ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంపై దాడి.. గుడిపై విద్వేష వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాలో జాత్యాహంకారం మితిమీరిపోయింది. కొన్ని రోజుల క్రిందటే ఓ భారతీయ విద్యార్థిపై కొందరు దుండగులు జాత్యాహంకార వ్యాఖ్యలు మరిచిపోకముందే మరో ఘటన జరిగింది. తాజాగా మెల్ బోర్న్ లోని బోరోనియాలోని స్వామి నారాయణ్ హిందూ ఆలయంపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు విద్వేష పూరిత వ్యాఖ్యలు రాశారు.
ఈ నెల 21 న స్వామి నారాయణ్ ఆలయం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఆలయం గోడలపై హిట్లర్ చిత్రాన్ని వుంచి, దానిపై ‘‘గో హోమ్ బ్రౌన్’’ అని రాశారు. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మకరంద్ భగవత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. ఇది తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ ఘటన భక్తుల హృదయాలను ఎంతో కలచివేసిందని, ఇలాంటి జాత్యహంకార చేష్టలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. హిందూ ఆలయం శాంతి, భక్తి, ఐక్యతకు నిలయమని అన్నారు.శ్రీ స్వామి నారాయణ ఆలయంలో రోజువారీ ప్రార్థనలు, సామూహిక భోజనాలు, సాంస్కృతిక ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నామని, ఈ ఆలయం భక్తులను ఎందర్నో ఆకర్షిస్తోందని తెలిపారు.