‘‘కేదార్ నాథ్‌లోకి హైందవేతరులను రానివ్వొద్దు’’
అత్యంత పవిత్రమైన కేదారనాథ్ పుణ్య క్షేత్రంలో హైందవేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని స్థానిక ప్రజల నుంచి తీవ్రంగా డిమాండ్లు వస్తున్నాయి. తమపై కూడా తీవ్రమైన ఒత్తిడి వుందని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌతియాల్ అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కేదార్ నాథ్ యాత్ర నిర్వహణా సమావేశం జరిగిందని, ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావన వచ్చిందని, కొందరు లేవనెత్తారని వెల్లడించారు.
కేదార్ నాథ్ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు వ్యక్తులు పనులు చేస్తున్నారని, అలాంటి వారిని నిషేధించాలని డిమాండ్ చేశారని, వారు హిందువులు కారని, కానీ.. అక్కడికి వచ్చి ధామ్ ను అపవిత్రం చేస్తూ, కించపరిచే కార్యకలాపాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా ఈ అంశంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని, అలాంటి వారికి ప్రవేశం వుండొద్దని అన్నారు.
ఈ డిమాండ్ ను కచ్చితంగా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం వుందని స్థానిక ఎమ్మెల్యే నౌతియాల్ అన్నారు. సమస్యను లేవనెత్తారంటే కచ్చితంగా అందులో ఏదో వుండే వుంటుందన్నారు. యాత్రా సీజన్ లో గుర్రాలు, గాడిదల వ్యాపారం, పూలు, పండ్ల వ్యాపారం, కూరగాయల అమ్మకం కూడా జరుగుతుందని, ఈ సమయంలో హైందేవతరులు ఈ క్షేత్రానికి రావడం వల్ల పవిత్రతకు భంగం వాటిల్లుతుందన్నారు.