ఎన్నారై భక్తులకు టీటీడీ ప్రత్యేక దర్శన అవకాశం!
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) స్థానిక, ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) భక్తులకు శుభవార్త ప్రకటించింది. ఫిబ్రవరి 11న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోరుకునే తిరుపతి భక్తుల కోసం ఫిబ్రవరి 9న ప్రత్యేక దర్శన టోకెన్లు జారీ చేయనుంది. ఈ టోకెన్లు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో అందుబాటులో ఉంటాయి.
ఫిబ్రవరి 4న రథసప్తమి కారణంగా, తిరుపతి నివాసితుల కోసం ప్రత్యేక దర్శనంను టిటిడి ఫిబ్రవరి మొదటి మంగళవారం నుండి నెలలో రెండవ మంగళవారం వరకు రీషెడ్యూల్ చేసింది. అంతేకాకుండా, ఎన్నారై భక్తుల కోసం కూడా టిటిడి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐలకు కేటాయించిన విఐపి బ్రేక్ దర్శన స్లాట్‌ల సంఖ్యను రోజుకు 50 నుంచి 100కి పెంచింది. ఈ నూతన విధానాన్ని సోమవారం నుంచి టీటీడీ అమల్లోకి తీసుకురానుంది.
2019 ముందు వరకు వారంలో ఐదు రోజుల పాటు రోజూ 50 మంది ప్రవాసాంధ్రులకు ఏపీఎన్‌ఆర్టీఎ్‌స సిఫార్సుతో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ కల్పించేది. వారితోపాటు కుటుంబ సభ్యులను అనుమతించేవారు. తర్వాత ఆ కోటాను రోజుకు 12 మందికి పరిమితం చేశారు. కుటుంబ సభ్యులనూ అనుమతించలేదు. ఈ క్రమంలో నుంచి దర్శన కోటాను పెంచాలని తానా విజ్ఞప్తి చేసింది.
గతేడాది నవంబరు 7న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలోనూ ఈ దర్శన కోటాను పెంచాలని విన్నవించారు. వారితో పాటు కుటుంబ సభ్యులను, ముఖ్యంగా వయసైన తల్లిదండ్రులను, అత్తమామలను అనుమతించాలని కోరడంతో సీఎం అంగీకరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి టీటీడీకి ఫిబ్రవరి 6న ఆదేశాలు అందాయి.