ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం పాక్ లో ఆచారం : విక్రమ్ మిస్రీ
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్,పీఓజేకే లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడంపై మిస్రీ మండిపడ్డారు.ఆపరేషన్ సిందూర్ కి సంబంధించి కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి విక్రమ్ మిస్రీ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
ఉగ్రవాదాన్ని వదులుకోవడానికి పాక్ ఇప్పటికీ సిద్ధంగా లేదని, ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం పాక్ లో ఆచారంగా వస్తోందంటూ దెప్పిపొడిచారు. హతమైన ఉగ్రవాదుల శవ పేటికల వెనుక యూనిఫాం ధరించిన పాక్ సైన్యం, పోలీసు సిబ్బంది వున్నారని, అలాగే వారు ప్రార్థనలు కూడా చేస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మిస్రీ విలేకరుల సమావేశంలో బయటపెట్టారు. ఈ ఫొటోల ద్వారా పాక్ ఏ సందేశాన్ని పంపిస్తోందని సూటిగా ప్రశ్నించారు. ఒకానొక సందర్భంలో లష్కరే తోయ్యబా ఉగ్రవాది అంత్యక్రియల ప్రార్థనలకు కూడా నాయకత్వం వహించడం కనిపించిందని గుర్తు చేశారు.
ఉగ్రవాదానికి పాక్ కేంద్ర బిందువని ఇప్పటికే చాలా సార్లు రుజువైందన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ముంబై దాడులు, ఉరి, పుల్వామా, పఠాన్ కోట్ దాడులు దీనికి కొన్ని ఉదాహరణలని అన్నారు. ఎన్ని ఆధారాలు చూపినా, పాక్ పట్టించుకోలేదని, ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తులను నిలిపేసిందన్నారు. ఒసామా బిన్ లాడెన్ ను అమరుడని కొనియాడింది ఎవరో చెప్పాల్సిన పనేలేదంటూ దెప్పిపొడిచారు. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాదులకు పాక్ నిలయమని అన్నారు. పైగా పాకిస్తాన్ ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తోందని మండిపడ్డారు.
అబద్ధాలు చెప్పడానికే పాకిస్తాన్ పుట్టిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని ఇస్తోందన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు ఎంతమాత్రమూ కాదని మరోసారి స్పష్టం చేశారు.
భారత్ కి సంబంధించిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న వాదలను విక్రమ్ మిస్రీ తోసిపుచ్చారు. పాకిస్తాన్ పుట్టిన వెంటనే అబద్ధాలు చెప్పడం ప్రారంభించిన దేశమని దెప్పిపొడిచారు. ఈ అబద్ధాల యాత్ర 75 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందన్నారు. 1947 లో జమ్మూ కశ్మీర్ ను ఆక్రమించుకున్న సమయంలో పాక్ ఏకంగా ఐక్యరాజ్య సమితి ముందే అబద్ధాలాడిందని గుర్తు చేశారు. తమకు కశ్మీర్ తో సంబంధం లేదని చెప్పిందని, అప్పటి నుంచే ఈ అబద్ధాల ప్రయాణం ప్రారంభమైందన్నారు.
ఆపరేషన్ సిందూర్ లో సామాన్య పౌరులు చనిపోయారని చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని, అది అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రార్థనా స్థలాలపై దాడి చేశామనేది కూడా అబద్ధమేనని అన్నారు. అయితే కొన్ని ప్రార్థనా స్థలాలను దుర్వినియోగం చేస్తూ ఉగ్రస్థావరాలుగా పాక్ చేసుకున్న మాట మాత్రం వాస్తవమేనని అన్నారు. ఇది కాదన్నట్లుగా సిక్కులను లక్ష్యంగా చేసుకొని కశ్మీర్ లోని గురుద్వారాలపై దాడులు చేస్తోందని దుయ్యబట్టారు. తాజా దాడుల్లో సిక్కులు చనిపోయారని, సామాన్య పౌరులపై ఆ దేశం దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని, ఉగ్రవాద నిర్మూలనకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్తాన్ మతం రంగు పూస్తోందని మండిపడ్డారు.