ఉత్తర్ ప్రదేశ్ చట్టంలో ఏముంది?

– కె. సహదేవ్

బలవంతపు మతమార్పిడులను, ముఖ్యంగా వివాహం చేసుకునేందుకు, పాల్పడటాన్ని నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ ఒక చట్టాన్ని ఆమోదించింది. అయితే ఈ చట్టం పూర్తిగా `లవ్ జిహాద్’ ను దృష్టిలో పెట్టుకుని చేశారని, అసలు లవ్ జిహాద్ కేసులనేవే లేవని కొందరు విమర్శలు మొదలుపెట్టారు. విచిత్రంగా మొత్తం చట్టంలో ఎక్కడా లవ్ జిహాద్ ప్రస్తావనే లేదు. అయినా సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై విపరీతమైన ప్రచారం సాగుతోంది. `భారత్ లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో ముస్లిం వ్యతిరేక ధోరణితో కూడిన చట్టాన్ని ఎందుకు తెచ్చారు?’ అంటూ వార్తా పత్రికలు శీర్షికలు పెడుతున్నాయి.

కానీ ఆ చట్టానికి సంబంధించిన నిజానిజాలు ఒకసారి చూద్దాం. ఆ చట్టం పేరు `యూపీ చట్టవ్యతిరేక మతమార్పిడి నిషేధ చట్టం – 2020’. ఇందులో ఎక్కడా లవ్ జిహాద్ అనే మాట లేదు. అలాగే ఈ చట్టం ఏ పౌరుడి మతస్వేచ్ఛ హక్కునూ అడ్డుకోదు. ఇలాంటి చట్టాన్ని ఇంతకు ముందు మరికొన్ని రాష్ట్రాలు కూడా తీసుకువచ్చాయి కూడా.

వివాహం కోసం మోసపూరితంగా, ప్రలోభానికి గురిచేసి మతం మార్చడానికి వ్యతిరేకంగా ఉత్తరాఖండ్ మతస్వేచ్ఛ చట్టం, 2018 అమలయ్యింది. ఈ చట్టం లోని పరిచ్ఛేదం 3 ఇలా పేర్కొంటోంది –

`ఏ వ్యక్తి మరొకరిని తప్పుడు సమాచారం ద్వారాగాని, బలవంతంగాకానీ, భయపెట్టి, మభ్యపెట్టి, మోసం చేసి లేదా వివాహం ద్వారాకానీ మతం మార్చడం గాని, మార్చేందుకు ప్రయత్నించడంగానీ చేయరాదు.’ `అయితే ఒక వ్యక్తి తన పూర్వజుల మతానికి తిరిగి రావడం ఈ చట్టం క్రింద మతమార్పిడిగా పరిగణించబడదు.’

మరి 2008లోనే ఉత్తరాఖండ్ ఇలాంటి మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని అమలు చేసినప్పుడు రాని వ్యతిరేకత ఇప్పుడేందుకు వస్తోంది? ఈ విమర్శల లక్ష్యం చట్టమా? లేక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధా? నిజానికి ఇలాంటి చట్టం అమలు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్ట్, ఉత్తర్ ప్రదేశ్ చట్ట సంఘం సిఫార్సు చేశాయి. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో ఈ చట్టాన్ని తీసుకురావడం వల్ల ఇలాంటి చట్టాల అవసరాన్ని హైకోర్ట్ లు గుర్తించి, సూచించిన కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

చట్టంలోని అంశాలు :

  1. తప్పుడు సమాచారం ద్వారాగాని, బలవంతంగాకానీ, భయపెట్టి, మభ్యపెట్టి, మోసం చేసి లేదా వివాహం ద్వారాకానీ మతం మార్చడం గాని, మార్చేందుకు ప్రయత్నించడాన్నిగానీ అడ్డుకోవడం ద్వారా మతస్వేచ్ఛను కాపాడటం ఈ చట్టం లక్ష్యం.
  2. అలాంటి మతమార్పిడులకు పాల్పడేవారికి 1 నుంచి 5 సంవత్సరాల శిక్ష విధిస్తారు. ఎస్, ఎస్టీ వర్గాలకు చెందిన మైనర్ లను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తే అధిక మొత్తంలో జరిమానా కూడా ఉంటుంది.
  3. మతం మారదలచుకున్నవారు, మార్చదలచుకున్నవారు ముందుగా నిర్ధారిత పత్రాలను జిల్లా కలెక్టర్/ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో సమర్పించాలి. అప్పుడు జిల్లా అధికారులు మతమార్పిడి కారణాలను, ఉద్దేశ్యాన్ని పరిశీలిస్తారు.
  4. మతం మార్చుకున్న వ్యక్తి తాను ఇచ్చిన వివరాలు సరైనవేనని జిల్లా కలెక్టర్/ మేజిస్ట్రేట్ ఎదుట హాజరై దృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
  5. మతమార్పిడి కారణాలు, ఉద్దేశ్యాలు సరైనవేనని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ మతమార్పిడికి పాల్పడుతున్న వ్యక్తిపైనే ఉంటుంది.
  6. ఏ వ్యక్తి తన ముందటి (పూర్వపు) మతానికి తిరిగి రావడాన్ని ఈ చట్టం మతమార్పిడిగా పరిగణించదు.

ప్ర; ఈ చట్టం మహిళలు తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను అడ్డుకుంటుందా?

లేనేలేదు. నిజానికి అలాంటి స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. వివాహ సమయంలో లేదా ఆ తరువాత మహిళలను బలవంతంగా మతం మార్చడాన్ని అడ్డుకుంటుంది. తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి వారికి స్వేచ్ఛ కలిగిస్తుంది. పెళ్ళికి ముందు అసలు వివరాలు దాచిపెట్టి పెళ్లి తరువాత మతం మార్చడానికి ప్రయత్నించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ చట్టం మతమార్పిడిని యధాతధంగా నిషేధించడం లేదు. బలవంతంగా మార్చే విధానాన్ని మాత్రం అడ్డుకుంటోంది.

ప్ర. ఇష్టపూర్వకంగా మతం మారడాన్ని ఈ చట్టం అడ్డుకుంటుందా?

లేదు. వివాహం కోసం మతం మారడాన్ని గతంలో కోర్ట్ లు నిషేధించాయి. ప్రస్తుత చట్టం ఆ కోర్ట్ తీర్పులను నియమనిబంధనల రూపంలోకి తెచ్చింది. కొన్ని పౌర చట్టాలను తప్పించుకునేందుకు మతం మారతామంటే వీలులేదు. ఉదాహరణకు ఒకరి కంటే ఎక్కువమంది భార్యలను కలిగిఉండడం కోసం ఇస్లాం మతం పుచ్చుకుంటామంటే కుదరదు. అలాగే పూర్వీకుల ఆస్తి కుమార్తెలకు పంచకుండా ఉండేందుకు ఇస్లాం స్వీకరిస్తామంటే కూడా వీలు కాదు.

కేవలం ఒక మత సూత్రాల పట్ల పూర్తి ఇష్టంతో, గౌరవంతో మాత్రమే మతం మారవచ్చును. `ఇష్టప్రకారం’ అనేది మత మూఢత్వం, చట్ట ఉల్లంఘనకు దారితీయడానికి వీలులేదు.

ప్ర. ఈ చట్టం రాజ్యాంగంలోని 25ఏ అధికరణని ఉల్లంఘిస్తోందా?

ముందుగా 25ఏ అధికరణ ఏమిటో క్లుప్తంగా చూద్దాం.

“ప్రజా వ్యవస్థ, నైతికత, ఆరోగ్యాలకు భంగకరం కానంత వరకు ప్రతిఒక్కరికీ తమ మతాన్ని అనుసరించడానికి, ప్రచారం చేసుకునేందుకు సమాన హక్కు ఉంటుంది.’’ అయితే యూపీ లోని కొత్త చట్టం ఈ ప్రచార హక్కును కాలరాస్తోందంటూ ఇస్లాంవాదులు కొందరు ఆరోపిస్తున్నారు. అయితే వీళ్ళు `ప్రజా వ్యవస్థ, నైతికత, ఆరోగ్యానికి భంగకరం కానంతవరకు’ అనే మొదటి భాగాన్ని వదిలిపెట్టి తెలివిగా `మతాన్ని అనుసరించే, ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది’ అనే రెండవ భాగాన్ని గురించి మాత్రమే మాట్లాడతారు.

`ప్రచారం’ అంటే ఒక వ్యక్తి మరొకరికి తన మతం, సంస్కృతి, సంప్రదాయం, విలువల గురించి చెప్పడం. దీనిని మాత్రమే సుప్రీం కోర్ట్ పరిరక్షిస్తుంది. అంతేకాని ఇస్లాం దురాక్రమణదారులు అనుసరించే `మతం మారు లేదా చావుకు సిద్ధమవు’ అనే విధానం `ప్రచారం’ కానేకాదు. ఆ విధానం ప్రజారోగ్యాన్ని, వ్యవస్థను భంగపరుస్తుంది. మతమార్పిడి అధికరణం 25 పేర్కొన్న ప్రాధమిక హక్కులలో లేనేలేదు. కనుక మతమార్పిడి నిషేధ చట్టాలు ప్రాధమిక హక్కులకు ఏ విధంగానూ వ్యతిరేకం కావు.

ఇలాంటి మతమార్పిడి చట్టం అమలు కావడం ఇదే మొదటిసారి కాదు. ఒరిస్సా 1967లోనే ఒరిస్సా మత స్వేచ్చ చట్టాన్ని అమలుచేసినప్పుడు దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కోర్ట్ కొట్టివేసింది. ఈ విషయం బాగా తెలుసుకాబట్టే మతమార్పిడి ముఠాలు యూపీ చట్టానికి వ్యతిరేకంగా కోర్ట్ తలుపులు తట్టకుండా కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా విషప్రచారం చేస్తున్నాయి.

ఈ చట్టం మతాంతర వివాహాలను కూడా ఏవిధంగానూ అడ్డుకోదు. మతమార్పిడుల విషయమై అనేకసార్లు కోర్ట్ లు తీర్పులు ఇచ్చాయి. వీటిని అడ్డుకునేందుకు చట్టాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించాయి. కోర్ట్ లు సూచించిన ప్రకారమే యూపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది.

మన దేశంలో వివిధ మతవర్గాలకు వేరువేరు పౌర చట్టాలు ఉన్నాయి. అందువల్ల మోసపూరితంగా లేదా బలవంతంగా మతం మార్చడం వల్ల వివాహం, ఆస్తి హక్కు విషయాల్లో అన్యాయం జరిగే అవకాశం ఉంది.

రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం ప్రస్తావన ఉన్నప్పటికీ ఉమ్మడి పౌర స్మృతి లేకపోవడం వల్ల రాజ్యం మత వర్గాలకు చెందిన ప్రత్యేక పౌర చట్టలలో జోక్యం చేసుకునే ప్రమాదం ఏర్పడుతుంది.

కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మతహక్కును పరిరక్షించే చట్టాలు అవసరమవుతాయి. సమాజంలో ముఖ్యమైన భాగమైన మహిళల హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించిన ఇలాంటి చట్టాలను, నిజానికి అన్నీ మత వర్గాలకు చెందిన వారందరూ ఆహ్వానించాలి. కానీ బిజెపి పాలిత రాష్ట్రంలో అమలైంది కాబట్టి ఈ చట్టంపై పలువురు, పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఇది దురదృష్టకరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *