గ్రామాల్లో ‘‘చిరు ధాన్యాల బ్యాంక్’’ తో మార్పు తీసుకొస్తున్న గిరిజన మహిళ లహరి బాయి

అత్యంత సాధారణమైన జీవిత నేపథ్యం. పైగా గిరిజన ప్రాబల్యం బాగా వున్న జిల్లా. అంతటి మారు మూల ప్రాంతంలో వుండే బైగా గిరిజన మహిళ లహరి బాయి.. ఇప్పుడు దేశంలోనే గుర్తింపు పొందింది. మధ్య ప్రదేశ్ లోని దిండోరి జిల్లాలో వుండే ఈమె.. చిరు ధాన్యాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగింది. కేంద్ర ప్రభుత్వం భారత దేశాన్ని శ్రీ అన్న (మిల్లెట్స్) సాగు, పరిశోధనలకు ప్రపంచానికి కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తున్న సమయంలో లహరి బాయి కృషి బయటికి వచ్చింది.

మధ్య ప్రదేశ్ లో స్థిరపడిన బైగా తెగకి సంబంధించిన వారు వ్యవసాయమే ప్రధాన జీవంగా వుంటారు. సంప్రదాయంగా వస్తున్న దున్నడాన్ని వారు వ్యతిరేకిస్తారు. ఇలా చేయడం భూమికి హానికరమని వారి భావన. దీనికి బదులుగా ‘‘బేవా’’ అనే సాగు పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. ఈ పద్ధతిని ఉపయోగించే వారు మిల్లెట్లు, మొక్క జొన్న, చిక్కుళ్లు వంటి పంటలను పండిస్తారు.

కనుమరుగవుతున్న ధాన్యాలైన మినుములు, ఇతరత్రా మిల్లెట్ల గురించి లహరి బాయి తన అమ్మమ్మ దగ్గరి నుంచి నేర్చుకుంది. పూర్తిగా జీర్ణం చేసుకున్న తర్వాత తన జీవితాన్ని మిల్లెట్ విత్తనాల సంరక్షణానికే అని నిర్ధారించుకుంది. దీంతో లహరి బాయి 18 సంవత్సరాల వయస్సు నుంచే విత్తనాలను సేకరించడం ప్రారంభించింది. ఇప్పటికీ ఆమె సమీప గ్రామాల్లో తిరుగుతూ, అడవుల నుంచి, పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే వుంది.

‘‘కనుమరుగవుతున్న విత్తనాలను సేకరించడం నాకు సంతోషమే. ప్రజలు నన్ను ఎగతాళి చేస్తారు. విత్తనాల సేకరణ ఎందుకు అని నిలదీస్తారు కూడా. అందుకే కొన్ని సార్లు విత్తనాల సేకరణకు ఎవ్వరూ లేని సమయంలో వెళ్తాను. అయితే వృద్ధులు మాత్రం విత్తనాల సేకరణకు నాకు బాగా సహకరిస్తుంటారు. మిల్లెట్ల ఆహారం అత్యంత పోషకాలతో కూడుకున్నది. దీనిని క్రమం తప్పకుండా తింటే అనారోగ్యం దరి చేరదు. అలాగే ఔషధాల ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చింది.

మిల్లెట్ అనేది పోషకాలు నిల్వ వుండే ఆహారం. ఇందులో ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా విటమిన్లు వుంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా హృదయ సంబంధిత, మధుమేహ రోగాలను నివారించవచ్చు. అలాగే బరువు కూడా తగ్గొచ్చు. ఎప్పుడూ పాఠశాలకు కూడా వెళ్లని ఈ లహరి బాయి.. ఇలాంటి విత్తనాల సంరక్షణ విషయంలో, వీటి వల్ల కలిగే లాభాల విషయంలో అందరికీ పాఠాలు చెప్పడం విశేషం. చదువుకున్న వారి కంటే ముందు గానే ఈ మిల్లెట్ల గురించి బాగా అర్థం చేసుకుంది లహరి బాయి.

గత దశాబ్ద కాలంగా ఆమె కోడో, కుట్కి, సికియా, సల్హార్, సావా, చెనా వంటి 150 కి పైగా అరుదైన చిరు ధాన్యాలను సేకరించింది. “ఈ స్థానిక విత్తనాలు అంతరించిపోతున్నాయి. నేను వాటిని తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలనుకుంటున్నాను” అని ఆమె చెప్పింది. అలాగే కేవలం ఆమె సేకరించడమే కాకుండా ఈ మిల్లెట్ విత్తనాలను సాగు కోసం రైతులకు కూడా పంపిణీ చేస్తుంది. దీనికి ప్రతిగా వారు పంట కోసిన తర్వాత దానిలో కొంత భాగాన్ని ఆమెకు బహుమానంగా కూడా ఇస్తుంటారు. ఉదాహరణకు, ఆమె అందించే కిలోగ్రాము విత్తనాలకు, రైతులు ఆమెకు అదే రకానికి చెందిన 1.5 కిలోల విత్తనాలను తిరిగి బహుమతిగా ఇస్తారు. డబ్బు సంపాదించడానికి కాదు, మరిన్ని విత్తనాలను సేకరించడానికి తాను ఇలా చేస్తున్నానని ఆమె పేర్కొంది.లహరి ఈ విత్తనాలను ఉపయోగించి కోడో మరియు కుట్కి విత్తనాల నుండి పెజ్ (ఒక రకమైన పానీయం) తయారు చేస్తుంది. ఆమె దానిని టకోడే కీ భాజీ (అటవీ కూరగాయ) తో కలిపి తాగుతుంది.

ఇక.. లహరి బాయి తన విత్తన బ్యాంకులో వివిధ రకాల విత్తనాల పేర్లను కూడా రాసి, అనేక పెద్ద పెద్ద మట్టి పాత్రల్లో వాటిని వుంచుతుంది. అలంకరణ వస్తువులుగా, చూడగానే ఆకర్షించే విధంగా వివిధ రకాల చిరు ధాన్యాల విత్తనాలు వారింట్లో వేలాడుతూ వుంటాయి.ఈ విత్తనాలను అడిగిన వారికి ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇదే కాకుండా లహరి బాయి స్వయంగా వ్యవసాయం కూడా చేస్తుంది. జీవనోపాధి కోసం అటవీ ఉత్పత్తులు, కట్టెలు అమ్ముతుంది. నెలకు 3,000 సంపాదిస్తుంది.

మరోవైపు లహరి బాయి చేస్తున్న కృషికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఆమె ప్రాంతంలో విశేష ప్రాచుర్యం లభించింది. “నేను గ్రామీణ ప్రాంతాలకు నా సాధారణ పర్యటనలలో ఒకదానిలో ఉన్నప్పుడు ఒక ఉదయం ఆమెను కలిశాను. చిరుధాన్యాల విత్తనాలను సంరక్షించడం పట్ల ఆమె అంకితభావం నన్ను ఆకట్టుకుంది. రెండు నెలల క్రితం డిసెంబర్‌లో, భారత ప్రభుత్వం ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’ చొరవకు నాయకత్వం వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నప్పుడు, మేము లహరి బాయిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాము,” అని జిల్లా కలెక్టర్ ప్రకటించారు కూడా.

గణతంత్ర దినోత్సవ కవాతుకు ఆమెను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. లహరి వేదికలు ఎక్కడం ఇదే ప్రథమం. ఇంత గుర్తింపు పొందడం ఆనందంగా వుందని, ఒకప్పుడు ఎగతాళి చేసిన వారే ఇప్పుడు తనను చూసి అసూయపడుతున్నారని తెలిపింది.గణతంత్ర దినోత్సవం తర్వాత, లహరి రాష్ట్ర రాజధాని భోపాల్ మరియు దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి 100 మందికి పైగా జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అలాగే G20 ప్రతినిధులతో కూడా సంభాషించే అవకాశం ఆమెకు లభించింది. ఈమె చేస్తున్న కృషికి గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ‘‘ప్లాంట్ జీనోమ్ ప్యాట్రన్ కసాన్ సమ్మాన్’’ అనే బిరుదుతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *