ఇం‌ట్లోనే వ్యవసాయం

వ్యవసాయానికి మన దేశంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. రైతును అన్నదాతగా భావించి గౌరవించే సంస్కృతి మనది. అయితే నగరీకరణ పేరుతో అన్నదాతను మనం మర్చిపోతున్నాం. బయట వస్తువులను డబ్బు పెట్టి కొనడం అలవా టయిపోయి ఆ సామాగ్రి వెనుక ఉన్న శ్రమని మనం మరచిపోతున్నాం. అది విలువ కట్టలేము. మరి నగర వాసులకు వ్యవసాయం గురించి తెలియాల్సిన అవసరం ఉంది కదా? అందుకే ఇప్పుడు హైడ్రో ఫోనిక్స్ ‌విధానం వచ్చింది. అంటే ఇంట్లోనే కిటికీల దగ్గర వరండాలో మనం మొక్కల్ని, కూరగాయలని మనం పనికిరావు అనుకునే వస్తువులను ఉపయో గించి పెంచుకోవడం అన్నమాట.

మనం మామూలుగా వాటర్‌బాటిల్‌ ‌కొనేసి తాగిన తర్వాత బయటపడేస్తాం కానీ హైడ్రోఫోనిక్స్ ‌విధానంలో మొక్కలు పండించడానికి అవి ఎంతో ఉపయోగపడ తాయని గుర్తించాడో ఓ ఐటీ ఫ్రొఫెషనల్‌. ఆయన ఉండేది పూణేలో. పేరు రుద్రరూప్‌. ‌చిన్నప్పటి నుంచే తన తండ్రి వల్ల రుద్రరూప్‌కి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. హైడ్రోఫోనిక్స్ ‌విధానం ద్వారా తన తండ్రితో కలిసి. రుద్రరూప్‌ ‌కూడా మట్టి కుండల్లో నీటి ద్వారా పంటను పండించేందుకు ప్రయోగాలు చేశారు. అందులో వారు సఫలీకృతం కూడా అయ్యారు. అయితే చదువు కోసం ప్రయాణమైన రుద్రరూప్‌ ‌హైడ్రోఫోనిక్స్‌కు దూరమయ్యారు చదువు పూర్తయ్యి ఉద్యోగంలో స్థిరపడ్డారు. కాని మదిలో ఏదో తెలియని లోటు, తాను ఏదో కోల్పోయాననే భావన ఆయన మదిని వేధిస్తుండేది. తన దారి అదికాదని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని నగరంలో స్థలాభావం ఎక్కువ. వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉండదు. అందుకోసం తాను నేర్చుకున్న హైడ్రోఫోనిక్స్ ‌విధానాన్ని పునఃశ్చరణ చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.

అసలు. పూణె, ఇతర ప్రాంతాల్లో హైడ్రో ఫోనిక్స్ ‌పైన కార్యశాలలు జరుగుతున్నాయే మోనని వెతకడం ప్రారంభించారు. ఎక్కడా తనకు ఫలితం కనిపించలేదు. ఇక తానే ప్రయోగాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఒకవైపు ఉద్యోగం, మరో వైపు తనకు ఇష్టమైన వ్యవసాయం. అయినా సరే ఏ మాత్రం నిరాశ చెందకుండా తన భార్య సహకారంతో ప్రయోగాన్ని మొదలుపెట్టాడు. భార్య, స్నేహితుల ప్రోత్సాహంతో తన ఇంటి బాల్కనీలోనే ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పెట్‌ ‌బాటిళ్ళను సేకరించి వాటిలో నీటి సహాయంతో మొక్కలను పెంచే ప్రయత్నం ప్రారంభించారు. తొలుత కాస్త ఇబ్బందులు తలెత్తినా, వైఫల్యాలు ఎదురైనా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు రుద్రరూప్‌. ‌నీటిలో కలపడానికి కావలసిన లవణాలు, ఇతర పోషకాలను స్వతహాగా తయారు చేసుకోవడం ప్రారంభించారు. వాటి ద్వారా మంచి ఫలితాలను సాధించారు. తొలుత పచ్చిమిర్చి, టమాట, ఇతర కూరగాయాలను హైడ్రోఫోనిక్స్ ‌విధానంలో విజయవంతంగా పండించారు తన విద్యను నలుగురితో పంచుకోవాలని, వ్యవసాయాన్ని నగరీకులకు కూడా పరిచయం చేయాలనే ఆలోచన తట్టింది. అన్నదాత కష్టం పైన ప్రజల్లో అవగాహన కల్పించాలను కున్నారు. అలా స్వతహాగా కార్యశాలను నిర్వహించడం ప్రారంభించారు.

రెండున్నర సంవత్సరాల క్రితం ఆయన స్థాపించిన మేకర్స్ ‌క్లబ్‌ను ఇందుకు వేదికగా చేసుకున్నారు. ఔత్సాహికుల కోసం కార్యశాలను నిర్వహించ తలపెట్టారు. తొలిసారి హైడ్రోఫోనిక్స్ ‌విధానం పై కార్యశాల నిర్వహించినప్పుడు ఎక్కువ మంది రాలేదు.కానీ వీరి పండించే విధానాన్ని చూసి చాలామంది ఆకర్షితులయ్యారు. వారి ఈవెంట్లకు వచ్చే వారందరికీ మొదట వ్యవసాయ ప్రాధాన్యం వివరిస్తారు. ఆ తరువాత హైడ్రోఫోనిక్స్ ‌పద్ధతిలో మొక్కలను పెంచడం పైన అవగాహన కల్పిస్తారు. ఛ్యవన్‌ ‌ప్రాష్‌ ‌డబ్బాలు, టిఫిన్‌ ‌డబ్బాలు, పెరుగు క్యాన్లు, ప్లాస్టిక్‌ ‌బాటిళ్ళను మొక్కలను పెంపకానికి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తారు. ఆసక్తి కనబరచిన వారికి దగ్గరుండి తెలియజేయడమే కాకుండా వారు నేర్చుకునేందుకు కావలసిన సమాచారాన్ని అందిస్తారు. రూపు మారినా సరే దేశ వారసత్వ సంపద అయిన వ్యవసాయాన్ని మనం మర్చిపోవద్దని గర్వంగా చెబుతారు రుద్రరూప్‌ .

అసలేంటి ఈ హైడ్రోఫోనిక్స్ ‌పద్ధతి..?

హైడ్రోఫోనిక్స్ ‌విధానంలో ఇంట్లోనే కూర గాయలను పండించుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంట్లో బాల్కనీ, కిటికీ వద్ద స్థలాలు. అక్కడ బాటిళ్ళలో ఎంతో సరదాగా మొక్కలను పెంచుకోవచ్చు. ఈ విధానంలో మొక్క వేర్లను మాత్రమే నీటిలో ఉంచుతారు. ఆ నీటిలో మొక్కకు కావలసిన పోషకాలను కలుపుతుంటారు. పోషకాలు నేరుగా నీటిలో కలవడం వల్ల మొక్కకు త్వరగా లవణాలు, ఖనిజాలు అందుతాయి. నేలలో పెరిగే మొక్కకంటే వేగంగా నీటిలోని మొక్క పెరుగుతుంది. అంతేకాకుండా త్వరగా ఫలాలను ఇస్తుంది. ఇలా చిన్న మొత్తంలో ఇంటి అవసరాలకు కావలసిన మొక్కలను మన వరండాలోనో, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలోనో పెంచుకోవచ్చు.

అంతే కాకుండా రసాయనాలకు దూరంగా పండించినవి కాబట్టి ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. పూర్థి స్థాయిలో కాకపోయినా కొంతమేర తాజా కూరగాయలను పొందుతాము. ఇలా నగరంలో చిన్న పంటలను వేసుకోవడానికి హైడ్రోఫోనిక్స్ ‌విధానం ఎంతో దోహదపడుతుంది. కేవలం నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోసైతం అభిరుచి ఉన్నవారు ఈవిధానం ద్వారా మొక్కలు పెంచుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *