అర్చకుడి చేతికి సంకెళ్లు.. అవమాన భారంతో ఆత్మహత్యకి ప్రయత్నం

కేరళలోని మనక్కాడ్ ముత్తుమారి అమ్మన్ ఆలయంలో గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారిని పోలీసులు చేతులకు సంకెళ్ళు వేసి కస్టడీలోకి తీసుకున్నారు. 2024 జులై 26న జరిగిన ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజారి అరుణ్ పొట్టి, అవమానభారంతో ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. మనక్కాడ్‌లోని ముత్తుమారి అమ్మన్ ఆలయంలో అరుణ్ పొట్టి ప్రధానార్చకుడిగా పనిచేస్తున్నారు. పూన్‌తురా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన ఆ సమయంలో గర్భగుడిలో మూలవిరాట్టుకు పూజ చేస్తున్నారు. అది అయిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వస్తానని చెప్పారు. అతని విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారు. అతన్ని అప్పటికప్పుడే అదుపులోకి తీసుకున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం, పూజ మధ్యలో అవమానించడంతో తీవ్ర అవమాన భారానికి గురైన పూజారి అరుణ్, ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెప్పారు.
పూజారి అరెస్టుతో ఆలయ ట్రస్టు సభ్యులు షాక్‌ తిన్నారు. పోలీసుల చర్యకు కారణమేమిటో తమకు ఏమాత్రం తెలియలేదని ట్రస్ట్ చైర్మన్ నందకుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆ అసాధారణమైన చర్య కారణంగా దేవాలయంలో నిత్యపూజావిధులకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దాంతో ట్రస్టు సభ్యులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేసారు. పూజారి అరెస్ట్ వార్త మనక్కాడ్ పట్టణంలో దావానలంలా శరవేగంగా వ్యాపించింది ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన పోలీసులు ఆలయ ట్రస్టు ఛైర్మన్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు.
అసలేం జరిగింది?
గతనెల ఉఛమడన్ ఆలయంలో ఒక పంచలోహమూర్తి దొంగతనానికి గురయ్యింది. 40ఏళ్ళ నాటి ఆ విగ్రహం విలువ సుమారు కోటిన్నర రూపాయలు ఉంటుంది. అలాంటి విలువైన దేవతా విగ్రహం అపహరణకు గురవడం హిందువులను షాక్‌కు గురిచేసింది. ఆ దొంగతనం వ్యవహారం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఆ గుడిలో గతంలో పనిచేసిన అరుణ్ పొట్టిని అనుమానించారు. ఆయనను అనుమానించి పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం ముత్తుమారి అమ్మన్ ఆలయంలో విధుల్లో ఉండగా ఆయనను చేతులకు బేడీలు వేసి అవమానకరంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. అయితే ఆ దొంగతనంతో తనకు ఏ సంబంధమూ లేదని అరుణ్ వాపోతున్నారు.
అరుణ్ పొట్టి కొంతకాలం క్రితం వరకూ ఉఛమడన్ దేవాలయంలో పనిచేసేవారు. అక్కడి ఆలయ కార్యదర్శితో ఏదో విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన ఆ గుడిలో అర్చకత్వం నుంచి వైదొలిగారు. తనలా అభిప్రాయ భేదాల కారణంగా గుడిని వదిలిపెట్టిన పూజారులందరినీ ఇరికించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని అరుణ్ వాపోయారు. పోలీసులు తనకు ముందు ఫోన్ చేసారని, శనివారం తాను పోలీస్ స్టేషన్‌కు వస్తానని చెప్పాననీ అరుణ్ వివరించారు. అయితే శుక్రవారం సాయంత్రమే అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. సాయంసంధ్యలో దీపారాధనకు అరుణ్ పొట్టి సిద్ధమవుతున్న వేళ పోలీసులు గుడికి చేరుకున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికా లేకుండా వారు గుడి ఆవరణలోకి అడుగుపెట్టారు. అరుణ్ పొట్టికి బలవంతంగా సంకెళ్ళు వేసారు, ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.
గుడిలో ఆ సమయంలో ఉన్న భక్తులు, ఆలయ అధికారులు వెంటనే స్పందించారు. పోలీసుల అన్యాయ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పోలీసుల బెదిరింపులకు భయపడకుండా వారు తమ నిరసనను కొనసాగించారు. మరోవైపు ఏసీపీకి ఆ విషయం గురించి సమాచారం అందించారు. దాంతో ఆ రాత్రి ఎట్టకేలకు అరుణ్ పొట్టిని పోలీసులు విడిచిపెట్టారు. ఆ సంఘటన హిందూ దేవాలయాల మీద, హిందూ భక్తుల విశ్వాసాల మీద జరిగిన దాడిగా కేరళ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చర్చి లేదా మసీదులోకి చొరబడి అక్కడి ఫాదర్‌నో లేక మౌల్వీనో ఆ విధంగా కస్టడీలోకి తీసుకునే ధైర్యం పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. దానికి జవాబు ‘లేదు’ అని కూడా చెబుతున్నారు. కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిపిఎం నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయనే హోంశాఖను కూడా చూస్తున్నారు. హిందూద్వేషి అయిన పినరయి విజయన్ పరిపాలనతో పోలీసులు హిందువులపై జులుం చేయడంలో అత్యుత్సాహం చూపుతున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఒక దేవాలయంలోని పూజారిపై పోలీసులు పాల్పడిన అత్యాచారాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు తిరువనంతపురంలో ఆందోళనలు చేపట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *