జమ్మూ కశ్మీర్ నిజమైన చరిత్రను చెప్పి, తప్పుడు కథనాలను సరిదిద్దాలి : ఎల్జీ మనోజ్ సిన్హా
జమ్మూ కశ్మీర్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. దాల్ సరస్సు ఒడ్డున కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేషంగా తరలి వచ్చారు. సమకాలీన సాహిత్యం, చరిత్ర, మీడియా, కళలు, సాంకేతికత, సాంస్కృతిక వారసత్వంపై పలు కాలాంశాలు జరిగాయి. విభిన్న రంగాలకు సంబంధించిన 50 మందికి పైగా నిపుణులు హాజరయ్యారు. అలాగే కశ్మీర్ సాహిత్యానికి సంబంధించిన పలు పుస్తకాలు, కశ్మీర్ సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా జరిగాయి.
చివరి రోజు కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జమ్మూ కశ్మీర్ గురించి వ్యాప్తిలో వున్న తప్పుడు కథనాలను వెంటనే సరిదిద్దాలని, వాస్తవ సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారతదేశ నాగరికత నీతి ఎల్లప్పుడూ జ్ఞానం మరియు పాండిత్యానికి గొప్ప విలువను ఇస్తుందని సిన్హా అన్నారు.ఇటువంటి ఉత్సవాలు జ్ఞానం, సంస్కృతి మరియు సృజనాత్మకతకు నిలయంగా కాశ్మీర్ గుర్తింపును పునరుద్ఘాటిస్తాయని పేర్కొన్నారు.అయితే రచయితలు చాలా లోతైన పరిశోధనలు చేసి, తప్పుదారి పట్టించే చారిత్రక కథనాలను సరిదిద్దాల్సిన గురుతర బాధ్యతను నెరవేర్చాలని సూచించారు. జమ్మూ కశ్మీర్ కి సంబంధించిన నిజమైన చరిత్రను ఎలాంటి భయాలు లేకుండా ప్రజలకు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.