ఊహకే అందని ప్రమాదం.. కుప్పకూలిన ఏయిరిండియా విమానం..

భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణ ఘటన జరిగింది. మాటలకందని మహా విషాదం గగనతలంలో చోటు చేసుకుంది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఏఐ171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే ఈ ఘోరం జరిగిపోయింది.

 

రన్ వే సమీపంలో మేఘానీ నగర్ లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 241 మందీ దుర్మరణం పాలయ్యారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా వున్నారు. లండన్ లో వుంటున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది.ఈ 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా… 53 మంది బ్రిటన్ వాసులు, ఏడుగురు పోర్చుగల్ వాసులు, ఒకరు కెనడా పౌరుడు వున్నాడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది కూడా వున్నారు.

మెడికోలు కూడా మృత్యువాత…

విమానం కూలిన ప్రాంతంలోని బీజేపీ వైద్య కళాశాల మెడికోల వసతి సముదాయం బాగా ధ్వంసమైంది. 24 మంది మరణించినట్లు భావిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మెడికోలే. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటిన్ పై పడి, పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. పలు భవనాలు కూడా మండలంటుకొని కాలాయి.

మేడే అలర్ట్.. అలర్ట్….

విమానం టేకాఫ్ అయి, 600 అడుులపై ఎత్తుకు వెళ్లిందో… సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు దిగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్థిస్థాయిలో మూసుకోలేదు. దీంతో పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ‘‘మేడే’’ కాల్ చేశారు. ఏటీసీ తక్షణం స్పందించి, కాల్ చేసినా.. పరిస్థితి చేయి దాటిపోయింది.

వెంటనే స్పందించిన ప్రధాని, పౌరవిమాన మంత్రి, కేంద్ర హోంమంత్రి..

విషయం తెలుసుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వెంటనే కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని, ఎప్పటికప్పుడు సమాచారం తనకు అందించాలని ఆదేశించారు. దీంతో విజయవాడ నుంచి హుటాహుటిన బయల్దేరి, సంఘటనా స్థలికి చేరుకున్నారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

డీఎన్ఏ టెస్టుల తర్వాతే మృతుల ప్రకటన : అమిత్ షా

అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన దుర్ఘటన స్థలాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు. ప్రమాదం జరిగిన క్రమాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ లో ఆస్పత్రులకు వెళ్లి, క్షతగాత్రులను పరామర్శించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ ఎయిరిండియా 171 విమానం కూలిపోయిందని, ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించారని ప్రకటించారు. విమానంలో 230 మంది ప్రయాణికులు వున్నారని, 12 మంది సిబ్బంది వున్నారని తెలిపారు. విమాన ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే క్షేమంగా బయటపడ్డారని తెలిపారు. మృతుల గురించి తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నామని, ఈ పరీక్షల తర్వాతే మృతుల గురించి ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దాదాపు 1000 కి పైగా టెస్టులు చేయాలన్నారు. అలాగే ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం వుందని, విమానం పేలిన వెంటనే మంటలు వ్యాపించాయన్నారు. మంటలు వ్యాపించడంతో ఎవ్వర్నీ కాపాడే పరిస్థితి లేకుండా పోయిందని అమిత్ షా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *