ఆరెస్సెస్ చిన్న సంస్థేమీ కాదు.. నేను హాజరవుతున్నా : అరవింద్ నేతమ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ శిక్షావర్గ సమారోప్ (ముగింపు కార్యక్రమం) కార్యక్రమ ఆహ్వానాన్ని తాను అంగీకరిస్తున్నానని కాంగ్రెస్ మాజీ నేత, ప్రముఖ గిరిజన నేత అరవింద్ నేతమ్ ప్రకటించారు. అయితే.. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ‘‘ఆరెస్సెస్ నుంచి నాకు ఆహ్వానం అందింది. అయితే… దీనిని చూసి ఆశ్చర్యపోయా’’ అని ప్రకటించారు.
గతంలో కూడా తాను ఆరెస్సెస్ నేతలతో సమావేశమయ్యానని, చర్చలు కూడా జరిపినట్లు అరవింద్ నేతమ్ వెల్లడించారు. వనవాసీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలను సంఘం దృష్టికి తెచ్చి,వారిని ఒప్పించడం అత్యంత ఆవశ్యకమని అన్నారు.
‘‘ఆరెస్సెస్ చిన్న సంస్థేమీ కాదని, సమాజం, సంస్కృతిని ఆధారంగా చేసుకొని జాతీయంగా, అంతర్జాతీయంగా పనిచేసే సంస్థ. దేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేస్తోంది. మన జాతీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అలాంటి సంస్థ కార్యక్రమాలకు హాజరు కావడం చాలా ముఖ్యం. దీనిని నేను బలంగా విశ్వసిస్తున్నా.వనవాసుల సమస్యలు, ఇబ్బందులను వివరించడానికి ఆరెస్సెస్ తో సత్సంబంధాలు నాకు అవసరమే. దీనిని నేను నమ్ముతున్నాను. బస్తర్ ప్రాంతంలో ప్రస్తుతం అతిపెద్ద సమస్య మతమార్పిళ్లు. సంఘ్ గనక తనకు మద్దతిస్తే.. బీజేపీ తప్పకుండా ఆ సమస్యపై దృష్టి సారిస్తుందని నేను నమ్ముతున్నాను. గత యేడాది జరిగిన వనవాసుల కార్యక్రమంలో మేమే ఆరెస్సెస్ నేతలను ఆహ్వానించాం. అలాగే నెల క్రితమే రాయ్ పూర్ లో మోహన్ భాగవత్ ను కలుసుకున్నాను. వనవాసీ సమస్యలపై చర్చించాను.’’ అని అరవింద్ నేతమ్ ప్రకటించారు.
వనవాసులకు, సంఘ్ కి మధ్య వున్న సైద్ధాంతిక విభేదాలను తగ్గించాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో వుందని నొక్కిచెప్పారు. ఈ విభేదాలన్నీ సమసిపోవాలన్న ఉద్దేశంతోనే తాను ఆరెస్సెస్ ఆహ్వానానికి అంగీకరించినట్లు తెలిపారు.
అలాగే ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేతలపై కూడా అరవింద్ నేతమ్ విరుచుకుపడ్డారు. తాను ఆరెస్సెస్ కార్యక్రమ ఆహ్వానాన్ని అంగీకరించడంపై కొందరు తప్పుపడుతున్నారని అన్నారు. ఏ విషయాలను ఆధారభూతం చేసుకొని వారు వ్యాఖ్యానిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని, వారేమైనా దేశాభ్యున్నతి కోసం పనిచేస్తున్నారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. అలా పనిచేసి వుంటే.. వారితోనే వెళ్లేవాడినని అన్నారు. సైద్ధాంతిక పునాదులపై జరిగే చర్చల్లో తాను సహజంగానే పాల్గొంటానని అరవింద్ నేతమ్ జవాబిచ్చారు.
నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్ కార్యకర్త వికాస వర్గ-2 కొనసాగుతోంది. ఈ నెల 5 న ఈ శిక్షా వర్గ ముగుస్తుంది. ఈ సమారోప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మాజీ నేత అరవింద్ నేతమ్ ను ముఖ్య అతిథిగా సంఘ్ ఆహ్వానించింది.సంఘ్ ఆహ్వానించడంతో ఆయన ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తో కలిసి కాంగ్రెస్ మాజీ మంత్రి అరవింద్ నేతమ్ వేదికను పంచుకోనున్నారు.
అరవింద్ నేతమ్ ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతానికి చెందిన వనవాసీ నాయకుడు. కాంగ్రెస్ లో సీనియర్ నేత కూడా. 2018 లో కూడా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా సంఘ్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది సంఘ్. అప్పట్లో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దేశంలో అత్యంత వివాదాస్పదమైన ఎమర్జెన్సీ సమయంలో అరవింద్ నేతమ్ 1973 నుంచి 77 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కొనసాగారు. అయితే… 2023 లో సైద్ధాంతిక విషయాలను, నాయకత్వ విషయాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ కి దూరమయ్యారు. ఆ తర్వాత వనవాసి సమూహాల కూటమి యిన సర్వ ఆదివాసీ సమాజ్ కి రాజకీయ విభాగంగా ‘‘హమర్ రాజ్ పార్టీ’’ ని స్థాపించారు. ఆయన పార్టీ 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముఖ్యంగా బస్తర్ మరియు సుర్గుజాలో కాంగ్రెస్ ఎన్నికల పనితీరును గణనీయంగా దెబ్బతీసింది.
nigam2
మరోవైపు కొన్ని రోజుల తర్వాత అరవింద్ నేతమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సైద్ధాంతిక దృక్పథాన్ని మార్చుకున్నానని ప్రకటించారు. ఆరెస్సెస్ సిద్ధాంతానికి దగ్గరవుతున్నానని, గతంలో తాను సంఘ్ విషయంలో ప్రకటించిన విషయాలు సరైనవి కావని ఇప్పుడు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ లో సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ని కలుసుకున్నానని, ఈ సమావేశంలో అక్రమ మతమార్పిళ్ల విషయం, హిందూ సంస్కృతి విషయాలతో పాటు మరికొన్ని విషయాలపై తమ మధ్య చర్చ జరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వికాస వర్గ -2 ఈ నెల 12 న ప్రారంభమైంది. నాగపూర్ లోని రేషంబాగ్ లోని హెడ్గేవార్ స్మృతి భవనంలో జరుగుతోంది. వర్గపాలక్, సహ కార్యవాహ అలోక్ కుమార్, సహ కార్యవాహ రామదత్త చక్రధర్ (వర్గ సర్వాధికారి), సమీర్ కుమార్ మహంతి భారత మాత చిత్ర పటానికి పూలు సమర్పణ చేయడంతో ఈ వర్గ ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 840 మంది శిక్షార్థులు ఈ వర్గకు హాజరయ్యారు. జూన్ 5 న ఈ వర్గ ముగుస్తుంది. సామాజిక అవగాహన, సామాజిక మార్పు, సంఘ్ పై ఇందులో శిక్షణనిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *