ఉగాదినాడు ఉదయించిన కిరణం..డా.హెడ్గేవార్
సమాజ క్షేమం కోసం ప్రతిక్షణం జ్యోతిలా వెలుగుతూ, తనను తాను సమర్పించుకుంటూ, ఏ రకమైన మోహానికీ, అహంకారానికీ లోను కాకుండా సమాజ కార్యం చేయడమే మహోన్నతమైనదని, అత్యంత అవసరమైనదని, తన జీవితం ద్వారా చూపించారు డాక్టర్ హెడ్గేవార్‌జి. వారు 1889 ఏప్రిల్ 1న ఉగాదినాడు జన్మించారు. 1925లో సంఘం ప్రారంభించే నాటికి డాక్టర్ హెడ్గేవార్‌జి వయస్సు 36 సంవత్సరాలు. కలకత్తా మెడికల్ కళాశాల నుండి వారు డాక్టరు కోర్సు పాసయ్యారు. లోకమాన్య తిలక్, గాంధీజి, సావర్కర్, నేతాజి, రాజగురు లాంటి విప్లవ వీరులతో కలిసి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఆ సమయంలో రెండుసార్లు జైలుకు కూడా వెళ్లారు. బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా దేశం అంతటా ‘వందేమాతరం’ ఒక మంత్రంగా మారింది.
డా. హెడ్గేవార్ కూడా 1907లో రామపాయలిలో విజయదశమి రోజున ‘వందేమాతరం’ నినాదం చేశారు. రావణ దహనం తర్వాత తన మిత్రులతో కలిసి ఆయన ‘వందేమాతరం’ పంక్తులను పునరుచ్చరించారు. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం మరియు ‘వందేమాతరం’ నినాదం కారణంగా డా. హెడ్గేవార్ను బహిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం రావడం ఖాయమని, అయితే దాన్ని స్వాభిమాన స్వాతంత్ర్యంగా నిలుపుకొని భారతీయ మూలాలను పరిరక్షించాలని నిర్ణయించారు అందుకై 1925 విజయదశమి రోజున కేవలం ఐదుగురు సభ్యులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు పురుడు పోశారు డాక్టర్ హెడ్గేవర్.