ఇకపై కేదార్ నాథ్ దేవాలయానికి రోప్ వే సౌకర్యం
పర్వతమాల పరియోజన కార్యక్రమం కింద ఉత్తరాఖండ్‌లో రూ.6,811 కోట్ల వ్యయంతో రెండుచోట్ల తీగ మార్గాలు (రోప్‌వేలు) నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో ఒకటి సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్‌కు (12.9 కి.మీ, వ్యయం: రూ.4,081 కోట్లు), రెండోది గోవింద్‌ఘాట్ నుంచి హేమ్‌కుండ్ సాహిబ్‌కు (12.4 కి.మీ, వ్యయం: రూ.2,730 కోట్లు) ఉంటుంది. ప్రయాణ సమయాన్ని తగ్గించి, పర్యాటకాన్నీ ప్రోత్సహించేలా ఈ మార్గాలు నాలుగు నుంచి ఆరేళ్లలో సిద్ధమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం ఇలాంటి కొన్ని అంశాలపై నిర్ణయం తీసుకున్నాయి. వివరాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు.
తీగమార్గాలు రెండూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రానున్నాయని చెప్పారు. ఒక దిశలో గంటకు 1,800 మంది ప్రయాణికులు చొప్పున రోజుకు 18,000 మందిని తీసుకువెళ్లే సామర్థ్యం ఉండేలా కేదార్‌నాథ్ రోప్‌వే అధునాతన సాంకేతికతతో రానుంది. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్‌కు 16 కి.మీ. మేర కాలినడకన గానీ, హెలికాప్టర్లో గానీ వెళ్లాల్సి వస్తోంది. అలాగే హేమ్‌కుండ్ సాహిబ్‌కి చేరుకోవాలంటే గోవింద్‌ఘాట్ నుంచి ఎత్తైన కొండపైకి 21 కి.మీ. దూరం కాలినడన, చిన్నగుర్రాల (పోనీల) మీద, లేదా డోలీల్లో వెళ్లాల్సి వస్తోంది.