చిన్నారులకోసం నడిచి వెళ్లి మరీ…!!
మనకోసం కాకుండా మనచుట్టూ ఉన్నవారి సంతోషం కోసం జీవించినపుడే జీవితానికి పరమార్థం. ఇలాంటివి మాటల్లోనే కాకుండా ఆచరణలో కూడా చేసి చూపించే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారిలోనే ఒకరు మాధురీ మిశ్రా. అందరి ఆరోగ్యం కోసం ఆమె ఆరోగ్య కార్యకర్తగా మారి సేవలందించారు. ప్రత్యేకించి రోజుకు 8 కిలోమీటర్ల పాటు నడిచి వెళ్లి పల్లె ప్రాంతాల్లోని చిన్నారులకు టీకాలు వేయించి చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని నింపడానికి కృషి చేశారు. ఆమె పని చేసిన గ్రామాలకు చెందిన ప్రజల్లో వ్యాక్సినేషన్ పట్ల అవగాహన పెంపొందించడంతో వారిలో 90 శాతం రోగ నిరోధక శక్తి పెరగడం గమనార్హం. ఇలా మారుమూల గ్రామాల్లో సేవలనందించిన ఆ సేవామూర్తి ఇటీవలే పదవీ విరమణ తీసుకుంది. మరి ఆమె గురించి మనమూ తెలుసుకుందామా..
ఎన్నో అవరోధాలను ఎదుర్కొని మరీ 1983లో ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎమ్) గా పనుల్లో చేరింది మాధురి అయితే అయితే అంతకు ఐదేళ్ల ముందే తండ్రి మరణించడంతో ఏఎన్‌ఎమ్ కోర్సు పూర్తి చేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులెవరూ తనను చదివించడానికి ఆసక్తి చూపకపోవడంతో పార్ట్ టైమ్ జాబ్ చేయాల్సి వచ్చింది. అలా వచ్చిన డబ్బుతోనే ఓవైపు తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ మరోవైపు ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేయగలి గింది. అలా మూడున్నర దశాబ్దాల క్రితం ఆరోగ్య కార్యకర్తగా విధుల్లో చేరిన మాధురి అప్పటి నుంచి ఇప్పటివరకు ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వేలమంది పిల్లలకు వివిధ రకాల టీకాలు అందిం చారు. అక్కడి పల్లె ప్రజల్లో 90 శాతం రోగ నిరోధకశక్తి పెంపొందించేందుకు ఎంతో కృషిచేశారు.
ప్రజల్లో అవగాహన కల్పించి…
అయితే మాధురి ఏఎన్‌ఎమ్‌గా చేరడానికి ఐదేళ్ల ముందే భారత ప్రభుత్వం మశూచి నివారణకు ‘నేషనల్ ఇమ్యునైజేషన్ పోగ్రాం’ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దేశమంతా మశూచి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలనుకుంది. అయితే ఇప్పుడు కరోనా టీకాపై ఎన్ని అపోహలు వస్తున్నాయో అప్పట్లో మశూచి టీకాపై కూడా అన్నే అనుమానాలు ప్రజల్లో తలెత్తాయి. మశూచీ టీకాలు తీసుకుంటే వంధత్వం వస్తుందనీ, జ్వరంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని చాలామంది భయపడేవారు. దీంతో అప్పుడు ప్రజలు పిల్లలకు ఆ వ్యాక్సిన్లు వేయడానికి అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఆరోగ్య కార్యకర్తలను ఊరిలోకి కూడా రానిచ్చేవారు కాదు. అయినప్పటికీ మాధురి వెనక్కి తగ్గలేదు. ప్రతి పల్లె తిరిగి వారికి వ్యాక్సిన్ పట్ల అవగాహన కలిపిం చింది. ఇవి వేయకపోతే భవిష్యత్‌లో పిల్లలు ఎదుర్కొనే విపత్కర పరిస్థితులను వారికి వివరించింది. ఈ క్రమంలోనే రోజుకు 8 కిలో మీటర్లు నడిచి వెళ్లి పల్లె ప్రాంతాల్లోని చిన్నారులకు టీకాలు వేయించింది మాధురి.
కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలోనూ
ఇలా ఉద్యోగ విరమణ దశలోనూ పనిపై నిబద్ధతను చాటుకున్నారు మాధురి. అంతేకాదు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రోజుకు 12 గంటల చొప్పున విధులు నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.. ప్రత్యేకించి ఫతేబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె అందించిన సేవలు అభినందనీయమనీ, ఉద్యోగ విరమణ దశలోనూ ఎంతో నిక్కచ్చిగా విధులు నిర్వహించిన ఆమె ఉద్యోగపు చిట్టచివరి రోజు కూడా ఫ్రంట్‌లైన్ వారియర్లకు కొవిడ్ వ్యాక్సిన్‌లు అందించారనీ, ఆమెతో కలిసి పనిచేయడం మా అదృష్టమని ఆమెతో కలిసి పనిచేసిన ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు.
– లతాకమలం