‘‘గాల్వాన్ వార్ మెమోరియల్’’ ఆవిష్కరణ

ఈ యుద్ధ స్మారకాన్ని ఎరుపు – నలుపు రంగు గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. త్యాగం, వీరత్వానికి చిహ్నంగా ఇది నిలుస్తుంది. దీంతో పాటు మన అమరవీరులకు గుర్తుగా కాంస్యంతో చేసిన 20 బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే ఈ యుద్ధ స్మారకం కాంప్లెక్సులో మ్యూజియం, గల్వాన్ ఘటనను తెలిపే డిజిటల్ గ్యాలరీ, లద్దాఖ్ సైనిక చరిత్రను తర్వాతి తరాలకు అందించేలా ఏర్పాటు చేశారు.
2020 జూన్ 15 వ తేదీన రాత్రి భారత్ చైనా దళాల మధ్య గల్వాన్ లో భీకర ఘర్షణ జరిగింది. నిరాయుధులైన భారత జవాన్లపై చైనా సైనికులు సాయుధ దాడికి దిగారు. అయినా సరే భారత జవాన్లు వెన్ను చూపలేదు. ప్రాణాలకు ఎదురొడ్డి నిలిచారు. ఈ వీరోచిత పోరాటంలో భారత సైనికులు కూడా అమరులయ్యారు. గల్వాన్ లోని భారత భూభాగంలో ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించేందుకు బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి, తెలంగాణకి చెందిన కల్నల్ సంతోష్ బాబు జవాన్లతో కలిసి వెళ్లారు. చైనా తన శిబిరాలను తొలగించకపోవడంతో సంతోష్ బృందం వాటిని నేలమట్టం చేసింది. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది జవాన్లు అమరులయ్యారు.