ఇస్లామీకరణ నుంచి బోర్పుకాన్ రక్షించాడు : సదస్సులో వక్తలు

లెజెండరీ అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ ప్రదర్శించిన అసమానమైన ధైర్యం, అసాధారణమైన యుద్ధ వ్యూహాలు ఆక్రమణదారుల మొఘల్‌లను ఓడించడమే కాకుండా మొత్తం ఆగ్నేయాసియా ప్రాంతాన్ని ఇస్లామీకరణ నుండి రక్షించాయని అస్సాం క్షేత్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బౌద్ధిక్ ప్రముఖ్ శంకర్ దాస్ కలిత చెప్పారు.అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ శాశ్వతమైన దేశభక్తి, శౌర్యాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో, ఢిల్లీ ఈశాన్య సంఘం దేశ రాజధానిలో ఆదివారం లచిత్ దివస్‌ను నిర్వహించింది. ఢిల్లీలోని హర్యానా భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రధాన ప్రసంగం చేస్తూ కఠినమైన శిక్షణ, క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం అతని విజయానికి ఎలా కీలకమో అతని జీవన ప్రయాణం వివరిస్తుంది తెలిపారు.
లచిత్ ధైర్యం, పరాక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ అతన్ని అస్సాంకు మాత్రమే హీరోగా పరిమితం చేయడం సరికాదని స్పష్టం చేశారు. “ఈ రోజు శివాజీ గురించి అందరికీ తెలిసినప్పటికీ, చాలామందికి లచిత్ బోర్ఫుకాన్ గురించి తెలియదు. ఇది ప్రాథమికంగా కొంతమంది చరిత్రకారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. కొంతమంది లచిత్ గొప్ప వారసత్వాన్ని అస్సాంలోనే పరిమితం చేసే ధోరణి కారణంగా ఉంది. ఇది దాటి చూడవలసిన సమయం ఆసన్నమైనది” అని స్పష్టం చేశారు. భారతదేశం అంతటా లచిత్ వారసత్వం నేర్చుకోవలసినది చాలా ఉందని చెబుతూ లచిత్ అసాధారణ నైపుణ్యాల గురించి తరతరాలు నేర్చుకోవాలని సూచించారు. ఢిల్లీలో (2022) అస్సాం ప్రభుత్వం లచిత్ దివస్‌ను జరుపుకోవడం గురించి ప్రస్తావిస్తూ, ఇది ప్రశంసనీయమైన ప్రయత్నమే అయినప్పటికీ, కొందరు దీనిని విస్తృతంగా విమర్శించారని విచారం వ్యక్తం చేశారు.
కొన్ని మొఘల్ అధ్యాయాలను పాఠ్యాంశాల నుండి తొలగించిన తర్వాత కొన్ని సమూహాలు లచిత్ ఉనికిని ఎలా ప్రశ్నించడం ప్రారంభించాయో కూడా గుర్తు చేశారు. మొఘల్‌లు లేకుండా లచిత్ ఉనికిలో లేడు అంటూ చేసే వాదనలు, దృక్పథాలు లచిత్ వంటి గొప్ప యోధుని బంగారు వారసత్వాన్ని పరిమితం చేయడమే కాగలదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిమితిని అధిగమించడానికి, ఖచ్చితమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, విస్తృత ఆలోచనలను విస్తరించడం అవసరం అని సూచించారు.
లచిత్ బోర్ఫుకాన్ రాత్రికి రాత్రే గొప్ప యోధుడు కాలేదని కలితా తెలిపారు. లచిత్ పట్టుదల, క్రమశిక్షణను కొత్త తరం అధ్యయనం చేసి అనుకరించాలని ఆయన సూచించారు. ఒక చిన్న మిలిటరీ యూనిట్ కమాండర్ నుండి బోర్ఫుకాన్ (ఆర్మీ చీఫ్) స్థాయికి లచిత్ ప్రయాణాన్ని ఆయన వివరించారు. బటిండా సెంట్రల్ యూనివర్శిటీ ప్రో-వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిరణ్ హజారికా, అస్సాం క్షేత్రంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార్ ప్రముఖ్ డాక్టర్ సునీల్ మొహంతి, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *