చదువుల తల్లి ఒడిలో ప్రపంచ రికార్డు
దేశ వ్యాప్తంగా విద్యారంగంలో విస్తారమైన సేవలు అందిస్తున్న విద్యాభారతి (మన తెలంగాణ లో శ్రీ సరస్వతీ విద్యాపీఠం) ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద విద్యాసంస్థగా ఇప్పటికే వినుతి కెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాఠశాలలు కలిగిన విద్యా వ్యవస్థగా ఇప్పటికే ప్రపంచ రికార్డు కలిగి ఉన్నది. ఈ విద్యాభారతి పూర్వ విద్యార్థి పరిషత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పూర్వ విద్యార్థి వ్యవస్థగా ప్రపంచ రికార్డు నెలకొల్పినది. దేశవ్యాప్తంగా 3.56 లక్షల పూర్వవిద్యార్థులు ఆన్ లైన్లో తమ వివరాలు నమోదు చేసుకొని, ఈ విద్యాభారతి పాఠశాలల్లో తాము చదువుకొని భారత పౌరులుగా వికాసం చెందినట్లు స్పష్టం చేశారు. ఇంత భారీ సంఖ్యలో పూర్వ విద్యార్థుల సంఘటన ప్రపంచంలోనే ఏ విద్యా సంస్థకు లేదని నిర్ధారణ అయినది. ఇటీవల జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్వ విద్యార్థి పరిషత్ వ్యవస్థ కార్యకలాపాలను కొనియాడిన సంగతి మీకు తెలిసినదే.
1952లో విద్యాభారతి ప్రస్థానం ప్రారంభం అయినది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం తీసుకోకుండా, పూర్తి స్థాయిలో భారతీయ విలువలను ప్రబోధిస్తూ, విద్యాభారతి దేశవ్యాప్తంగా 12, 830 పాఠశాలలను నిర్వహిస్తున్నది. ఇందులో లక్షన్నర మందికి పైగా ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. 34 లక్షల 47 వేల 856 మంది పిల్లలకు చదువు చెబుతున్న చదువుల తల్లి ఈ విద్యాభారతి. అంతే కాదు, మారుమూల గిరిజన ప్రాంతాలు, మురికివాడలలో ఉచితంగా చదువు అందించే 11,353 విద్యాకేంద్రాలు నిర్వహిస్తోంది.
పాఠశాలల్లో తాము నేర్చుకొన్న విలువలతో కూడిన విద్యను… ఆయా రంగాలలో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు అనువర్తింప చేస్తున్నారు. అంతే గాకుండా.. ఆపన్నులకు వివిధ మార్గాలలో సేవలు అందించటం జరుగుతోంది. కరోనా మహమ్మారి విరుచుకు పడిన వేళ, లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున మాస్క్ లు, శానిటైజర్ లు, మందులు, ఫుడ్ ప్యాకెట్లను అందించటం జరిగింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ప్రభుత్వ విభాగాలు, వైద్య రంగం, న్యాయ రంగం.. ఇలా అనేక రంగాలలో ప్రగతి దిశగా పూర్వ విద్యార్థులు అడుగులు వేస్తున్నారు.
– రమా విశ్వనాథ్,
ప్రాంత ప్రచార ప్రముఖ్, సరస్వతి విద్యా పీఠం