క్రైస్తవ మిషనరీల భూ మాఫియాకి వ్యతిరేకంగా హిందూ మహిళల రిలే నిరాహార దీక్షలు
క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా కాకినాడలోని కురాడ గ్రామంలో హిందువులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. క్రైస్తవ మిషనరీలు అక్రమంగా భూములను ఆక్రమిస్తూ, చర్చిలు నిర్మిస్తున్నారని హిందువులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ రిలే నిరాహార దీక్షలకు హిందూ మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయంటూ మండిపడుతున్నారు. కురాడ గ్రామంలో జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలకు మహిళలు భారీ సంఖ్యలోనే తరలివస్తున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఇలాగే జరిగిందని, ఫిర్యాదులు భారీగా రావడంతో భూముల ఆక్రమణ, అక్రమ చర్చిల నిర్మాణం ఆగిపోయిందని అంటున్నారు. కానీ… ఈ ప్రభుత్వ హయాంలో మళ్లీ పెరిగిపోయాయని నిరసనకారులు పేర్కొంటున్నారు.తాము అనేక సార్లు మిషనరీలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడుతున్నారు.
‘‘హిందూ భూమిపై, మతంపై బహిరంగంగా జరుగుతున్న దాడి ఇది’’ అని నిరసన దీక్షలో పాల్గొన్న మహిళ మండిపడ్డారు. తాము క్రైస్తవ మిషనరీలపై చర్యలు తీసుకోవాలని పదే పదే ఫిర్యాదులు చేస్తున్నామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే రిలే నిరాహార దీక్షలకు దిగినట్లు ప్రకటించారు. తమకు వేరే మార్గం లేదని, తాము ఇంత నిరసనలు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని, చట్టాలను తుంగలో తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసే పోరాటానికి యావత్ హిందూ సమాజం అండగా నిలబడాలని వారు కోరారు. హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా కలసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందువులు మౌనంగా వుంటే దేవాలయాల భూములు, దేవాలయాలు ఆక్రమణలకు గురవుతూనే వుంటాయని అన్నారు.