ఆరెస్సెస్ అక్షయ ఓ అక్షయ వటవృక్షం.. సంస్కృతిని చైతన్యవంతం చేస్తుంది : ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నాగపూర్ లో పర్యటించారు. మొదట నాగపూర్ రేషంబాగ్ లోని హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్జీకి నివాళులు అర్పించారు. తదనంతరం రెండో సరసంఘచాలక్ గురూజీ స్మృతి మందిరానికి వెళ్లి, అక్కడ కూడా నివాళులు అర్పించారు. ఆ తర్వాత మాధవ నేత్రాలయ ప్రీమియం సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలైందన్నారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ ను మర్రి చెట్టుతో అభివర్ణించారు. జాతీయ భావాల పరిరక్షణ, ప్రచారం కోసం వందేళ్ల క్రితం నాటిన ఆలోచనల బీజం ఇప్పుడు మహా మర్రి చెట్టు రూపంలో ప్రపంచం ముందు వుందన్నారు. ఈ మహా వృక్షానికి సిద్ధాంతం, ఆదర్శాలు మరింత ఔన్నత్యాన్ని ఇస్తాయన్నారు. లక్షలాది మంది స్వయంసేవకులు దాని శాఖలు అని వివరించారు.
ఆరెస్సెస్ అనేది మామూలు వట వృక్షం కాదని, భారత సంస్కృతి యొక్క అక్షయ వట వృక్షమని అభివర్ణించారు. భారతీయ సంస్కృతిని,జాతీయ చైతన్యాన్ని నిరంతరం శక్తిమంతం, చైతన్యవంతం చేస్తోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం మాధవ నేత్రాలయం గురించి మాట్లాడుతున్న సమయంలో సహజంగానే దృష్టి గురించి స్వభావ సిద్ధంగానే వస్తుందన్నారు. దృష్టి అనేది జీవితంలో అందరికీ దిశానిర్దేశం చేస్తుందని, వేదాలలో కూడా దీనిని పేర్కొన్నారన్నారు. ‘‘పశ్యం సరళ: శతం’’ అని పేర్కొన్నారని తెలిపారు. మనిషి బాహ్య దృష్టితో పాటు ఆంతర దృష్టి కూడా వుండాలన్నారు. అయితే శ్రీ గులాబ్ రావు అనే సాధువును అందరూ ప్రజ్ఞా చక్షుడు అని పిలుచుకునేవారని గుర్తు చేశారు. ఈయన చాలా చిన్నతనంలోనే కంటి చూపును కోల్పోయారని, అయినా చాలా పుస్తకాలు రాశారని, ఆయనకంటూ ఓ దృష్టి వుండేదని, ఇది అవగాహన నుంచి వస్తుందని వివరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా అలాంటి సంస్కార యజ్ఞం లాంటిదని మోదీ అభివర్ణించారు. ఇది అంతర, బాహ్య దృష్టికీ పని చేస్తుందన్నారు. బాహ్య దృష్టి కోణంలో చూస్తే మాధవ నేత్రాలయం అని, ఆంతర దృష్టి సంఘ్ ను సేవకు పర్యాయ పదంగా మార్చేసిందన్నారు.
పరోపకారార్థ మిదం శరీరం అని ఆర్యోక్తి వుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ శరీరం సేవ కోసమేనని, ఎప్పుడైతే సేవ అనే గుణం సంస్కారం అనేది సేవలో మిళితమైతే అది ఓ సాధనగా మారిపోతుందన్నారు. ఈ సాధనే ప్రతి స్వయంసేవక్ జీవితానికి ప్రాణవాయువు అని తెలిపారు.ఈ సేవా సంస్కారం, సాధన అనేది స్వయంసేవక్ తపస్సు చేయడానికి ప్రేరేపిస్తాయని, ఎప్పుడూ అలిసిపోకుండా చూసుకుంటాయని తెలిపారు.
మరోవైపు ద్వితీయ సరసంఘచాలక్ గురూజీని కూడా ప్రధాని మోదీ ప్రస్తావించరు. జీవితం కాలం ఎంత అనేది కాదని, జీవితాన్ని ఎలా ఉపయోగించామన్నదే ప్రధానమని తరుచూ అంటుండేవారని గుర్తు చేశారు. సరిహద్దు గ్రామాలైన, అటవీ ప్రాంతమైనా, కొండ ప్రాంతాలైన, పెద్దపని అయినా, చిన్న పని అయినా స్వయంసేవకులు నిస్వార్థంగా పని చేయడం అందరూ చూస్తుంటారన్నారు.
వనవాసీ కల్యాణాశ్రమం వీటినే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తోందని మోదీ పేర్కొన్నారు. వనవాసులకు ఏకోపాధ్యాయ పాఠశాల ద్వారా చదువు నేర్పిస్తున్నారని, వారిలో వున్న సంస్కారాలను కూడా బయటికి తీస్తున్నారన్నారు. అలాగే సేవా భారతిలో చేరి, నిరుపేదలకు సేవ చేస్తున్నారని మోదీ తెలిపారు.