ఎప్పుడు, ఎలా అనేది మీ ఇష్టమే : సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీ

పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు దారుణ మారణహోమానికి పాల్పడి వారం రోజులు పూర్తయింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఈ దాడి తర్వాత కేంద్రం పాకిస్థాన్‌కు బుద్ధి వచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో మంగళవారం కీలక భద్రత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు.కాగా, ఉగ్రవాదులు, వారిని పోషిస్తున్నవారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. ఉగ్రవాద నిర్మూలనకు దృఢచిత్తంతో ఉన్నమని ప్రధాని తెలిపారు.
ఉగ్రవాదాన్ని అణిచివేయడం జాతీయ సంకల్పం అని ఆయన పేర్కొన్నారు. సాయుధ దళాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. తీవ్రవాదం అణిచివేయడంలో, అందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రధాని ప్రకటించారు. ఎప్పుడు, ఎలా స్పందించాలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ పూర్తిగా సైన్యానిదే అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) బుధవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. వారం వ్యవధిలో ఈ భేటీ రెండోసారి.
సీడీఎస్‌ సహా త్రివిధ దళాల అధిపతులతో మోదీ సమావేశం పూర్తయిన వెంటనే ప్రధాని నివాసానికి ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్‌ భాగవత్‌, హోంమంత్రి అమిత్‌ షా కలిసి వెళ్లారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. కాగా, గత వారం రెండు సభలలో భాగవత్‌ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి ఘటనకు గట్టిగా ప్రతిస్పందన ఉండాలంటూ కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవంక, పహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షత వహించారు. బీఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ, అసోం రైఫిల్స్‌ చీఫ్‌లు, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారులు సైతం సమావేశానికి హాజరయ్యారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడి తర్వాత భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చీఫ్ శ్రీనివాసన్, అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా, ఎస్‌ఎస్‌బీ అదనపు డైరెక్టర్ జనరల్ అనుపమ నీలేకర్ చంద్ర సమావేశంలో పాల్గొన్నారు.
జమ్మూ కశ్మీర్‌ పోలీసులు దోడా జిల్లాలో 13 ప్రదేశాల్లో దాడులు నిర్వహించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న వ్యక్తులపై చర్యలు చేపట్టారు. మరో వైపు శ్రీనగర్‌లో పోలీసులు అనేక ప్రదేశాల్లో ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌, నిషేధిత ఉగ్రవాద సంస్థలో పని చేస్తున్న వారి ఇండ్లపై విస్తృత దాడులు నిర్వహించారు. శ్రీనగర్‌లో పోలీసులు ఇప్పటి వరకు 63 మంది వ్యక్తులకు సంబంధించిన ఇండ్లను సోదా చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చట్ట ప్రకారం జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌ అధికారుల పర్యవేక్షణలో ఆయుధాలు, పత్రాలు, డిజిటల్‌ పరికరాలు మొదలైన వాటిని సేకరించి.. ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు ఆధారాలను సేకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *