చిన్మయ్ కృష్ణదాస్ కి ఊరట… బెయిల్ మంజూరు

ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ కి ఎట్టకేలకు ఊరట లభించింది. బుధవారం బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 6 నెలల తర్వాత కృష్ణదాస్ కి బెయిల్ వచ్చింది. గత యేడాది నవంబర్ 25 న ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాజద్రోహం కింద చిన్మయ్ కృష్ణదాస్ ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టుకి తరలించారు. మాతృభూమి పట్ల ఆయనకి గౌరవం వుందని, దేశద్రోహి కాదని చిన్మయ్ కృష్ణదాస్ తరపున న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయినా… ఆయనకు చాలా రోజుల పాటు బెయిల్ దొరకలేదు. బెయిల్ పిటిషన్ ను కోర్టు రద్దు చేసింది.
బంగ్లాదేశ్ జెండాను అవమానపరిచారని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయనతో సహా 18 మందిపై బంగ్లాదేశ్ సర్కార్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఓ ర్యాలీలో పాల్గొన్న సమయంలో బంగ్లా జాతీయ జెండాను అగౌరవ పరిచారని, పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగరేశారంటూ కేసులు పెట్టారు. దీంతో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులు, ఇస్కాన్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన తరపున వాదించే న్యాయవాదిపై దాడి కూడా జరిగింది. చాలా సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా… దొరక్కుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేసింది. చివరికి బుధవారం ఆయనకు బెయిల్ దొరికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *