అసలు కోవిడ్‌కు కారణం ఎవరు ?
– ఎస్.గురుమూర్తి
18 నెలల క్రితం చైనా వూహాన్ నగరంలో వ్యాపించిన వైరస్ గురించి ఇప్పటికీ ప్రపంచానికి పూర్తి వివరాలు తెలియవు. మొదట్లో అధికారికంగా ఈ వ్యాధికి కోవిడ్19 అని నామకరణం చేసినా ఆ తరువాత మూడు నెలల్లో అనేకసార్లు ఆ పేరు మార్చారు. అసలు కోవిడ్ అనే పేరే చాలా విచిత్రమైనది, తప్పుదోవపట్టించేదిగా ఉంది. మహమ్మారిగా మారిన ఈ వ్యాధి సంవత్సర కాలం దాటినా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. ఈ వైరస్ ప్రకృతి సహజంగానే పుట్టిందా? లేక మానవ సృష్టా అన్నది ఇప్పటికీ తేలలేదు. వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? అన్నవి కేవలం సంచలనం కోసం, ఆసక్తితో అడిగే ప్రశ్నలు కావు. ఈ వైరస్ కు విరుగుడు కనుక్కోవలసిందే, తిరిగి వ్యాపించకుండా నివారించవలసిందే. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవలసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రత్యేక కమిషన్ సంవత్సర కాలం తరువాత కూడా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వ్యాధికి ఏకంగా ఒక పేరు పెట్టడమేకాక అది ప్రకృతి సహజంగా వ్యాపించినదేనని, వైరస్ పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశీలన అవసరం లేదంటూ తేల్చేసింది. అయితే అసలు ఈ కోవిడ్19 అనే పేరే మోసపూరితమైనదని, తప్పుదోవ పట్టించేదని ఇప్పటికీ ప్రపంచం గ్రహించలేక పోతోంది.
కోవిడ్19 ఒక మోసపూరితమైన పేరు
మొదట్లో ఈ వైరస్‌ను వూహాన్ న్యుమోనియా, వూహాన్ వైరస్ అని పిలిచారు. కానీ వెంటనే రంగంలోకి దిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లోనే మూడుసార్లు వైరస్ పేర్లు మార్చింది. ప్రతిసారీ ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైరస్ ను సార్స్ వైరస్ తో, జంతువుల మార్కెట్ తో జోడిస్తూ అది సార్స్ 2 తరహా వైరస్ అంటూ ప్రకటించింది. ఆ తరువాత జంతు సంబంధాన్ని స్థిరపరుస్తూ వైరస్‌కు ‘కరోన వైరస్’ అని పేరు పెట్టింది. ‘నోవెల్ కరోనవైరస్ 2’ – 2019 – ఎన్ కొవ్ అని నిర్ధారించింది. తరువాత మరోసారి జంతువులకు సంబంధించినదని సూచిస్తూ ‘శ్వాసకోశ సంబంధిత కరోనవైరస్ 2’ – సార్స్ – కొవ్-2 అంటూ పేరు పెట్టింది. అలా జంతువులే కారణమంటూ వ్యాధికి `Covid19’ (co-corona; vi – virus; d – disease)) అని నామకరణం చేసింది. కానీ వూహాన్ వైరస్ కు జంతువుల మార్కెట్‌కు సంబంధాన్ని నిరూపించలేక పోయిన చైనావారే కొన్ని నెలల్లోనే మాటమార్చారు. ఆ తరువాత సంవత్సరానికి స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజనిర్ధారణ కమిషన్ కూడా – జంతువుల మార్కెట్ నుంచి వైరస్ పుట్టిందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదు’ అంటూ ప్రకటించింది. అయినా ఇప్పటికీ మహమ్మారికి కారణం జంతువులే అన్న ప్రచారం మాత్రం సాగుతోంది.
గబ్బిలాలు వూహాన్‌కు ఎగిరివచ్చాయా?
వైరస్ గురించి ఎలాంటి వివరాలూ లేక చీకటిలో కొట్టుకుంటున్న ప్రపంచానికి నికలస్ వేడ్ బయటపెట్టిన విషయాలు ఎంతో ఉపయోగ పడతాయి. వేడ్ కేవలం ఒక సాధారణ జర్నలిస్ట్ కాదు. అతను వైజ్ఞానిక శాస్త్రాన్ని గురించి అవగాహన కలిగినవాడు, రచయిత. నేచర్, సైన్స్ అనే వైజ్ఞానిక పత్రికలతోపాటు న్యూయార్క్ టైమ్స్‌లో కూడా పనిచేశాడు. అతను ఇటీవల వ్రాసిన వ్యాసం (The Origin of COVID: Did people or nature open Pandora`s box at Wuhan? అనే ఈ వ్యాసం అణు శాస్త్రవేత్తల బులెటిన్‌లో మే 5న ప్రచురితమైంది. ఈ బులెటిన్‌ను ఆల్బర్ట్ ఐన్ స్టీన్ నేతృత్వం వహించిన మన్ హట్టన్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు ప్రారంభించారు) చైనాలో గబ్బిలాల వల్లనే వైరస్ వ్యాపించిందనే ప్రచారాన్ని పటాపంచలు చేసింది.
వేడ్ చాలా సాధారణమైన ప్రశ్న అడిగాడు ‘వూహాన్‌కు 15వందల కిలోమీటర్ల దూరంలోని యున్నన్లో ఉన్న గబ్బిలాలు వూహాన్లో వైరస్ ఎలా వ్యాప్తిచేయగలవు?’ గబ్బిలాలు 50 కి.మీ ల కంటే దూరం ఎగరలేవు. అంతేకాదు యున్నన్ గబ్బిలాలు వుహాన్‌లోని జంతువుల మార్కెట్లోని జంతువులకు మాత్రమే వైరస్ ఎలా అంటించ గలవు? 2002లో సార్స్ వైరస్ వ్యాపించినప్పుడు నాలుగునెలల్లో దానికి కారణాలను కనిపెట్ట గలిగారు. కానీ ఇప్పుడు సంవత్సరం పైగా గడిచినా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయారని వేడ్ అన్నాడు. చైనా వారు కూడా జంతువుల మార్కెట్ కథనాన్ని వదిలిపెట్టేశారని అతను గుర్తుచేశాడు. అలా యున్నాన్ లోని గబ్బిలాలు మనుషుల్ని ఏమి చేయకపోయినా వాటిపై నిందలు వేశారు. మరి గబ్బిలాల వైరస్ వుహాన్‌కు ఎలా చేరింది? అదే వైరస్ కథలోని కీలకమైన అంశం. ఇది అమెరికా మాత్రం చైనా చెలిమి కోసం తాపత్రయపడుతున్న రోజులనాటి మాట.
‘గబ్బిలం మహిళ’ వుహాన్‌కు 100 గబ్బిలం వైరస్లు తెచ్చింది
ఈ కొత్త వైరస్ గురించి వేడ్ చెప్పిన వివరాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ వైరస్ కథలో షి ఝెంజిలీ కథానాయకురాలు లేదా ప్రతినాయకు రాలు. ఈమె చైనాలో గబ్బిలాలపై పరిశోధన చేస్తున్న వారిలో ప్రముఖురాలు. ఈమెను అక్కడ ‘గబ్బిలం మహిళ’ (bat lady) ) అని పిలుస్తారు. వూహాన్‌లోని వైరస్ పరిశోధన కేంద్రంలో పరిశోధ నలకు నేతృత్వం వహిస్తున్న షి 2015 నవంబర్‌లో యున్నన్ గుహల్లోని గబ్బిలాలకు సంబంధించిన వందలాది రకాల వైరస్ (కరోన వైరస్లు) సేకరించి వూహాన్‌కు చేర్చింది. ఉత్తర కరోలినా విశ్వవిద్యాల యానికి చెందిన రాల్ఫ్ ఎస్. బారిక్ అనే శాస్త్రవేత్తతో కలిసి షి కరోన వైరస్ పరిశోధన చేసింది. మానవు లకు వ్యాధి కలిగించే విధంగా గబ్బిలం వైరస్ల సామర్ధ్యాన్ని పెంచడం ఎలాగన్న విషయంపై ఇద్దరూ పరిశోధన చేశారు. వాళ్ళిద్దరూ కలిసి 2015 నవంబర్‌లో కొత్త కరోన వైరస్ ను సృష్టించారు. తాము కరోన వైరస్ పై జరుపుతున్న పరిశోధనలో ఈ ప్రమాదభయం (risk) ఎక్కువగా ఉన్నా అది తప్పదని షి, బారిక్‌లు సమర్ధించు కున్నారు.
అది గబ్బిలం వైరస్ కాదు, గబ్బిలం మహిళ వైరస్
అమెరికా ఆరోగ్య సంస్థలు నిధులను పీటర్ డాస్ జెక్ అనే కాంట్రాక్టర్ ద్వారా షికి అందజేశాయి. అప్పుడు తయారుచేసిన పరిశోధన ప్రణాళికా పత్రంలో ‘మానవులకు సోకే అవకాశం ఉన్న కరోన వైరస్ తయారిపై షి పరిశోధన చేస్తారు’ అని స్పష్టంగా పేర్కొన్నట్లు వేడ్ వెల్లడించాడు. 2019 డిసెంబర్ 9న, అంటే వూహాన్ లో వైరస్ వ్యాపించడానికి సరిగ్గా ముందు, ఒక ఇంటర్వ్యూలో డాస్ జాక్ మాత్రం షి తన పరిశోధనలో విజయ వంతమయ్యారని చెప్పాడని వేడ్ పేర్కొన్నాడు. ‘వాటిలో కొన్ని మానవ కణాలలోకి ఎక్కించ గలిగాం. కొన్నిటి వల్ల కలిగే సార్స్ వ్యాధికి మందు లేదు. వాటికి వాక్సిన్ కనుగొనడం కూడా సాధ్యం కాదు. దీనిని బట్టి అర్ధమవుతుంది అవి ఎంత ప్రమాదకరమైనవో’ అని డాస్ జాక్ అన్నట్లు వేడ్ తన వ్యాసంలో పేర్కొన్నాడు. ఇప్పుడు జరుగుతున్న అపారమైన ప్రాణనష్టం చూస్తే అది ఈ ‘గబ్బిలం మహిళ’, డాస్ జాక్‌ల నిర్వాకమేనని అర్ధమవుతోంది కదా. నిజానికి గబ్బిలాలు ఎలాంటి వైరస్ ను వ్యాపింపచేయలేవు. కాబట్టి వుహాన్‌లో మనుషులకు సోకిన వైరస్ గబ్బిలాల నుండి రాలేదు. ఆ గబ్బిలాల వైరస్‌లను వూహాన్‌కు తెచ్చి కొత్తరకం కరోన వైరస్‌ను సృష్టించారు. అదే ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.