కోళ్లలో వైరస్… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
కోళ్లలో వేగంగా వ్యాప్తి అవుతున్న వైరస్ పట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించింది. దీంతో జిల్లా కలెక్టర్లు అందరూ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో వైరస్ సోకిన కోళ్లను మాత్రం దూరంగా పూడ్చి పెట్టాలని కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వైరస్ సోకిన కోళ్ల తరలింపు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా బర్డ్ ఫ్లూ ఇబ్బందులు పెడుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అందర్నీ అలర్ట్ చేసింది. అయితే కామారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రబల కుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పౌల్ట్రీల్లోకి వెళ్లి, కోళ్లను వెటర్నరీ వైద్యులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. డిసెంబర్ ఫిబ్రవరి మధ్య కాలంలో కోళ్లలో మరణాలు సహజంగానే వుంటాయి. అయితే.. ఈ యేడాది మాత్రం వీటి మరణాలు పెరిగాయి. పూర్తిగా బర్డ్ ఫ్లూయే కారణమా? మరేమైనా కారణాలు వున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో నాటు, బ్రాయిలర్ కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. మొదట ఒక కోడికే వైరస్ సోకిందని గుర్తించారు. సాయంత్రానికి వీటి సంఖ్య పెరిగిపోయింది. సత్తుపల్లి నియోజకవర్గంలో రెండు, మూడు నెలల్లోనే లక్షకు పైగా కోళ్లు వైరస్ తో చనిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని ల్యాబ్ టెస్ట్‌లలో నిర్ధారణయింది. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా H5N1 అని భోపాల్‌లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తేల్చింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లో గత వారం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. కాకినాడ, ఏలూరు పశుసంవర్ధకశాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి రక్తనమూనాలు తీసి భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపారు. తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్5ఎన్1 పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్ధారణ అయింది.