గ్రామంలో ‘‘స్టీల్ బ్యాంక్’’ ఏర్పాటు చేసుకున్న ప్రజలు.. పర్యావరణ పరిరక్షణలో ఆదర్శం
సోషల్ మీడియాను తెగ తిడుతుంటాం. అందర్నీ పాడు చేస్తోందని. కానీ కోవిడ్ లాంటి సమయాల్లో, లేదా క్లిష్టమైన సమయాల్లో సోషల్ మీడియానే ప్రముఖ పాత్ర పోషించింది. అంతేకాకుండా చాలా మంచి మంచి విషయాలను కూడా సోషల్ మీడియా సమాజం ముందుకు తెస్తుంది. దీంతో సమాజానికి చాలా మేలు చేకూరుతుంది. తాజాగా ఇలాంటి ఓ వార్తే సోషల్ మీడియాలో వచ్చింది. దీంతో ఊరు ఊరంతా మారిపోయింది. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది ఆ గ్రామం. గ్రామంలో ఇంతటి మార్పుకు కారణమైంది మన సోషల్ మీడియానే. ఇదంతా జరిగింది బాసర సమీపంలోని గుండంపల్లి గ్రామం.
ఈ రోజుల్లో ప్రతిదీ ప్లాస్టిక్ అయ్యింది. దీంతో కాన్సర్ కి కారణం అవుతోంది. ఏ ఫంక్షన్ జరిగినా, చిన్న కార్యక్రమం జరిగినా.. ప్రయాస పడకూడదని ప్లాస్టిక్ విస్తళ్లు, ప్లాస్టిక్ గ్లాసులను ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. వాడేస్తున్నారు, పాడేస్తున్నారు. దీంతో మనుషులకు కేన్సర్ లాంటి రోగాలు రావడంతో పాటు వాటిని తిన్న పశువులు కూడా తీవ్ర అనారోగ్యానికి బలి అవుతున్నాయి.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న గుండంపల్లి గ్రామస్థులు అలర్ట్ అయ్యారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ‘‘స్టీల్ బ్యాంకు’’ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో జరిగే ప్రతి శుభకార్యంలోనూ వీటినే ఉపయోగిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ వాడకం తగ్గింది. పర్యావరణ పరిరక్షణలో ఇదో కీలక అడుగుగా భావిస్తున్నారు. శుభ కార్యాల్లో ఇందులోనే తిని, వాటిని ప్రజలే శుభ్రం చేసి, తిరిగి ఇచ్చేస్తున్నారు.
అలాగే అనుమతి లేకుండా తమ గ్రామంలో విక్రయిస్తున్న ఐస్ క్రీమ్ లపై కూడా అలర్ట్ అయ్యారు గ్రామస్థులు. వాటిని తమ గ్రామంలోకి అనుమతించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సరిహద్దుల్లోనే ఇలాంటి వాటిని అడ్డుకుంటున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను వాడొద్దని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
గుండంపల్లి గ్రామస్థులందరూ ఐకమత్యంతో స్టీల్ ప్లేట్ల వాడకం, పర్యావరణాన్ని కాపాడలన్న నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రానికి దిక్సూచిగా మారారు. వీరు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఏ ప్రభుత్వ అధికారులు చెప్పకపోయినా, స్వచ్ఛందంగా, ప్రకృతిపై వున్న మమకారంతో, తమ ఆరోగ్యం విషయంలో తీసుకునే శ్రద్ధ కారణంగా, అవగాహన కారణంగా ఈ విజయం వరించింది. అలాగే ప్రతి ఇంటి నుంచి కూడా సహకారం లభించడంతో విజయం సాధించారు.ప్రజల్లో చైతన్యం పెరిగితే మార్పు దానంతట అదే వస్తుందని మరోసారి నిరూపితమైంది.
పంచపరివర్తనను ప్రతిపాదించిన ఆరెస్సెస్..
ఆరెస్సెస్ కార్య శతాబ్ది సందర్భంగా ‘‘పంచ పరివర్తన్’’ (పర్యావర పరిరక్షణ, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, పౌర విధులు) ను సంఘ్ సమాజం ముందు ప్రతిపాదించింది. అందులో పర్యావరణ పరిరక్షణ కూడా వుంది.అంటే మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధం వుంది. కార్య శతాబ్ది సందర్భంగా సంఘ్ ‘‘జనజాగరణ కార్యక్రమం’’ నిర్వహించింది. అంటే ప్రతి ఇంటికీ వెళ్లి, సంఘ్ ను పరిచయం చేసి, పంచపరివర్తన్ గురించి వివరించారు. దీంతో పర్యావరణం విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగింది.
కొన్ని ప్రాంతాలలో ఆరెస్సెస్ స్వయంసేవకులు చొరవ తీసుకుంటూ, ప్లాస్టిక్ ను నిషేధించేలా గ్రామాల్లో, బస్తీల్లో అవగాహన కూడా కల్పించారు. దీంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, తమ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవడానికి ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులనే వినియోగిస్తున్నారు.