ఐదేళ్లలో భారత్ రక్షణ ఉత్పత్తుల్లో 90 శాతం వృద్ధి
2024-25లో భారతదేశ వార్షిక రక్షణ ఉత్పత్తులు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,50,590 కోట్లకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది 2023-24లో ఉన్న రూ.1.27 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం వృద్ధిని సూచిస్తుందని చెప్పారు. అంతేకాకుండా, ఈ పెరుగుదల 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి చూస్తే, ఏకంగా 90 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుందని, అప్పట్లో దీని విలువ రూ.79,071 కోట్లుగా ఉందని వివరించారు.
“ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత రక్షణ రంగ ఉత్పత్తులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ గణాంకాలు గత ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షలతో పోలిస్తే, ఇది దాదాపు 18 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి” అని చెప్పారు. “2019-20లో కేవలం రూ.79,071 కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులు జరిగాయి. ఆనాటితో పోలిస్తే, నేడు దేశంలో 90 శాతం ఎక్కువగా డిఫెన్స్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ గొప్ప మైలురాయిని సాధించడంలో డిఫెన్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ రక్షణ రంగ యూనిట్లు, ప్రైవేటు పరిశ్రమల సమిష్టి కృషి ఉంది” అని రాజ్ నాథ్ సింగ్ వివరించారు.
ఈ మైలురాయిని సాధించడంలో రక్షణ ఉత్పత్తి శాఖ, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ తయారీదారులు, ఇంకా ప్రైవేట్ పరిశ్రమలతో సహా అందరి సమిష్టి కృషిని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది భారతదేశ రక్షణ పారిశ్రామికరంగ పెరుగుదలకు స్పష్టమైన సూచికగా మంత్రి అభివర్ణించారు. ఢిల్లీలో ఈ మేరకు రక్షణ మంత్రి వివరాలు వెల్లడించారు.
మోదీ సర్కారు తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ కింద రక్షణ తయారీలో స్వయం సమృద్ధిని ఈ పెరుగుదల నొక్కి చెబుతోందని పేర్కొంటూ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, భారతదేశ అవసరాలను తీర్చడమే కాకుండా ఎగుమతుల సామర్థ్యాన్ని బలోపేతం చేసే రక్షణ పారిశ్రామిక సముదాయాన్ని సృష్టించడంపై చూపిన ప్రాధాన్యత ఈ సానుకూల ఫలితాలను అందించిందని రక్షణ మంత్రి తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఉత్పత్తిలో దాదాపు 77 శాతం వాటాను కలిగి ఉండగా, ప్రైవేట్ రంగం 23 శాతం వాటాను కలిగి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21 శాతం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23 శాతానికి పెరిగిన ప్రైవేట్ రంగం వాటా, దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థలో తన పాత్రను వెల్లడిచేస్తుందని ఆయన చెప్పారు.
గత దశాబ్దంలో విధాన సంస్కరణలు, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం, స్వదేశీ తయారీపై వ్యూహాత్మక ముందుచూపు కారణంగా రక్షణ పరిశ్రమలోని ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాలు రెండూ స్థిరమైన వృద్ధిని ప్రదర్శించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డి పీ ఎస్ యులు, ప్రైవేట్ రంగ మొత్తం ఉత్పత్తి వరుసగా 16 శాతం ఇంకా 28 శాతం మేర పెరగడమే దీనికి నిదర్శనం.