ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా

భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాజీనామా లేఖ పంపారు. అనారోగ్య కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆరోగ్యానికి తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్యుల సలహాలను పాటించేందుకు వీలుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. తన పదవీ కాలంలో తనకు మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంటు సభ్యులందరికీ ధన్కడ్ ధన్యవాదాలు ప్రకటించారు. వారి నుంచి లభించిన అమూల్యమైన సహకారం,ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు.వారినుంచి తానెంతో నేర్చుకున్నానని చెప్పారు. పార్లమెంటు సభ్యులందరూ తనపై చూపించిన ఆదరణ, విశ్వాసం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటానని చెప్పారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఉపరాష్ట్రపతిగా తాను పొందిన విలువైన అనుభవాలు మరువలేనని, ఇందుకుగాను అందరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు.
2019 లో ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చారు. అదే సంవత్సరం బెంగాల్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2022 లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఆయన్ను తమ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. విపక్ష కూటమి అభ్యర్థి అయిన మార్గరేట్ ఆల్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించి, 14 వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *