కుంభమేళాలో సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న రైతు
ప్రయాగ్ రాజ్ వేదికగా మహా కుంభమేళా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు. విదేశీయులు కూడా భారీ సంఖ్యలోనే వస్తున్నారు. పుణ్యం సంపాదించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. అయితే..ఓ వ్యక్తి మాత్రం పుణ్యంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రచారం చేయడానికి కుంభమేళా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. జాతీయ రైతు అవార్డు గ్రహీత ప్రదీప్ దీక్షిత్ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రమోట్ చేసే పనిలో వున్నారు. సేంద్రీయ వ్యవసాయంతో పాటు గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని ఆచరించడానికి అవగాహన కల్పిస్తున్నాడు.
యూపీకి చెందిన హర్దోయ్ దీక్షిత్ సొంత జిల్లా. ఇక్కడ 8 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. చుట్టు పక్కల వార్ని కూడా సేంద్రీయ వ్యవసాయం వైపు ప్రేరేపిస్తున్నారు. మహా కుంభమేళాకి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి, సేంద్రీయ వ్యవసాయ ప్రచారం బాగా జరుగుతుందని భావించాడు. అందుకే మహా కుంభ్ లోని సెక్టార్ 8 దగ్గర ‘‘ప్రకృతిక్ కిసాన్ పరివార్’’ అన్న బ్యానర్ పై శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించే స్టాల్ కూడా ఏర్పాటు చేశాడు.
ఇప్పటికే చాలా మంది ప్రజలు, రైతులు కూడా కుంభమేళా పుణ్య స్నానాలు చేసుకొని, తన స్టాల్ ను సందర్శించారని దీక్షిత్ చెప్పుకొచ్చాడు. ఇతరులతో కూడా ఆచరించే ప్రయత్నం చేస్తామని చెప్పిస్తున్నాడు. దీక్షిత్ పాలేకర్, ఆచార్య దేవవ్రత్ దగ్గర 2009 లో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత సేంద్రీయ వ్యవసాయం వైపు వచ్చాడు.
హర్దోయ్ లో తన పొలంలో 15 షెడ్లు ఏర్పాటు చేసి, గోవులను పెంచుతున్నాడు. ఈయనతో పాటు కుటుంబీకులు కూడా సేంద్రీయ వ్యవసాయంలోనే వున్నారు. కుటుంబం అంతా సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. కుంభమేళా వేదికగా సేంద్రీయ వ్యవసాయం ప్రచారం చేయడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. సేంద్రీయ వ్యవసాయంతో పాటు రైతులకు మార్కెటింగ్ చేసి పెడుతున్నారని ప్రశంసిస్తున్నారు.
మరోవైపు శ్రీ అన్న (చిరు ధాన్యాలను) కూడా ప్రదీప్ దీక్షిత్ విరివిగా ప్రచారం చేస్తుంటాడు. ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అలాగే తమ ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నట్లు తెలిపాడు. యూపీ ప్రభుత్వం కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, ఎకరానికి 10 వేల నుంచి 12 వేల లాభం పొందవచ్చని తెలిపాడు.