ఇస్లాం పట్ల డా. బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టికోణం
భారత రాజ్యాంగ రూపకల్పనలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ భాగస్వామ్యం మనం ఎప్పటికీ మరచిపోలేము. అలాగే సమాజంలో వెనుకబడిన వర్గాల ఉన్నతి కోసం, వారిని ఒక తాటిపై నడపడం కోసం ఆయన చేసిన కృషి కూడా చాలమందికి తెలుసు. అయితే స్వాతంత్య్రానికి ముందు, ప్రస్తుతం కూడా బాగా చర్చలోకి వచ్చే ‘హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన వైషమ్యం’ గురించి ఆయన ఏమి చెప్పారో చాలామందికి తెలియదు. కొద్దిమంది రచయితలు, మేధావులు ఆయన చెప్పిన విషయాలు ప్రజల ముందుకు రాకుండా ప్రయత్నపూర్వకంగా అడ్డుకున్నారు. హిందూ సమాజంతోపాటు ముస్లిం సమాజాన్ని, ఇస్లాం మతాన్ని కూడా బాబాసాహెబ్ అధ్యయనం చేశారు. ఈ విషయంపై ఆయన వ్రాసిన ‘థాట్స్ ఆన్ పాకిస్థాన్’ అనే పుస్తకం 1941లోనే ప్రచురిత మయ్యింది. ఇదే పుస్తకం 1945లో ‘పాకిస్థాన్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా’ పేరుతో ప్రచురిత మయింది.
ఇస్లాం బయట తమకు రక్షణ లేదని ముస్లింలకు బోధిస్తారని బాబాసాహెబ్ ఆ పుస్తకంలో వివరించారు. అలాగే ఇస్లాం తప్ప బయట ఎక్కడ సత్యం లేదని కూడా చెపుతారు. ఇస్లాం మత ఆచారాలలో తప్ప మరెక్కడా శాంతి లేదని కూడా నమ్మిస్తారు. ఇలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు నిరంతరం కలిగించడంతో ఇస్లాం కాకుండా మరొక ఆలోచనాధోరణి కూడా ఉందని ముస్లింలు విశ్వసించలేని స్థితి ఏర్పడుతుంది. దీనివల్ల తమ మతం మాత్రమే నిజమైనదనే ధోరణి ముస్లింలలో కలుగుతుంది. ఇస్లాం సంకుచితమైన, మూసుకు పోయిన ఆలోచన ధోరణి అని బాబాసాహెబ్ అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచన ధోరణికి బయట ఉన్నవారు, ముస్లిమేతరుల పట్ల ముస్లిముల మనస్సులో ద్వేషం, నిర్దయ ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా గాంధీజీ అనుచరుడైన మహమ్మద్ ఆలీ మాటల్ని ఆయన గుర్తుచేసేవారు. అలీఘర్, ఆజ్మీర్‌లలో మాట్లాడుతూ ఆలీ ‘గాంధీజీ ఎంత గొప్పవారైనా కావచ్చును, కానీ మతం దృష్ట్యా చూస్తే ఆయన కంటే దుష్టుడైనా ముస్లిమే గౌరవనీయుడు’.
దారుల్ ఇస్లాం, దారుల్ హరబ్
ఇస్లామిక్ మత చట్టం ప్రపంచాన్ని దారుల్ ఇస్లాం, దారుల్ హరబ్‌గా విభజిస్తుందని బాబాసాహెబ్ గుర్తించారు. ఇస్లాం పాలన ఉన్న ప్రాంతం దారుల్ ఇస్లాం అయితే, ఆ పాలన లేని ప్రదేశం దారుల్ హరబ్. అంటే యుద్ధం ద్వారా దానిని కూడా దారుల్ ఇస్లాంగా మార్చాలి. ముస్లిములు, ముస్లిం పాలకుల కర్తవ్యం ఏమిటంటే ‘జిహాద్’ ద్వారా దారుల్ హరబ్‌ను దారుల్ ఇస్లాంగా మార్చడం.
ఇస్లాం మత సూత్రాలప్రకారం పాలన సాగని దేశాల్లో ముస్లిం పాలన తేవడం కోసమే ప్రయత్నం జరగాలని బోధిస్తారు. బాబాసాహెబ్ విశ్లేషణ వల్ల మన దేశంలో ముస్లింలు ‘ముస్లిం పర్సనల్ బోర్డ్’ను ఎందుకు ఏర్పాటుచేసుకున్నారో, అలాగే ప్రతి జిల్లాలో ‘షరియా కోర్టులు’ ఎందుకు నడుపుతున్నారో అర్ధమవుతుంది.
ముస్లిం రాజకీయాలు
ముస్లిం రాజకీయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా అర్ధం చేసుకున్నారు. ముస్లిం రాజకీయాల్లో వేర్పాటువాదం, తీవ్ర ధోరణి ప్రధాన లక్షణాలని ఆయన గుర్తించారు. హిందువులలోని బలహీనతలను ఆసరా చేసుకుని లాభం పొందాలనుకునే భావన కూడా ఉంటుంది. హింస ద్వారా తాము అనుకున్నది సాధించాలనే వ్యూహం ఉంటుంది. సంతుష్టికరణ ద్వారా ముస్లింలను మంచి చేసుకోవాలనే కాంగ్రెస్ వైఖరిని బాబాసాహెబ్ వ్యతిరేకించారు. ‘సంతుష్టికరణ’ విధానంవల్ల ముస్లింలలో తీవ్ర ధోరణి మరింత పెరిగిందని ఆయన అభిప్రాయ పడ్డారు. సంతుష్టికరణ ధోరణి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఆయన చెప్పినట్లే అది చివరికి దేశ విభజనకు దారితీసింది.
పాకిస్థాన్ ఏర్పాటు
హిందువులు, ముస్లిముల మధ్య వైషమ్యాలను చూసి బాబాసాహెబ్ విచారించేవారు. పాకిస్థాన్ ఏర్పాటుతో ముస్లింలు సంత ృప్తి పడతారని ఆయన భావించలేదు. అలాగే దీని వల్ల ‘మత సమస్య’ కూడా పరిష్కారం కాదని అన్నారు. జనాభా పరంగా పాకిస్థాన్ ఒక దేశంగా నిలబడితే, భారత్ మాత్రం ‘మిశ్రమ దేశం’గా మిగిలిపోతుందని ఆయన ఊహించారు. అందుకనే ఈ సమస్య పరిష్కరించ డానికి ‘జనాభా వినిమయం’ ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. ముస్లింలందరిని పాకిస్థాన్ పంపివేసి, అక్కడ ఉన్న హిందువులను ఇక్కడికి తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
హిందూ, ముస్లిం సమస్యకు పరిష్కారం
సెక్యులరిజం ఒక భ్రమ అని బాబాసాహెబ్ భావించారు. హిందువులు అధిక సంఖ్యాకులు కాబట్టి వారికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. భారతీయ జీవన విలువలే తమ మధ్య దూరాన్ని తగ్గిస్తాయని హిందువులు భావిస్తారు. ముస్లింలు కూడా ఒకప్పుడు హిందువులే. చాలా మంది ముస్లింలు హిందువుల మాదిరిగానే జీవిస్తారు, మాట్లాడతారు. ఈ సామాన్య గుణాలవల్ల హిందూ, ముస్లింలు ఒక జాతి అయిపోతారా? కలిసుండాలనే ఆలోచన వారిలో కలుగుతుందా?
హిందువులు, ముస్లింలు సమానంగా గుర్తుచేసుకునే, గర్వించే ఏదైనా సంఘటనగాని, అంశంగానీ ఉన్నాయా అని బాబాసాహెబ్ ప్రశ్నించారు. కొన్ని పద్దతులు ఒకటే అయినా వాటికంటే మించి మతపరమైన, రాజకీయాపరమైన తేడాలు ఉన్నాయని బాబాసాహెబ్ అభిప్రాయ పడ్డారు.
ఆశా కిరణం
అయినా బాబాసాహెబ్ ఒక ఆశను వ్యక్తం చేశారు. సైన్యం గురించి మాట్లాడుతూ ముస్లింలలో ఉన్న జాతీయభావన ఈ సమస్యను పరిష్కరించ గలుగుతుందని ఆయన భావించారు. ముస్లిం సమస్య గురించి బాబాసాహెబ్ చెప్పిన విషయాలు ఇప్పటికీ వర్తిస్తాయి. భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు అవి ఉపయోగపడతాయి. హిందువులు, ముస్లింలు ఒకే వారసత్వం కలిగినవారు. కనుక ముస్లింలు తమ మత సిద్ధాంతాలకు అతీతంగా జాతీయవాదాన్ని అనుసరిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని బాబాసాహెబ్ సూచించారు.
– రాంస్వరూప్ అగ్రవాల్