చరిత్ర నుంచి పాఠం నేర్చుకొని, బలమైన భారత్ ను నిర్మించాలి : దోవల్
దేశాన్ని పునర్నిర్మించడానికి చరిత్ర నుంచి బలాన్ని పొందాలని, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని శక్తిమంతమైన భారత్ ను నిర్మించాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచించారు. భారతదేశ స్వాతంత్య్రం ఎన్నో త్యాగాల ఫలితమని, వాటి వెనుక ఉన్న బాధ, అవమానం, జరిగిన నష్టాలను యువత ఎప్పటికీ మరిచిపోవద్దని హితవు పలికారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ‘‘వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్’’ అనే కార్యక్రమంలో అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని పునర్నిర్మించడానికి చరిత్ర నుండి బలాన్ని పొందాలని , దాని విలువలు, హక్కులు, నమ్మకాల ఆధారంగా బలమైన గొప్ప భారత్ ను నిర్మించడానికి కృషి చేయాలని సూచించారు. స్వాతంత్రం కోసం మన పూర్వీకులు విశేషంగా కృషి చేశారని, ఇప్పుడు కనిపిస్తున్నంత స్వేచ్ఛ అప్పట్లో లేదని, మన పూర్వీకులు స్వాతంత్రం కోసం గొప్ప త్యాగాలు చేశారని, ఎన్నో అవమానాలను కూడా భరించారన్నారు. అంతేకాకుండా చాలా మంది ఉరిశిక్షకు కూడా భయపడకుండా పోరాటాలు చేశారని, అనేక మంది గ్రామాలను కూడా ఆంగ్లేయులు తగలబెట్టారని, నాగరికతను నాశనం చేశారని గుర్తు చేశారు.
అలాగే శ్రద్ధా కేంద్రాలైన దేవాలయాలను దోచుకున్నారని, అయినా సరే.. అప్పట్లో అనేక మంది పోరాటాలు చేసినా.. నిస్సహాయంగా, నిశ్శబ్దంగా ప్రేక్షకులుగా చూస్తూ వుండిపోవాల్సిన పరిస్థితులు అప్పట్లో వుండేవన్నారు.ఈ చరిత్ర అంతా అప్పటి సవాలును తెలియజేస్తుందని, ప్రస్తుతం భారత్ లోని ప్రతి యువకుడు ఓ తపనను, ఆ ఆవేశంతో వుండాలన్నారు. ప్రతీకారం అనే పదం సరైనది కాకపోవచ్చని అంగీకరిస్తూనే, చరిత్ర నుంచి వచ్చే ప్రతీకార భావన ఒక శక్తివంతమైన ప్రేరణగా మారాలని ఆయన పేర్కొన్నారు. “మన చరిత్రకు ప్రతీకారం తీర్చుకోవాలి. అది హింస ద్వారా కాదు. మన దేశాన్ని తిరిగి నిలబెట్టడం ద్వారా. మన హక్కులు, మన ఆలోచనలు, మన నమ్మకాలు ఆధారంగా ఒక గొప్ప భారతదేశాన్ని నిర్మించడం ద్వారా ఆ ప్రతీకారం సాధించాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
భారత్ ప్రాచీన నాగరికత అనేది అభివృద్ధి చెందిందని, శాంతియువతమైందని దోవల్ అభివర్ణించారు. కానీ.. భద్రతా రంగమే గతంలో నిర్లక్ష్యానికి గురైందని, ఈ పరిణామం కఠినమైన పాఠాలనే నేర్పించిందన్నారు.శత్రువులను, ముప్పులను తేలికగా తీసుకోవడం వల్లే చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. “భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసినప్పుడు చరిత్ర మనకు గుణపాఠం చెప్పింది. ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నామా? భవిష్యత్ తరాలు దాన్ని గుర్తుంచుకుంటాయా?” అని ఆయన ప్రశ్నించారు.
భవిష్యత్ తరాలు ఈ పాఠాన్ని మరిచిపోతే అదే దేశానికి అతిపెద్ద దురదృష్టమని స్పష్టం చేశారు. చరిత్రను మర్చిపోవడమే అత్యంత పెద్ద విషాదమని వ్యాఖ్యానించారు. భద్రత, స్వాభిమానం, జాతీయ విలువల విషయంలో అప్రమత్తత అత్యంత అవసరమని ఆయన యువతకు సూచించారు.