ఒకే ఒక్క వ్యక్తి సంకల్పం… ‘‘స్వయంసమృద్ధి గ్రామంగా తయారైంది…
తమ తమ జీవితాలను మెరుగ్గా చేసుకోవడానికి కొందరు కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడతారు. ప్రభుత్వం చేస్తే సరి, లేదంటే అలాగే వుండిపోతారు తప్పించి, మానవ ప్రయత్నాలు చేయరు. కానీ.. మహారాష్ట్రలోని బరిపడ అన్న కుగ్రామం మాత్రం ఆత్మ నిర్భరతతో, సమష్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆత్మ నిర్భరతకు, సమష్టి సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం బరిపడ గ్రామమే.
అయితే.. వీరికి వెనకుండి ప్రేరణగా నిలుస్తున్న వ్యక్తి చైత్రమ్ పవార్. దాదాపు 758 వనవాసీలు బంజరు భూముల్ని బాగు చేసుకొని, అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. మనిషి సమష్టిగా సంకల్పం చేసుకుంటే అత్యంత కఠినమైన సవాళ్లను కూడా అధిగమించగలరని నిరూపించారు.
ఈ బరిపడ అనేది ముంబై నుంచి 400 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. టేకు, మహువా, వేప లాంటి జాతులతో ఈ గ్రామం చుట్టూ 445 హెక్టార్ల అడవి వుంటుంది. ఒకప్పుడు ఈ గ్రామం సహజ వనరులతో వుండేది. కానీ అడవిని నిర్మూలించడం, చెట్లను నరికేయడం వల్ల బరిపడ గ్రామం, వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోయాయి. కట్టెల కొరత, ఆహార కొరత, నీటి కొరత ఏర్పడింది. గ్రామంలోని 35 బావులలో చాలా బావులు ఎండిపోయాయి. దీంతో అక్కడి వారు 3 కిలోమీటర్ల మేర నడిచి, నీటిని తెచ్చుకునేవారు. అంతేకాకుండా తమ జీవనోపాధి కోసం కొందరు మహిళలు మద్యాన్ని అమ్మడం ప్రారంభించారు. దీంతో మరికొన్ని సామాజిక సమస్యలు కూడా చుట్టుముట్టాయి.
అయితే.. ఇదే గ్రామంలో కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన చైత్రమ్ పవార్ కి అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చాయి. వాటన్నింటినీ కాదని, కేవలం తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. ‘‘వనవాసీ కల్యాణాశ్రమం’’ నుంచి ప్రేరణ పొందిన చైత్రమ్.. తన సమాజాన్ని బాగు చేసుకోవడం, అందరిలో సుగుణాలను నింపడం తన విధి అని భావించారు. ‘‘మనం ప్రతి దానికీ ప్రభుత్వంపై ఆధారపడొద్దు.. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. ప్రభుత్వమే మన దగ్గరికి పరిగెత్తి వచ్చేలా పరిస్థితిని తయారు చేసుకుందాం’’ అని ప్రజలకు నిత్యం ఉద్బోధ చేసేవారు.
1993 నుంచే ఈ ప్రయత్నం మెళ్లిగా నడుస్తోంది. మొదట గ్రామ సమావేశం నిర్వహించి, ప్రజలను చైతన్యపరిచారు. దీంతో అటవీ సంరక్షణ చట్టం తెచ్చింది సర్కార్. ఇందులో అందర్నీ కలుపుకుపోయేలా ప్రతి కుటుంబం నుంచి ప్రతినిధులను రొటేట్ చేసింది. ఇందులో మొత్తం 108 కుటుంబాలకు వాటా ఇచ్చింది. పవార్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. చాలా కఠినమైన చట్టాలు చేశారు. గ్రామం బయటి వారెవ్వరూ అడవి నుంచి వనరులు సేకరించడానికి వీల్లేదని, అలాగే ఎడ్ల బండ్లతోటి అడవిలోకి వెళ్లకూడదని కూడా నిబంధన పెట్టారు.
450 హెక్టార్ల అడవిని పర్యవేక్షించడానికి ఇద్దరు వృద్ధ వాచ్‌మెన్‌లను నియమించారు. వీరికి ప్రతి కుటుంబం నుంచి ధాన్యం ఇవ్వాలని, అలాగే నెలకు కొంత జీతం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. దీనిని ఉల్లంఘించే కుటుంబాలకు జరిమానాలు విధించారు. అడవిని రక్షించే వారికి బహుమతులు ప్రకటించారు.
వనవాసి కళ్యాణ్ ఆశ్రమం మరియు 1998లో బరిపడాలో ప్రవేశపెట్టిన అటవీ శాఖ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (JFM) పథకం మద్దతుతో, గ్రామస్తులు టేకు, కోర్ఫాడ్ మరియు ఘయ్‌పాట్ వంటి జాతుల మొక్కలను నాటారు.దీంతో అక్రమంగా వనరులు తీసుకెళ్లడం ఆగిపోయింది. అక్టోబర్ 2004 నాటికి, ఆ సంఘం మొక్కల వైవిధ్య రిజిస్టర్‌ను ప్రారంభించింది, 100 చదరపు మీటర్ల క్వాడ్రంట్‌లను ఉపయోగించి 14 అటవీ ప్రదేశాలలో వృక్షసంపదను మ్యాపింగ్ కూడా చేశారు. దీంతో అటవీ విస్తీర్ణం పెరిగింది. కలప, పండ్లు, చిన్న చిన్న అటవీ ఉత్పత్తులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) , విదేశీ అధ్యయనకారులు ఇప్పుడు బరిపడన గ్రామంలోని జీవ వైవిధ్య పరిరక్షణను అధ్యయనం చేయడానికి వస్తుంటారు.
నీటి కొరతను కూడా అధిగమించిన గ్రామస్థులు…
ఈ గ్రామంలో నీటి కొరత కూడా బాగానే వుండేది. దీంతో చైత్రమ్ పవార్ నడుంబిగించారు. గ్రామస్థులందరూ శ్రమదానం ద్వారా నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు. ఇందుకోసం నీటిని నిల్వ చేయడానికి, నేల కోతను అరికట్టడానికి 480 చిన్న చిన్న చెక్ డ్యాములను నిర్మించారు. భూగర్భ జలాలను పెంచుకోవడానికి కాలువలను కూడా తవ్వారు. దీంతో పరిస్థితి మారింది. ఎంతలా అంటే పొరుగున వున్న గ్రామాలకు కూడా ఈ గ్రామమే నీటిని సరఫరా చేసేంతలా.
వ్యవసాయ, ఆర్థిక పునరుజ్జీవనం
బరిపడ వ్యవసాయం అంతా స్వదేశీ విత్తనాలు, గో ఆధారిత వ్యవసాయంపై ఆధారపడి వుంటుంది. హైబ్రిడ్ లేదా జన్యుపరంగా మార్పు చేసిన పంటలను తిరస్కరిస్తుంది. జనసేవా ఫౌండేషన్ అనే మరో స్వచ్ఛంద సంస్థ మద్దతుతో, ఈ గ్రామంలో వరి, గోధుమలు, బంగాళాదుంపలు, కూరగాయలు మరియు వాణిజ్య పంటలు పండించారు. 2003లో, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (IFAD) బరిపడ ప్రయత్నాలను గుర్తించి, బ్యాంకాక్‌లో “గ్రామీణ పేదల స్థానిక జ్ఞానం మరియు ఆవిష్కరణ” బహుమతిని ప్రదానం చేసింది.భారత ప్రభుత్వం కూడా రూ. 1,00,000 మంజూరు చేసింది, ఇది 25 మంది యువకులకు ఉపాధి కల్పించే బెల్లం తయారీ యూనిట్‌కు నిధులు సమకూర్చింది.
పవార్ నేతృత్వంలోని బారిపడ గ్రామ వికాస్ సమితి (BGVS), అధునాతన మరుగుదొడ్లను నిర్మించడం, రీసైకిల్ చేసిన నీటితో తోటలను కూడా పండించింది. అలాగే ప్రాథమిక పాఠశాలను కూడా తిరిగి తెరిచారు. వయోజనులకు అక్షరాస్యత కోసం రాత్రి పాఠశాలలను కూడా ప్రారంభించారు. హాజరవ్వని విద్యార్థులకు రూపాయి జరిమానా, ఉపాధ్యాయులకు 51 రూపాయి జరిమాన కూడా విధించారు.
బరిపడ గ్రామంలో జరిగిన ఈ పరివర్తన విశ్వవ్యాప్తమైంది. అందరూ మెచ్చుకున్నారు. చైత్రమ్ పవార్ కి కూడా అనేక అవార్డులు వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నుండి శెట్టినిష్ఠ శెట్కారి పురస్కార్, సంత్ తుకారాం ఫారెస్ట్ స్కీమ్ యొక్క మొదటి బహుమతి మరియు IFAD నుండి రెండవ బహుమతితో సహా 12 అవార్డులను అందుకున్నారు.2019లో, సంత్ ఈశ్వర్ ఫౌండేషన్ గ్రామీణాభివృద్ధికి విశిష్ట సేవా సమ్మాన్ తో ఆయనను సత్కరించింది. ఏప్రిల్ 2025లో పద్మశ్రీని కూడా అందుకున్నారు.
స్వయం సమృద్ధికి నమూనా ఈ గ్రామం
కొరత నుంచి మిగులు వుండే వరకూ ఈ గ్రామం విజయం సాధించింది. 450 హెక్టార్ల అడవిని రక్షించడం, 700 కి పైగా చెక్ డ్యామ్‌లను (బరిపడలో 480 సహా) నిర్మించడం మరియు స్థిరమైన పద్ధతులను అవలంబించడం ద్వారా, ఈ గ్రామం దాని సహజ వనరులను పునరుద్ధరించడమే కాకుండా పొరుగు గ్రామాలకు కూడా స్ఫూర్తిగా నిలుచుంది.