జమ్మూ కశ్మీర్ క్లౌడ్ బస్టర్డ్ : 60 మంది మృతి… 100 మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్ కొండల్లో క్లౌడ్ బస్టర్డ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60 కి చేరుకుంది. మరో 100 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. గల్లంతైన వారి కోసం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. అయితే మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరో వైపు ప్రధాని మోదీ కూడా సీఎంతో చర్చించారు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని తెలిపారు.
చోసితి గ్రామంలో ఎటుచూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. హఠాత్తుగా వచ్చిన వరదలకు దాదాపు గ్రామమంతా తుడిచిపెట్టుకుపోయింది. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. గత నెల 25న మొదలైన మాచైల్ మాతా యాత్రలో భాగంగా చోసితి నుంచి భక్తులు కాలినడకన 8.5 కి.మీ. మేర కొండలు ఎక్కుతూ 9500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుడికి చేరుకోవాల్సి ఉంటుంది. కిష్ట్వార్ పట్టణానికి 90 కి.మీ. దూరంలో చోసితి ఉంటుంది. బేస్ పాయింట్‌లో మెరుపు వరదలు సంభవించిన వెంటనే కిష్ట్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్‌కుమార్ శర్మ రంగంలోకి దిగారు. సహాయక బృందాలను అక్కడికి తరలించడంతో పాటు ఆయన స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లారు.

మచైల్ మాతా యాత్ర ప్రారంభమయ్యే ఛషోటి ప్రాంతంలో ఈ క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. మాతా చండీ ఆలయానికి వెళ్లే చివరి గ్రామం అదే కావడం గమనార్హం. మాతా చండీ ఆలయానికి వెళ్లేందుకు యాత్రికులు నదిని దాటుతుండగా.. ఈ ప్రమాదం సంభవించింది. ఈ అనూహ్య ఘటనతో అధికారులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.