ఐక్యతా ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ…సర్దార్ పటేల్ స్మారక నాణెం, స్టాంపు విడుదల
భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే…ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో నర్మదా నది ఒడ్డున ఉన్న ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద సర్దార్ పటేల్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాయి. ఈ పరేడ్‌లో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సహా వివిధ రాష్ట్రాల పోలీస్ బలగాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రధానిమోదీ రూ.150 స్మారక నాణెం మరియు స్టాంప్‌ను విడుదల చేశారు. వేడుకల్లో భాగంగా ఆయన ఈ-బస్సుల సముదాయాన్ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ఏక్తా శపథ్’ (ఐక్యతా ప్రతిజ్ఞ) చేశారు. “దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. జాతీయ ఐక్యతా స్ఫూర్తితో ఈ ప్రమాణం స్వీకరిస్తున్నాను. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు.
ఈసందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో భారతదేశ ఏకీకరణ శిల్పిగా పటేల్‌ను అభివర్ణించారు. “భావజాల విభేదాలు ఉన్నవారితో కూడా కలిసి పనిచేసి, ప్రజలను ఏకం చేయడంలో సర్దార్ పటేల్‌కు సాటిలేని సామర్థ్యం ఉంది. ఆయన ప్రతి చిన్న విషయాన్ని గమనించి, దేశ ఐక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేసి, సంస్థానాలను దేశంలో విలీనం చేసి, భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రాన్ని భారతీయులలో మేల్కొల్పారు” అని ప్రధాని వివరించారు.