కొత్త రాగాలతో సంఘ గీతాలను ఆలపించనున్న శంకర్ మహదేవన్

ప్రఖ్యాత గాయకుడు పద్మశ్రీ గ్రహీత శంకర్ మహదేవన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాటలను కొత్త రాగాలు, లయలతో ప్రదర్శించనున్నారు. సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఇది స్వయంసేవకులకు ఆయన నుండి ఒక ప్రత్యేకమైన బహుమతే అని చెప్పొచ్చు. ఢిల్లీలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో (తాన్‌సోన్ కా తానా బానా) కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు.
తాన్‌సేన్ జీవితం ఆధారంగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, జీవితంలో సంగీతానికి అసాధారణమైన ప్రాముఖ్యత ఉందని అన్నారు. సంఘ్‌తో తన అనుబంధంలో, అనేక భావోద్వేగ దేశభక్తి గీతాల ద్వారా తాను ప్రేరణ పొందానని అన్నారు. గురూజీగా అందరూ ప్రేమతో పిలుచుకునే సంఘ్ రెండవ సర్‌సంఘచాలక్ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ మరణానంతరం జరిగిన మాసిక శ్రద్ధాంజలి సమయంలో సంఘ పాటలు పాడినప్పుడు, ఆడిటోరియంలో కళ్ళు కన్నీళ్లు పెట్టుకోని వారు ఎవరూ లేరు అని వారు చెప్పారు.
డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గురూజీ నుండి ఇప్పటివరకు సంఘ్ స్వయం సేవకుల కోసం దేశభక్తి గీతాలను ఎవరు రాశారనేది అన్వేషించాల్సిన చరిత్ర. ప్రఖ్యాత సంగీతకారుడు శంకర్ మహదేవన్ కొత్త తరానికి కొత్త రాగాలు, లయలతో ఇలాంటి అనేక పాటలను అందించాలని అభ్యర్థిస్తే, దానిని ఆయన సంతోషంగా అంగీకరించారని గడ్కరీ ఈ సందర్భంగా చెప్పారు. సంఘ 100వ సంవత్సరంలో, స్వయం సేవకులు కొత్త సంగీతంతో అదే స్ఫూర్తిదాయకమైన పాటలను వినబోతున్నారన్నారు.
నాగ్‌పూర్‌లో రెండేళ్ళ కిందట 24 అక్టోబర్ 2023న జరిగిన విజయదశమి ఉత్సవానికి శంకర్ మహదేవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘భారతదేశంలో ఏ సంఘటన జరిగినా, ఏ సమస్య వచ్చినా, అవసరం వచ్చినప్పుడల్లా స్వయంసేవకులు దేశం కోసం నిశ్శబ్దంగా పనిచేస్తారు. మన దేశం ఒక ‘పాట’ అని మనం అంటే, స్వయంసేవకులు దాని వెనుక ఉన్న సంగీతం. వారు పాటకు ప్రాణం పోస్తారు’ అని ప్రశంసించారు. దేశాన్ని ఒక గీతం అని పేర్కొంటూ, స్వయంసేవకులను దానికి సంగీతం అని చెప్పిన శంకర్ మహదేవన్, సంఘ్ పాటలను స్వయం సేవకుల హృదయాల్లో ప్రతిధ్వనించే కొత్త బాణీలో ప్రదర్శించబోతున్నారు.
సంఘ శాఖలు, ఇతర కార్యక్రమాలలో వయక్తిక గీత్‌లకు, సామూహిక్ గీత్‌లకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సంఘలో పాటల కూర్పు, గేయ రచయితల గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా అనేక సంఘ పాటలను రచించారు, వాటిలో ‘కదం మిలాకర్ చల్నా హోగా’ , ‘హిందూ తన్ మన్ హిందూ జీవన్, రాగ్ రాగ్ హిందూ మేరా పరిచయ్’ వంటి పాటలు ప్రజల మన్నలను అందుకున్నాయి. ప్రసిద్ధ మరాఠీ గాయకుడు సుధీర్ ఫడ్కే కూడా సంఘ కోసం అనేక పాటలను రచించి పాడారు. మీరు కనుక సంఘ పాటల పుస్తకాలను పరిశీలిస్తే, వాటిలో వందలాది పాటలు కనిపిస్తాయి, ఇవి దేశం కోసం జీవించడానికి , సమాజం కోసం ఏదైనా చేయడానికి ప్రేరణనిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *