జమ్మూ కశ్మీర్ లో విదేశీ దౌత్యవేత్తల బృందం… పోలింగ్ సరళి పరిశీలన
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్ బుధవారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను 16 దేశాలకు చెందిన దౌత్యవేత్తల బృందం పరిశీలిస్తుంది. అందులోభాగంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఈ ప్రతినిధుల బృందం పర్యటిస్తుంది. ఆ క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకొనేందుకు బారులు తీరిన ప్రజలతో ఈ ప్రతినిధుల బృందం మాట్లాడింది.
దాదాపు దశాబ్దం తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నిక పోలింగ్‌ను పరిశీలించేందుకు 16 మంది విదేశీ దౌత్యవేత్తల బృందం ఈ రోజు ఉదయం శ్రీనగర్ చేరుకుంది. ఈ ప్రతినిధి బృందానికి యూఎస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జోర్గాన్ అండ్రూస్ నేతృత్వం వహిస్తున్నారు. మరో రెండు రోజులపాటు రాష్ట్రం ఈ దౌత్యవేత్తల బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలతో ఈ బృందం భేటీ కానుంది. ఈ ప్రతినిధి బృందం వెంట భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
బుధవారం 7 గంటలకు ఆరు జిల్లాలలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 3502 పోలింగ్ బూత్ లలో పోలింగ్ పక్రియ ప్రారంభమైనది. 25 లక్షల మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు 45.12 శాతం ఓట్లు పోలయ్యాయి. పీర్‌పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల పట్ల విదేశీ ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తిం చేసిందని తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
జమ్మూ కశ్మీర్‌లో రెండు, మూడు విడతల్లో ఎన్నికలు పోలింగ్ జరగనుందని, వాటిని పరిశీలించేందుకు న్యూఢిల్లీలోని వివిధ రాయబార కార్యాలయాల ద్వారా వివిధ దేశాల నుంచి 20 మంది దౌత్యవేత్తలను ఆహ్వానించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. 2019లో మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.
ఈ నేపథ్యంలో ఏ పార్టీకి జమ్మూ కశ్మీర్ ఓటరు పట్టం కడతాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలున్నాయి. ఈ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 18న తొలి విడత పోలింగ్ పూర్తయింది. రెండో విడత నేడు జరుగుతుంది. ఇక మూడో విడత అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. తొలి విడతలో 61 శాతానికిపైగా పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.