ఓ వైపు దత్తోపంత్ జీ.. మరో వైపు సుదర్శన్ జీ… జాగరణ్ మంచ్ కి రెండు కళ్ళలా పనిచేసిన వ్యక్తులు
కే.ఎస్. సుదర్శన్ జీ… రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదో సరసంఘ చాలక్. ఇవ్వాళ వారి పుణ్యతిథి. వీరి పూర్తి పేరు కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్. వీరి స్వస్థలం తమిళనాడులోని కుప్పహళ్లి గ్రామం. 9 వ సంవత్సరం నుంచే వీరు సంఘ శాఖకి వెళ్లేవారు. 1954 లో జబల్ పూర్‌లోని సాగర్ విశ్వ విద్యాలయం నుంచి టెలీ కమ్యూనికేషన్స్ విభాగంలో బీ.ఏ. పట్టాను పొందారు. ఇంజనీరింగ్ పట్టభద్రులు అయిన తర్వాత 23 సంవత్సరాల వయస్సులో ఆయన సంఘ ప్రచారకులుగా పూర్తి సమయం సంఘ్ కే వెచ్చించారు. మొదట రాయగఢ్‌లో బాధ్యతలు చేపట్టారు. అయితే.. వీరికి శారీరిక్ విభాగం అంటే ఎనలేని ఆసక్తి. 1969 నుంచి 1971 వరకు అఖిల భారత శారీరిక్ ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సుదర్శన్‌జీ సమయంలోనే సంఘ శాఖలో నియుద్ధ, ఆసనాలు, ఆటలను సంఘ శిక్షావర్గలో చేర్చారు.
అయితే… సుదర్శన్‌జీ కి ‘‘స్వదేశీ భావాలు’’ జాస్తి. ఆ కారణంగానే ఆయన జీవించినంత కాలం స్వదేశీ మార్గంలోనే జీవించారు. ఆయుర్వేద వైద్య విధానంపై ఎనలేని గురి. ఆయనకు వున్న ఆరోగ్య ఇబ్బంది రీత్యా ఆయనకు బైపాస్ సర్జరీయే చేయాలని వైద్యులు పట్టుబట్టారు. కానీ… సుదర్శన్‌జీ మాత్రం సొరకాయ రసం, తులసి, మిరియాలు మొదలైన వంటింటి చిట్కాల ద్వారానే తన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకున్నారు. ఆయన ఆయుర్వేద పద్ధతిని ‘‘కాదంబిని’’ పత్రిక రెండు సార్లు ప్రముఖంగా ప్రచురించి, దేశానికి పరిచయం చేసింది.
‘‘స్వదేశీ జాగరణ్ మంచ్ కి మారు పేరు సుదర్శన్‌జీ
సంఫ్‌ుకి అనుబంధంగా వుంటూ… స్వదేశీ భావాలు, వస్తువులను ప్రోత్సహించే స్వదేశీ జాగరణ్ మంచ్ అంటే సుదర్శన్‌జీకి ఎనలేని అభిమానం. చాలా సంవత్సరాల పాటు ఆయన స్వదేశీ జాగరణ్ మంచ్‌కి మార్గదర్శక్‌గా కూడా పనిచేశారు. సరసంఘ చాలక్‌గా బాధ్యతలు స్వీకరించే వరకూ సుదర్శన్‌జీ జాగరణ్ మంచ్‌ని అంటిపెట్టుకునే వున్నారు. ప్రతి జాగరణ్ మంచ్ బైఠక్‌లో వీరు తప్పనిసరిగా వుండేవారు. సుదర్శన్‌జీ లేని జాగరణ్ మంచ్ బైఠక్ లేదంటే అతిశయోక్తి కూడా కాదేమో. దేశ వ్యాప్తంగా జాగరణ్ మంచ్ విస్తరించడం, పలు క్యాంపైన్లు బలంగా జరిగాయంటే దాని వెన్నెముక సుదర్శన్‌జీయే. ఓ వైపు దత్తోపంథ్ ఠేంగ్డేజీ, మరో పక్క సుదర్శన్‌జీ. ఇద్దరూ జాగరణ్ మంచ్‌కి రెండు కళ్లలా పనిచేశారు. వీరి హయాంలోనే రెండు బలమైన దేశవ్యాప్త ఉద్యమాలు జరిగాయి. ఒకటి ‘‘మత్స్య యాత్ర’’. దేశ వ్యాప్తంగా విస్తరించి వున్న ‘‘సముద్ర తీర ప్రదేశాల’’ గుండా ఈ యాత్ర సాగింది. విదేశీ పర్యాటకులు సముద్ర చేపల వేటకు వ్యతిరేకంగా ఈ యాత్ర జరిగింది. విజయం కూడా సాధించింది. ఆ తర్వాత ‘‘నమక్ ఆందోళన్’’. (ఉప్పు నిర్బంధ అయోడైజేషన్ కి వ్యతిరేకంగా ఉద్యమం). ఈ రెండు ఉద్యమాలు వీరి హయాంలోనే ఉధృతంగా సాగాయి.
అప్పటి ప్రభుత్వాలు దేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న సమయంలో అంటే.. విదేశీ కంపెనీలకు అనుకూల నిర్ణయాలు, విదేశీయులకు ప్రయోజనాలు పొందే ఏ నిర్ణయాన్నైనా నిర్మొహమాటంగా సుదర్శన్‌జీ వ్యతిరేకించేవారు. అంతేకాకుండా భూ చట్టాలను కూడా వ్యతిరేకించేవారు. ఓ వైపు దత్తోపంత్ ఠేంగ్డేజీ, మరోవైపు సుదర్శన్‌జీ ఇద్దరూ విదేశీ శక్తులతో పోరాడారు. సుదర్శన్‌జీ సాధారణ శైలి, సమర్థవంతమైన దిశానిర్దేశం కారణంగా స్వదేశీ జాగరణ్ మంచ్ కార్యకర్తలు సహజంగానే అతని వైపు ఆకర్షితులయ్యారు. అతని అసమానమైన తెలివితేటలు మరియు ఆప్యాయతతో అందరికీ దిశానిర్దేశం చేశారు. ఈ లక్షణాలన్నీ జాగరణ్ మంచ్ సరైన పథంలో నడవడమే కాకుండా… అనేక ఉద్యమాల్లో విజయం సాధించడానికి దోహదపడిరది.
ఒకానొక సమయంలో భారత దేశ అభివృద్ధి` స్వదేశీ ధృక్కోణం’’ విషయంలో ఓ పత్రం తయారు చేయాలని స్వదేశీ జాగరణ్ మంచ్ నిర్ణయించుకుంది. ఈ డాక్యుమెంట్ తయారు చేసే బాధ్యతలను అనేక మంది కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషించారు. అనేక సమాలోచలన తర్వాత జాగరణ్ మంచ్ అఖిల భారత సమావేశాల ముందుకు వచ్చింది. సుదర్శన్‌జీకి ఈ విషయంపై పూర్తి అవగాహన వుంది కాబట్ఠి… ఈ డాక్యుమెంట్‌కి పరిపూర్ణత చేకూర్చారు.
జీవితంలోని చివరి రోజున ఆయన రాయ్ పూర్ కార్యాలయంలో ఉదయం `ఏకాత్మతా స్తోత్రం’ చదువుతున్నప్పుడు ఒక స్వయంసేవక్ అందులో ఒకచోట విసర్గను సరిగా పలకలేదు. ఆ తరువాత సుదర్శన్ జీ అతనిని అక్కడే ఉండమని చెప్పి, ఆ విసర్గతో పాటు చదవడం ఎలాగో అయిదుసార్లు ఆయన చేత అభ్యాసం చేయించారు. అలా చిన్న విషయాలపట్ల కూడా శ్రద్ధవహించడం ఎంత ముఖ్యమో చూపించారు.పెద్దల పట్ల ఎంతో గౌరవం కలిగిన సుదర్శన్ జీ, సర్ సంఘచాలక్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత భోపాల్ వెళ్లినప్పుడు అందరికంటే ముందు తనతో పనిచేసిన ప్రచారక్ ల ఇళ్లకు వెళ్ళి వారిని శాలువా, శ్రీఫలాలతో సత్కరించి గౌరవించారు.
ఎంతో విషయ పరిజ్ఞానం కలిగిన శ్రీ సుదర్శన్ జీ కి అనేక భాషలు తెలుసు. పైగా గొప్ప వక్త. అందుకనే ఆయనను `సంఘ విజ్ఞానకోశం’ (Encyclopedia of Sangh) అనేవారు. ఏ విషయమైనా ఆమూలాగ్రం తెలుసుకోవడం ఆయనకు అలవాటు. అందువల్ల ఎలాంటి సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపించగలిగేవారు. పంజాబ్ లో ఖలిస్తాన్ సమస్య, అసోమ్ లో బంగ్లా చొరబాటు వ్యతిరేక ఉద్యమాలపై తన లోతైన విశ్లేషణ, స్పష్టమైన అవగాహన ద్వారా పరిష్కారం సూచించగలిగారు.
(నేడు సుదర్శన్ జీ పుణ్య తిథి )