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పీఎం కిసాన్ కింద అర్హత కలిగిన రైతన్నలకు రూ. 6వేలు జమ చేస్తోంది. అయితే, కేంద్రం ఇచ్చే రూ. 6వేలతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా మరో 14వేలు కలిపి ఏడాదికి రూ. 20వేల రూపాయలను పెట్టుబడి సాయంగా రైతన్నలకు అందించనుంది.
ఈ పెట్టుబడి సాయాన్ని మొత్తం మూడు విడతలుగా అందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో అన్నదాత సుఖీభవ హమీ ఒకటి. ఇప్పుడు ఆ హమీ అమలు దిశగానే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయించింది.
పీఎం కిసాన్ అనేది.. భూమి ఉన్న రైతులకు మాత్రమే వస్తుంది. మరి ఏపీలో భూమి లేని, భూమిని కౌలుకు తీసుకున్న రైతుల సంగతేంటి అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనికి ప్రభుత్వం కచ్చితమైన సమాధానం ఇచ్చారు. భూమి లేని కౌలు రైతులకు కూడా రూ.20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఐతే.. దీనికి పీఎం కిసాన్‌తో లింక్ ఉండదు కాబట్టి.. ఆ రైతులకు ఏపీ ప్రభుత్వమే పూర్తిగా రూ.20,000 ఇస్తుంది అన్నారు.