ఇకపై ‘‘సహకార్ ట్యాక్సీ…’’ ప్రారంభానికి కేంద్రం సన్నాహాలు
దేశంలో ట్రాన్స్ పోర్టు విషయంలో ఒలా, ఊబర్ సర్వీసులు అందిస్తున్నాయి. వాటికి పోటీ లేకుండానే పోయింది. అయితే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం రానున్న కొద్ది రోజుల్లోనే ఓలా, ఊబర్ తరహాలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా బైక్, క్యాబ్ మరియు ఆటో సేవలను అందిస్తుంది.పెద్ద కార్పొరేషన్లతో లాభాలను పంచుకోవాల్సిన అవసరం లేకుండా, డ్రైవర్లు నేరుగా సంపాదించే ప్రత్యామ్నాయ రవాణా సేవను అందించడమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా టూ-వీలర్ ట్యాక్సీలు, ఆటో-రిక్షాలు, ఫోర్-వీలర్ ట్యాక్సీలను సహకార్ ట్యాక్సీ వ్యవస్థ కింద నమోదు చేసుకోవడం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సహకార్ సే సమృద్ధి’ అనేది కేవలం నినాదం కాదని, దీనిని సాకారం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ గత మూడున్నర సంవత్సరాలుగా రాత్రింబవళ్లు పనిచేసిందని షా అన్నారు. రాబోయే నెలల్లో సహకార్ ట్యాక్సీ సేవను ప్రారంభించనున్నట్లు షా పేర్కొన్నారు.
ప్రైవేట్ కంపెనీల మాదిరిగా కాకుండా, ప్రభుత్వం మద్దతుతో నడిచే సహకార్ ట్యాక్సీ సేవ ద్వారా వచ్చే ఆదాయం అంతా డ్రైవర్లకే చెందుతుందని, ఇది వారికి ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. సహకార్ సేవ ద్వారా వచ్చే లాభాలు ఏ పెద్ద పారిశ్రామికవేత్తకు వెళ్లవు, వాహనాల డ్రైవర్లకు మాత్రమే వెళతాయని అమిత్ షా స్పష్టం చేశారు.