ఇప్పటి వరకు కుంభమేళాలో 8 కోట్ల మంది పుణ్య స్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే ఎనిమిది రోజుల వ్యవధిలో దాదాపు 9 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ 8.81 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. తొలిరోజైన సోమవారం 1.65 కోట్ల మందికిపైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండో రోజైన మకర సంక్రాంతి రోజునే (మంగళవారం) 3.5 కోట్ల మందికిపైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మూడో రోజు కూడా కోటి మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చారు.
సోమవారంన 54.96 లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు.