జనాభా మార్పులతో అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిలో మార్పులు : వనవాసీ కల్యాణాశ్రమం

రాష్ట్రంలో మత స్వేచ్ఛా చట్టం 1978 ని వెంటనే కఠినంగా అమలు చేయాలని అఖిల భారతీయ వనవాసీ కల్యాణ్ ఆశ్రమం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బలవంతపు, మోసపూరిత మార్గాల్లో జరిగే మత మార్పిళ్లను అడ్డుకట్ట వేయడానికి 1978 చట్టాన్ని వెంటనే అమలు చేయాలని వనవాసీ కల్యాణాశ్రమం అఖిల భారతీయ అధ్యక్షులు సత్యేంద్ర సింగ్, ఉపాధ్యక్షుడు టేకీ గుబీన్ డిమాండ్ చేశారు. కలకత్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక స్థానిక తెగల మతం, సంస్కృతిని రక్షించడానికి, ప్రలోభాలు, ఒత్తిడి లేదా మోసం ద్వారా ఒక మతం నుండి మరొక మతానికి మతమార్పిడులను నిరోధించడానికి, ప్రభుత్వ రికార్డులలో అటువంటి మార్పిడులను నమోదు చేయడానికి ఈ చట్టం రూపొందించబడిందన్నారు.
చట్టం రూపొందించి 47 సంవత్సరాలు గడిచినా, అమలు సరిగ్గా లేకపోవడంలో రాష్ట్రంలోని జనాభాలో గణనీయమైన మార్పులు సంభవిస్తున్నాయని వీరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.70లలో అరుణాచల్‌ ప్రదేశ్‌ జనాభాలో 1 శాతం కూడా లేని క్రైస్తవులు, 2011 జనాభా లెక్కల ప్రకారం 31 శాతానికి పెరిగారని పేర్కొన్నారు.అరుణాచల్ ప్రదేశ్ లో మతమార్పిడిని నిషేధిస్తూ హైకోర్టు సూచించిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సత్యేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. బలవంతపు మతమార్పిళ్లు నిరంతరం పెరుగుతూనే వున్నాయని, ఇది అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో అరుణాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. అరుణాచల్ సర్కార్ దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం అక్కడి గిరిజనుల సాంస్కృతిక గుర్తింపే ప్రమాదం పడే అవకాశం వుందన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ అటవీ వాసుల సంప్రదాయ హక్కులను హరిస్తున్నారని ఇది సరికాదని హెచ్చరించారు.అడవుల్లో నివసించే సమాజంలోని సంప్రదాయాలు, మత స్వేచ్ఛను కాపాడేందుకు హైకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *