ఘనంగా భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగర్ సమీపంలో ఉన్న అన్నోజిగూడలో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రం ఆడిటోరియంలో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి కిసాన్ సంఘ్ అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రథమ సమావేశంలో అఖిల భారత అధ్యక్షుడు కె.సాయి రెడ్డి స్వాగత ప్రసంగం చేశారు. అనంతరం అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రకటించారు. దేశవ్యాప్తంగా కిసాన్ సంఘ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఉద్యమాలను ప్రతినిధి సభకు వివరించారు.

మూడు రోజుల పాటు కొనసాగిన ఈ అఖిల భారత ప్రతినిధి సభలో వ్యవసాయ రంగం, రైతు సంబంధమైన పలు కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. ముఖ్యంగా — సాధారణ బడ్జెట్, విత్తన బిల్లు, పంట భీమా, సేంద్రీయ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయ విధానాలు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు, కిసాన్ సమ్మాన్ నిధి పెంపు, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం, భూసేకరణ, దిగుమతి–ఎగుమతి విధానాలు, జీఎం విత్తనాలు,ఇతర సంస్థాగత, నిర్మాణాత్మక అంశాలు చర్చకు వచ్చాయి.

సమావేశాలలో భాగంగా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా సమర్పించిన నివేదికలో దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు భారతీయ కిసాన్ సంఘ్ బలమైన విస్తరణ స్పష్టంగా ప్రతిబింబించింది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన శిక్షణా శిబిరాలు, అధికారిక పర్యటనలు, రైతు ఉద్యమాల ద్వారా సంఘం అట్టడుగు స్థాయిలో బలపడినట్లు నివేదికలో వివరించారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత ఉపాధ్యక్షులు రాంభరోస్ బసోటియా, సుశీల విష్ణోయ్, పెరుమాళ్,విశాల్ చంద్రకర్ వేదికపై పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత సంపర్క్ ప్రముఖ్ రాంలాల్, రాష్ట్ర ప్రచారక్ శ్రీధర్, అఖిల భారత సంస్థ మంత్రి దినేష్ కులకర్ణి, సహ సంస్థ మంత్రి గజేంద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు.

సమావేశాల తొలి రోజున అఖిల భారత అధికారుల సమక్షంలో భారతమాత, భగవాన్ బలరాముడి చిత్రాల వద్ద దీపప్రజ్వలన చేసి ప్రతినిధి సభను అధికారికంగా ప్రారంభించారు. అంతకుముందు దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రాంత వివిధ రాష్ట్రాల కిసాన్ సంఘ్ నాయకుల సమక్షంలో ప్రాంగణంలో ధ్వజారోహణ నిర్వహించి గోపూజ కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *