కృష్ణ భగవానుడే మొదటి రాయబారి : సుప్రీంకోర్టు
యూపీ ప్రభుత్వం, శ్రీ బాంకే బిహారీ దేవాలయ ట్రస్ట్ కి సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీకృష్ణ భగవానుడే మొదటి రాయబారి అని పేర్కొంది. మధ్యవర్తిత్వం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ఇరు పక్షాలకూ సూచించింది. ఇందుకోసం ఓ కమిటీని ప్రతిపాదించింది.
ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లతో టెంపుల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. అయితే దీన్ని టెంపుల్ ట్రస్టు సవాలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా శ్రీకృష్ణుడి రాయబారం గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘శ్రీకృష్ణుడే మొదటి రాయబారి. దయచేసి మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి, టెంపుల్ ట్రస్టుకు మధ్య సమస్య పరిష్కారానికి కమిటీని ప్రతిపాదించింది.