జీవిత పరమార్థాన్ని సంఘ్ తెలిపింది : ప్రధాని మోదీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వల్లే తన జీవితానికి పరమార్థం తెలిసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సంఘ్ ద్వారా క్రమశిక్షణతో మెలిగే లక్షణం అలవడిందని, జీవిత లక్ష్యం కూడా సుస్పష్టంగా తెలిసొచ్చిందన్నారు. అలాగే ఆరెస్సెస్ లోతైన కర్తవ్య భావాన్ని పెంపొందిస్తుందని, అన్నింటి కంటే మించి, దేశ సేవకే అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
అమెరికన్‌ పాడ్‌క్యాస్టర్‌, కంప్యూటర్‌ శాస్త్రవేత్త లెక్స్‌ ఫ్రీడ్‌మన్‌ నిర్వహించిన షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. ఆయన జీవితం, తత్వశాస్త్రం, ప్రధాని అయ్యే వరకు తన రాజకీయ ప్రయాణం, ఆరెస్సెస్ లో స్వయంసేవక్ గా ప్రారంభమైన రోజులు… ఇలా అనేక విషయాలను స్పృశించారు.
తాను ఆచరిస్తున్న ఈ విలువలన్నింటికీ మూలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వల్లే అని, ఈ ఘనత ఆరెస్సెస్ దే అని తేల్చి చెప్పారు. తమ గ్రామంలో శాఖా నడిచేదని, అక్కడ ఆటలు ఆడుకునేవారమని, దేశభక్తి గీతాలు (గీత్) ఆలపించేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఈ గీత్ లే తనను లోతుగా స్పృశించాయని, చాలా ప్రభావం పడిందని తెలిపారు. తన మనసును ఎంతో కదిలించాయన్నారు. చివరికి తాను స్వయంసేవక్ గా మారిపోయానని అన్నారు. చాలా మంది సాధు సంతుల సాంగత్యం కూడా తనకు లభించిందన్నారు.
‘‘నువ్వు ఏం చేసినా దానికొక ప్రయోజనం ఉండాలి. చదువుతున్నప్పుడు.. దేశానికి అవసరమైనంత వరకు చదవాలి.. వ్యాయామం చేసేటప్పుడు కూడా.. మీ దేహదారుఢ్యం దేశసేవకు ఉపయోగపడేదిగా ఉండాలని అక్కడ బోధించేవారు. దీనిని మన రుషులు కూడా చెప్పారు. వివేకానంద కూడా చెప్పాడు. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ వందో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఇంత పెద్ద స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలో ఎక్కడా ఉనికిలోనే లేదు. అయితే ఆరెస్సెస్ ను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. ఇలాంటి ఉన్నత సంస్థ నుంచి క్రమశిక్షణతో పాటు జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడంతో నా జన్మ తరించిందని భావిస్తున్నాను.’’ అని మోదీ పేర్కొన్నారు.
ఇక… సంస్థాగత నిర్మాణంతో పాటు సంఘ్ చేపడుతున్న విస్తృతమైన సామాజిక కార్యక్రమాలను కూడా ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజమైన స్వచ్ఛంద సేవకుడు సమావేశాలకు హాజరవ్వడం వల్లనో, యూనిఫాం ధరించడం ద్వారానో నిర్వచించబడడని, కానీ.. తాను సమాజానికి చేసే సేవల ద్వారానే నిర్వచించబడతాడని అన్నారు. ఇదే ప్రేరణ సంఘ్ ఇస్తుందని వివరించారు.
సేవా భారతి ద్వారా మురికివాడల్లో నివసిస్తున్న పేద వారి కోసం కార్యక్రమాలు చేస్తుందని, వీటిని సేవా బస్తీలు అని పిలుస్తారని తెలిపారు. ప్రభుత్వ సాయం తీసుకోకుండా, కేవలం సమాజ మద్దతు ద్వారా సేవా చేస్తోందని తెలిపారు. సేవా బస్తీల్లోని పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం, వారిలో సంస్కారం నడపడం, వారి ఆరోగ్య సంరక్షణ, విలువలు, పారిశుద్ధ్యంపై దృష్టి పెడుతుందని తెలిపారు.
అలాగే మరి కొందరు స్వయంసేవకులు వనవాసీ కల్యాణాశ్రమం నడిపిస్తారని, వనవాసుల మధ్యలో వుంటూ… వారితో గడుపుతూ 70 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా నడుపుతున్నారని తెలిపారు.అలాగే విద్యా రంగంలో విద్యా భారతి కూడా విశేషంగా కృషి చేస్తోందన్నారు. కోట్లాది మంది పిల్లల భవిష్యత్తును మార్చేస్తోందన్నారు.అతితక్కువ ఫీజులు తీసుకుంటూ… చదువు చెబుతూ, వారిలో విలువలను కూడా పెంపొందిస్తోందని అభినందించారు.
ఇక… కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. కోట్లాది మంది సభ్యులు కూడా వున్నారని, ప్రపంచంలోనే బీఎంఎస్ అతిపెద్ద కార్మిక సంఘం అని అన్నారు. ‘‘ప్రపంచ కార్మికుల్లారా ఏకం కండి..’’ అని వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునిస్తాయని, కానీ… స్వయంసేవకులు నడిపించే భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రం ‘‘కార్మికుల్లారా ప్రపంచాన్ని ఏకం చేయండి.. ’’ అని పిలుపునిస్తారన్నారు. శబ్దాలు అటు ఇటుగా వున్నా… సైద్ధాంతంలో చాలా వైరుధ్ధ్యం వుందన్నారు. ఈ పనులను, సేవా కార్యక్రమాలను క్షుణ్ణంగా చూస్తే… 100 సంవత్సరాలలో ఆరెస్సెస్ ప్రచారానికి దూరంగా వుంటూ.. సాధకుల లాగా, అత్యంత సమర్పిత భావంతో పనిచేస్తోంది. ఇంతటి పవిత్రమైన సంఘటనతో తనకు సంస్కారాలు అబ్బాయని, జీవితానికి ఓ పరమార్థం లభించిందని మోదీ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *