గోఆధారిత వ్యవసాయమే మేలు… ఆదర్శ రైతులకు పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో వక్తలు
గోఆధారిత వ్యవసాయం ఎంతో మేలని రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని స్థానిక రాధాకృష్ణ కల్యాణ మండపంలో గోఆధారిత వ్యవసాయంపై అవగాహన సదస్సు, అనంతరం వ్యవసాయ రంగంలో వినూత్న రీతిలో పంట ఉత్పత్తులను సాగిస్తున్న 108 మంది ఆదర్శ రైతులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.
ఆరోగ్యం కావాలంటే ఇది చేయాలి..
మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ భూమి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తిని మనమంతా ఆరోగ్యంగా ఉంటామన్నారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రసాయన రహిత వ్యవసాయం చేయాలన్నారు. దక్షిణ రాష్ట్రాల సేంద్రియ వ్యవసాయ నిపుణులు టి. నాగరాజు మాట్లాడుతూ ఆవు పేడ, మూత్రం తప్ప భూమికి లాభం చేకూర్చేవి ఏమీ లేవన్నారు. ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, కషాయాలు తయారు చేసుకుని ఆరోగ్యకర వ్యవసాయం చేసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ జగ్గయ్యపేట ఏడీఏ సి.భవానీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి బాలాజీ, రైతునేస్తం యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు సేంద్రియ, గోఆధారిత ఉత్పత్తులపై స్టాల్స్ ఏర్పాటు చేశారు.
సదస్సులో పాల్గొన్న వారి అభిప్రాయాలు వారి మాటల్లో..
భూమిని కాపాడుకోవాలి..
భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సక్రమంగా వర్షాలు పడా లంటే ఆవు పిడకలు, ఆవు నెయ్యి, అమృత మూలికలు అగ్నిహోత్రం, హోమ గుండంలో వేయాలి. సైన్స్ పరంగా కూడా ఇది మంచిది. తప్పనిసరిగా రసాయనాలు లేని పంటలు పండించాలి.– రమణారెడ్డి, గోఆధారిత ఉత్పత్తుల రైతు, కడప
ఆరేళ్లుగా గోఆధారిత వ్యవసాయం..
గత ఆరేళ్లుగా సేంద్రియ సాగుగా వేరుశనగ మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నాం. నేను దివ్యాంగుడిని అయినా నా తల్లిదండ్రుల సాయంతో పంటలు పండిస్తున్నా. గోఆధారిత ఉత్పత్తులు తినటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.– వెంకటేష్, దివ్యాంగ రైతు, నరసింగనాయనిపల్లె, శ్రీసత్యసాయి జిల్లా