ఇంటికి సౌందర్యానికి సౌందర్యం… చల్లదనానికి చల్లదనం…
వేసవి నడుస్తోంది. విపరీతమైన ఉక్కపోత. పెద్ద పెద్ద చెట్ల కింద సేదతీర్చుకుందాం అంటే… అన్ని ప్రాంతాల్లో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆ పరిస్థితి అస్సలు లేదు. మరి ఎలా? దీనికీ ఓ ఉపాయం వుంది. మన ఇంట్లోనే వుంటూ.. మన పరిసరాలను చల్లగా చేసే కొన్ని మొక్కలున్నాయి. వాటి ద్వారా అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించి, సహజమైన గాలులు, చల్లదనాన్ని ఇస్తాయి. హైబ్రిడ్ మామిడి మొక్కలు, వేప, రావి, గానుగ, బాదం లాంటి మొక్కలను పెంచితే… నీడతో పాటు చల్లదనాన్ని కూడా ఇస్తాయి. అతి తక్కువ ధరలతో ఇంటి లోపల వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోగం సక్సెస్ కూడా అయ్యింది.
1. అలోవెరా : చాలా మందికి ఇది సౌందర్య పోషకాలున్న మొక్క అని మాత్రమే తెలుసు. అధిక ఉష్ణోగ్రతను తగ్గించే శక్తి దీనికి వుంటుంది. మన చుట్టూ వుండే పరిసరాల్లో ఫార్మాల్డిహైడ్ వంటి కలుషితాలను ఇది తీసేస్తుంది. పత్రాలు రసభరితంగా వుండటం వల్ల నీటిని నిల్వ చేసుకునే గుణం దీనికి వుంది. అందువల్ల చల్లగా వుంచుతుంది.
2. పోధాన్ : మనీ ప్లాంట్ అని వ్యవహారంలో వుంది. హరితానికి మారుపేరుగా నిలుస్తుంది. గుబురుగా వుండటం దీని ప్రధాన లక్షణం. కిటికీలు, వరండాల్లో తక్కువ స్థలంలో దీనిని పెట్టుకోవచ్చు. ఈ మొక్క నుంచి వీచేగాలి ఇంటి లోపల చల్లగా వుంచుతుంది. అలాగే స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తుంది.
3. చిన్న రబ్బర్ మొక్కలు : మన ఇంట్లో ఎప్పటికప్పుడు గాలిని శుభ్రం చేయడంలో ఈ మొక్కలు పనికొస్తాయి. హానికరమైన రసాయనాలుంటే తొలగించి, ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. చూడడానికి కూడా అందంగా వుంటాయి.
4. పుదీనా : అనేక ఔషధ గుణాలుంటాయి. అత్యంత సుగంధభరితంగా వుంటుంది. అధిక రంధ్రాలు కలిగిన పత్రాలతో నిండుగా వుంటుంది. కీటకాలు, పురుగులు రాకుండా చూస్తాయి. అధిక రంధ్రాలతో నిండుగా వుండటంతో చల్లని గాలిని ఇస్తుంది.
5. ఫెరస్ : దీని పత్రాల ద్వారా విడుదలయ్యే నీటి తుంపర్లు వేడి గాలిని తక్కువ చేస్తాయి. ఇంటి పరిసరాలు, కిటికీల్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. చల్లదనం కూడా వుంటుంది. రెండు రకాలుగా పనికొస్తుంది.
6. నిమ్మగడ్డి : గడ్డిజాతి మొక్కలా కనిపిస్తుంది. వేసవిలో చల్లదనం ఇవ్వడంతో పాటు దోమలను కూడా తగ్గిస్తుంది. గడ్డిజాతి మొక్క కాబట్టి ఎప్పుడూ కొంత నీటిని నిలవ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దీంతో చల్లని గాలిని అందిస్తుంది.
7. అరెకాపామ్ :ఇంటి పరిసరాల్లో వుండే కార్బన్‌డైయాక్సైడ్, టాక్సీన్ వంటి రసాయనాలను తొలగిస్తుంది. గాలిని శుభ్రం చేస్తుంది. పరిశుభ్రమైన చల్లని గాలిని అందిస్తుంది.