క్రిమిసంహారక మందులతో రైతుల ఆరోగ్యాల బుగ్గిపాలు… అల్జిమర్స్, కేన్సర్ లాంటి వ్యాధులు
రైతన్న ఆరోగ్యం పాడవుతోంది. తాను గరళాన్ని మింగుతూ… ప్రజలందరికీ అన్నం పెడుతున్నాడు. రోజు రోజుకీ వ్యవసాయ క్షేత్రంలో క్రిమి సంహారక మందుల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో రైతన్నల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రభావాన్నే చూపుతోందని ఓ అధ్యయనంలో తేలింది. పెస్టిసైడ్స్ విపరీతంగా వాడుతుండటం వల్ల ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు, అల్జిమర్స్, కేన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిపోతున్నాడు. ఈ విషయాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయ బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తలు తేల్చారు. రైతుల రక్తం, మూత్ర నాలాల్లో పదుల సంఖ్యలో వ్యాధులు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయని తేలింది. ‘‘Biomonitaring of pesticide exposer and its health implications in agricultureal areas of Telangana, india, a brief data report” పేరిట ఈ అధ్యయనం జరిగింది.
శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా తెలంగాణలోని వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 493 మంది రైతుల రక్తం, మూత్ర శాంపిళ్లను సేకరించారు. తర్వాత పరీక్షించారు. వీరిల పురుగు మందుల ప్రభావానికి లోనైన సమూహానికి చెందిన 341 మంది రైతులు, పురుగుల మందుల ప్రభావానికి లోనుకాని సమూహంలోని 152 మంది రైతులు వున్నారు. ఈ అధ్యయనం 2021 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకూ కొనసాగింది. ఒక్కో జిల్లాలో ఐదేసి గ్రామాల చొప్పున ఎంపిక చేశారు. గతంలో కనీసం యేడాది పాటు పెస్టిసైడ్స్ పిచికారీ చేసిన వరి, పత్తి, ఇతర పంటలు పండించే రైతుల శాంపిళ్లను మాత్రమే తీసుకున్నారు. ఈ అధ్యయనంలో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సున్న రైతులున్నారు.
ఈ రైతుల రక్త నమూనాలో అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన 11 రకాల పెస్టిసైడ్స్ తో పాటు 28 రకాల పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. ప్రాణాంతకమైన కౌమఫాస్, ఫెనామీ ఫాస్, డిక్లోర్వోస్, మెతామిడోఫాస్, మోనోక్రోటోఫాస్, ట్రయజోఫాస్ వున్నాయి.పురుగుల మందులు వాడని రైతులతో పోలిస్తే.. వాడే రైతుల రక్త నమూనాలోనే ఎక్కువ అవశేషాలు కనిపించాయి. అయితే.. ఇలా చేయడం వల్ల తమకు ఊపిరి సరిగ్గా ఆడదని, ఛాతీలో నొప్పి, వాంతులు కావడం జరుగుతుందని తెలిపారు. అలాగే కళ్లల్లో దురద, కోపం, కళ్లు మసకబారినట్లు అవ్వడం జరుగుతుందని కూడా తెలిపారు.