చర్చలంటూ మళ్లీ నాటకాలకు తెర లేపిన పాక్
పాకిస్తాన్ నోట మళ్లీ చర్చల మాట వచ్చింది. తాము కశ్మీర్ తో సహా అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. అయితే.. ఐక్యరాజ్య సమితికి చేసిన వాగ్దానాలను నెరవేర్చి, చర్చలకు భారత్ ముందుకు రావాలంటూ మళ్లీ డొంకతిరుగుడు మాటలు మాట్లాడారు. కశ్మీర్ సంఘీభావం దినం సందర్భంగా పీఓకే అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో పాక్ ప్రధాని చర్చల ప్రస్తావన తెచ్చారు. 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన నుంచి భారత్ బయటికి రావాలంటూ, ఐరాసకి చేసిన వాగ్దానాలను నెరవేర్చుతూ చర్చలు జరపాలన్నారు.1999 నాటి లాహోర్ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌లో పర్యటించినప్పుడు సంతకం చేసినట్టు, భారత్, పాక్‌ల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దుకోవడానికి చర్చలే ఏకైక మార్గమని షరీఫ్ అన్నారు.
పనిలో పనిగా భారత్ పై విషం గక్కారు. భారత్ ఆయుధాలను భారతదేశం ఆయుధాలు కూడబెట్టుకుంటోందని పాక్ ప్రధాని ఆరోపించారు. ఆయుధాలు శాంతి చేకూర్చవని, ఇవి ఈ ప్రాంత ప్రజల తలరాతను మార్చవంటూ షరీఫ్ చెప్పుకొచ్చారు. పురోగతికి మార్గం శాంతియే అంటూ షరీఫ్ నీతులు చెప్పుకొచ్చారు. ఇక కశ్మీరీ ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు సాకారం అయ్యే వరకు పాకిస్తాన్ తన దృఢమైన నైతిక, దౌత్య, రాజకీయ మద్దతును అందిస్తూనే ఉంటుందని షరీఫ్ అన్నారు. కశ్మీర్ సమస్యకు ఏకైక పరిష్కారం UNSC తీర్మానం ప్రకారం స్వయం నిర్ణయాధికార హక్కు మాత్రమే అని షరీఫ్ చెప్పుకొచ్చారు.